రాజుకు రోగం... వైద్యుడికి వైద్యం!

విక్రమపురికి రాజు ప్రతాపవర్మ. ఆయన కొన్నాళ్లుగా రేచీకటితో బాధపడుతున్నారు. చీకటి పడుతుందంటే చాలు.. ఆయనలో భయం మొదలవుతుంది. చూపు సరిగా లేకపోవడంతో ఆయన చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. అలాగనీ తన సమస్య ఇతరులకు చెప్పలేరు. తెలిస్తే తనకు అగౌరవం. దాంతో తన ఆస్థాన వైద్యుడిని పిలిచి తన సమస్యను చెప్పి నయం చేయవలసిందిగా కోరారు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, బయటకు పొక్కితే

Updated : 26 Dec 2021 05:24 IST

విక్రమపురికి రాజు ప్రతాపవర్మ. ఆయన కొన్నాళ్లుగా రేచీకటితో బాధపడుతున్నారు. చీకటి పడుతుందంటే చాలు.. ఆయనలో భయం మొదలవుతుంది. చూపు సరిగా లేకపోవడంతో ఆయన చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. అలాగనీ తన సమస్య ఇతరులకు చెప్పలేరు. తెలిస్తే తనకు అగౌరవం. దాంతో తన ఆస్థాన వైద్యుడిని పిలిచి తన సమస్యను చెప్పి నయం చేయవలసిందిగా కోరారు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, బయటకు పొక్కితే నీ తల తీసేస్తానంటూ హెచ్చరించారు రాజు.

రాజు చెప్పింది విన్న వైద్యుడికి కాళ్లు వణికిపోయాయి. ఎందుకంటే తను విన్న ఏ విషయమైనా వేరొకరితో చెప్పకపోతే నిద్ర పట్టదు. అలాగని రాజుగారి రోగం సంగతి చెబితే ప్రాణానికే ప్రమాదం. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. మిఠాయి దుకాణానికి వెళ్లి ఒక్క మాట కూడా మాట్లాడకుండా, సైగల ద్వారానే కిలో మిఠాయిలు కొనుక్కుని నేరుగా ఇంటికి వెళ్లాడు. తన చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక, తను తెచ్చుకున్న మిఠాయి పొట్లం తెరచి ఒక మిఠాయిని చేతిలోకి తీసుకుని.. రాజుగారి రోగం సంగతి చెప్పాడు. ‘హమ్మయ్య! ఇంక విషయం చెప్పేశాను. ప్రశాంతంగా ఉంది’ అని మనసులో అనుకుని ఆ మిఠాయిని నోట్లో వేసుకున్నాడు. పళ్లెంలో మిగిలిన మిఠాయిలు ‘రాజుగారికి రేచీకటి వచ్చిందన్నమాట’ అని అరవడం మొదలుపెట్టాయి. ‘అమ్మో! ఈ మిఠాయిలు నా ప్రాణం తీసేలా ఉన్నాయి’ అనుకుని ఒక్కొక్కటి తీసుకుని తినడం మొదలుపెట్టాడు. అలా కిలో మిఠాయిలు కష్టపడి తినేశాడు.

అన్నీ తిన్నాక భుక్తాయాసంగా ఉండటంతో.. కాసేపు అటూ ఇటూ నడుద్దామని పెరట్లోకి వెళ్లాడు. అక్కడ ఉన్న గుమ్మడి కాయ వైద్యుడిని చూసి ‘రాజుగారికి రేచీకటి వచ్చిందా..?’ అని అడిగింది. వైద్యుడు తలపట్టుకుని ‘నీకెలా తెలుసు..’ అని అడిగాడు. ఇందాక నువ్వు తిన్న మిఠాయిలు అరుస్తుంటే విన్నానులే’ అంది గుమ్మడికాయ. ‘మేం కూడా విన్నాం’ అన్నాయి పెరట్లోని మొక్కలు. వైద్యుడి మతిపోయింది. ఈ లెక్కన ఇంకెంతమందికి తెలిసిపోయిందోనని భయపడిపోయాడు. గబగబా పెరట్లోని కూరగాయలన్నీ కోసి ఇంట్లోకి తీసుకెళ్లి అన్నింటినీ వండేశాడు. అంతా కలిపి పెద్ద గిన్నెడు వంటకం తయారయ్యింది. ఏది ఏమైనా అది మొత్తం తినేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ అంత తిండి తింటే అనారోగ్యంతో ప్రాణం పోతుందేమోనని భయం వేసింది. అయినా సరే నెమ్మదిగా తినడం మొదలు పెట్టాడు. వైద్యుడి అవస్థ చూసి వంటపాత్రలు నవ్వుకుంటున్నాయి. బియ్యం బస్తా వెనుక దాగున్న ఎలుకలకి వైద్యుడి తిప్పలు భలే తమాషాగా అనిపించాయి. ‘అంత కష్టపడి.. తినలేక తినడం ఎందుకు..?’ అని గుసగుసగా అందో చిట్టెలుక. మిగిలిన ఎలుకలన్నీ ‘అరవకు.. వైద్యుడు విన్నాడంటే మనల్ని కూడా తినేస్తాడు’ అని కోప్పడ్డాయి.

అంత తిండి తినేసరికి వైద్యుడి పొట్ట బానలాగ తయారయ్యింది. కాసేపటికి కడుపు నొప్పితో దొర్లడం మొదలుపెట్టాడు. అది చూసి చిట్టెలుక పగలబడి నవ్వింది. ‘ఎదుటి వాళ్లు బాధలో ఉంటే నవ్వడం తప్పు’ అని మిగతా ఎలుకలు దాన్ని మందలించాయి. ‘ఏ విషయాన్నీ దాచుకోలేని అతని అలవాటు వలనే అతనికి ఈ స్థితి వచ్చింది. దానికి మనమేం చేస్తాం’ అంది ఒక గడసరి ఎలుక.

‘వైద్యుడు మాట దాచుకోలేడు కానీ మంచివాడే! ఇన్నాళ్లుగా మన కుటుంబం అంతా అతనింట్లోని బియ్యం, కూరగాయలు తినే జీవిస్తోంది. అతని రుణం తీర్చుకునే సమయం వచ్చింది. నాకు తెలిసిన ఒక వైద్యుడు ఉన్నాడు. అతని దగ్గరకు పోయి సహాయం అడుగుతా’ అంటూ బయలుదేరింది ఒక ఎలుక. రాజుగారు వైద్యుడి రాకకోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే అంగరక్షకుడు వైద్యుడి రాకను తెలియజేశాడు. తన సమస్యకు పరిష్కారం రాబోతున్నందుకు ఆనందంతో వైద్యుడిని ఆహ్వానించారు రాజుగారు. వైద్యుడు రాజుగారి కళ్లలో మందు వేసి కాసేపాగి కళ్లు తెరవమన్నాడు. రాత్రివేళ కూడా రాజుగారికి స్పష్టంగా కనబడింది. కానీ వైద్యుడిని చూసి రాజుగారికి చాలా కోపం వచ్చింది. ‘నువ్వు మా ఆస్థాన వైద్యుడివి కాదు. నీకెలా తెలిసింది నా సమస్య గురించి?’ అని భటుల్ని పిలిచి, వైద్యులిద్దరి తలల్ని తీసేయమని చెప్పాడు రాజు. వైద్యుడిని భటులు తీసుకెళ్లబోతుండగా ఎలుక రాజుగారి ఎదుటకు వచ్చి ‘రాజా! మీరు మీ సమస్య మీ ఆస్థాన వైద్యుడికి చెబుతుండగా నేను విన్నాను. తర్వాత మీ వైద్యుడికి అనారోగ్యం చేసింది. మీ సమస్యకు సత్వర పరిష్కారం చూపించాలన్న ఉద్దేశంతో నేనే నాకు తెలిసిన కొత్త వైద్యుణ్ని తీసుకువచ్చాను’ అని చెప్పింది.

రాజుగారు తన తొందరపాటుకు సిగ్గుపడి ఎలుక చేసిన మేలుకు ప్రశంసించారు. తనను రక్షించడానికి ఎలుక చూపిన సమయస్ఫూర్తికి అక్కడున్న వైద్యుడు కూడా ఆశ్చర్యపోయాడు. రాజు దగ్గర సెలవు తీసుకుని ఎలుక ఈ వైద్యుడితో ఆ వైద్యుడి ఇంటికి వెళ్లింది. అప్పటికే కొత్త వైద్యుడు ఇచ్చిన మందుల వల్ల ఆస్థాన వైద్యుడు కోలుకుంటున్నాడు. రాజుగారి వద్ద జరిగినదంతా తెలుసుకున్న వైద్యుడు తనకు మేలు చేసిన ఎలుకకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. సమయానికి వైద్యం అందించి తనను రక్షించిన వైద్యుడికి నమస్కరించాడు. రాజుగారి రోగం వల్ల అందరికీ అనవసర విషయాలను చెప్పే తన జబ్బు నయం అయిందనుకున్నాడు ఆస్థాన వైద్యుడు.

- హారిక చెరకుపల్లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని