న్యాయమే గెలిచింది!

గిరిపురంలోని రంగయ్య దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని బండికి కట్టేవాడు. ప్రయాణికులు, సరకులను చేర్చడానికి ఆ గుర్రపుబండిని ఉపయోగించేవాడు. అలా ఉదయం నుంచి రాత్రి దాకా గుర్రపుబండిని పరుగులు తీయిస్తూ బాగా సంపాదించేవాడు. గుర్రం కష్టపడుతూ చాలా సంవత్సరాలు రంగయ్య కుటుంబాన్ని పోషించింది. కానీ ప్రస్తుతం వయసు పైబడటం వల్ల అది మునుపటిలా వేగంగా పరిగెత్తడం లేదు. బండిని కూడా లాగలేకపోతోంది.

Updated : 01 Sep 2021 05:31 IST

గిరిపురంలోని రంగయ్య దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని బండికి కట్టేవాడు. ప్రయాణికులు, సరకులను చేర్చడానికి ఆ గుర్రపుబండిని ఉపయోగించేవాడు. అలా ఉదయం నుంచి రాత్రి దాకా గుర్రపుబండిని పరుగులు తీయిస్తూ బాగా సంపాదించేవాడు. గుర్రం కష్టపడుతూ చాలా సంవత్సరాలు రంగయ్య కుటుంబాన్ని పోషించింది.

కానీ ప్రస్తుతం వయసు పైబడటం వల్ల అది మునుపటిలా వేగంగా పరిగెత్తడం లేదు. బండిని కూడా లాగలేకపోతోంది. ఇక ఈ గుర్రంతో వేగలేనని, దానికి తిండి పెట్టడం కూడా దండగని దాన్ని ఇంటి నుంచి తరిమేశాడు.

గుర్రం మెల్లిగా నడుస్తూ ఊరుదాటి పక్క గ్రామమైన ధర్మాపురం పొలిమేరలకు చేరుకుని నీరసించి పడిపోయింది. ఆ ఊరికి చెందిన ధర్మయ్య గుర్రాన్ని చూసి జాలిపడ్డాడు. దానికి నీళ్లు, తిండి అందించాడు. తన ఇంటికి తీసుకువెళ్లాడు. గుర్రానికి మంచి తిండి పెట్టి పోషించడం ఎలా అని ఆలోచించాడు. చివరకు ధర్మయ్యకు ఒక ఉపాయం తట్టింది.

ఉదయాన్నే గుర్రాన్ని తీసుకుని పొరుగున ఉన్న పట్నానికి వెళ్లాడు. దానిపైన పిల్లలను కూర్చుండబెట్టి మెల్లిగా అటూఇటూ నాలుగుసార్లు తిప్పి, అందుకుగాను కొంత డబ్బు తీసుకోసాగాడు. అలా దాన్ని పెద్దగా శ్రమపెట్టకుండానే ధనాన్ని రాబట్టేవాడు. అందులోంచి గుర్రం పోషణకు ఖర్చు పెట్టేవాడు.

ఒకసారి గిరిపురంలో ఇలానే గుర్రాన్ని తిప్పుతూ రంగయ్య కంటపడ్డాడు. తాను పనికిరాదని తన్ని తరిమేసిన గుర్రాన్ని ధర్మయ్య ఇలా నేర్పుతో ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకోవడం చూసి రంగయ్యకు కడుపు మండింది. గుర్రం తనదని, ధర్మయ్య ఇంతకాలం ఉపయోగించుకుని ధనం సంపాదించుకున్నందుకు తనకు గుర్రంతోపాటు ధనమూ ఇవ్వాలని వాదనకు దిగాడు. న్యాయాధికారికి ఫిర్యాదు చేశాడు. ఆ ఊరివాళ్లు ‘గుర్రం రంగయ్యదే’ అని సాక్ష్యం చెప్పారు.

ధర్మయ్య చెప్పింది కూడా విన్న తర్వాత.. ‘ఇంతకాలం గుర్రాన్ని ధర్మయ్య పోషించాడు. దానికి ఎంతోకొంత ఖర్చు అయి ఉంటుంది కదా! అందుకే ధర్మయ్య ఏమీ ఇవ్వాల్సిన పనిలేదు. నీ గుర్రాన్ని నువ్వు తీసుకెళ్లు’ అని న్యాయాధికారి రంగయ్యతో చెప్పాడు. కానీ గుర్రం రంగయ్య వెంట వెళ్లడానికి గింజుకుంది. కన్నీరు కారుస్తూ ధర్మయ్య వైపు చూసింది. గుర్రం కళ్లెంను వదలమని న్యాయాధికారి రంగయ్యతో చెప్పాడు. రంగయ్య తాడును వదిలేయగానే గుర్రం ధర్మయ్య దగ్గరకు వెళ్లి నిల్చుంది.

ఈలోగా ఒక వ్యక్తి వచ్చి న్యాయాధికారి చెవిలో ఏదో చెప్పాడు. ‘నీ గుర్రం తప్పిపోయి ధర్మయ్యకు దొరకలేదు. నిజంగా అది తప్పిపోయి ఉంటే నువ్వు ఆ రోజే ఫిర్యాదు చేసి ఉండేవాడివి. నా మనిషిని పంపి, నువ్వు ఉంటున్న వీధిలో విచారణ చేయించాను. గుర్రం ముసలిదైందని దానికి తిండి దండగని స్వార్థంతో దాన్ని తన్ని తరిమేసి కొత్తదాన్ని కొనుక్కున్నావు. ఈ రోజు ధర్మయ్య చేస్తున్న పని చూడగానే తిరిగి గుర్రంతో సంపాదించుకోవాలని ఆశపడి ఫిర్యాదు చేశావు. ధర్మయ్య దాన్ని చక్కగా చూసుకుంటున్నాడు కాబట్టే అది అతని దగ్గరకు వెళ్లింది. తప్పుడు ఫిర్యాదు చేసినందుకు నీకు వెయ్యి వరహాలు జరిమానా విధిస్తున్నా. వాటిని నీ చేతులతోనే ధర్మయ్యకు అందించు. అతను వాటిని గుర్రం పోషణ కోసం ఉపయోగిస్తాడు’ అని న్యాయాధికారి తీర్పు ఇచ్చాడు.

- డి.కె.చదువుల బాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని