Published : 23 Oct 2022 16:31 IST

Food Habbits: ఆహారం సగం బలం... అవగాహన నిజం బలం

తిండి (Food) లేని రోజు లేదు... అపోహ లేని ఆహారం ఉండదు! అన్నం.. నీళ్లు... పప్పు.. కూర... పాలు.. పెరుగు... చక్కర.. బెల్లం... ఇలా మన దైనందిన ఆహారం ఏదైనా తీసుకోండి... దాని చుట్టూ తేనెతుట్టెలా పట్టుకుని బోలెడు అపోహలు వేళ్లాడుతుంటాయి! మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన తిండి తినాలి. ముందు అదేమిటో మనకు తెలియాలి. అంతకంటే ముందు మనం నానా రకాల అపోహల నుంచి బయటపడాలి! 

ఖరీదు

ఖరీదైన ఆహారంలోనే పోషకాలు ఎక్కువ ఉంటాయనీ, కాస్త చౌకగా దొరికే ఆహారంలో పోషకాలుండవని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది వట్టి అపోహే! ‘మంచి పోషకాహారం తినటం బాగా డబ్బులున్న వాళ్లకే సాధ్యంగానీ మనకెక్కడ కుదురుతుందని’ చాలామంది భావిస్తుంటారు. కానీ తక్కువ ఖరీదులో దొరికే చాలా పదార్థాల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయని గుర్తించటం అసవరం. నిజానికి ఇవాళా రేపూ ఆహార పదార్థాలన్నీ కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటున్నాయి. కాదనలేం. ఇటువంటి పరిస్థితుల్లోనే కాస్త ఖరీదు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవటం అవసరం. చాలామంది ఆపిల్‌ పండ్లలో పోషకాలు ఎక్కువ ఉంటాయని భావిస్తూ, ఎంత ఖరీదైనా వాటినే తెచ్చి పిల్లలకు పెడుతుంటారు.

నిజానికి కాస్త ఖరీదు తక్కువగా ఉండే బొప్పాయిలో కూడా పోషకాలు సమృద్ధిగానే ఉంటాయి. మామిడిలో ఉన్నట్టే బొప్పాయిలోనూ విటమిన్‌-ఏ ఉంటుంది, పైగా ఇది ఏడాదంతా దొరుకుతుంది. కాబట్టి చౌకగా దొరికేదాన్ని తక్కువగా చూడటంగానీ, ఖరీదెక్కువ కాబట్టి ఆపిల్‌ వంటివాటిలోనే పోషకాలు ఎక్కువుంటాయని భావించటంగానీ సరికాదు. అలాగే బాగా పాలిష్‌ పట్టిన తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యం మంచివి. నిజానికి పాలిష్‌ తక్కువ పట్టిన బియ్యం ఇంకా ఖరీదు తక్కువగా ఉండాలి. అలాగే ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాలు.. ఇవన్నీ మంచి పోషకాలనిచ్చేవే. పోషకాహారంపై చక్కటి అవగాహన పెంచుకుని, అందుబాటులో ఉన్న మంచి పదార్థాలన్నింటినీ తినటం మంచిది.

మసాలా 

మసాలా పదార్థాలు ఎక్కువగా తింటే పొట్టలో అల్సర్లు వస్తాయని నమ్ముతుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. పేగుల్లో పుండ్లు పడటాన్ని అల్సర్లు అంటారు. సాధారణంగా మసాలా పదార్థాల వల్ల ఈ పుండ్లు రావు. తీవ్రమైన ఒత్తిడికి గురికావటం, అస్తవ్యస్తమైన ఆహారపుటలవాట్లు, నొప్పుల బిళ్లల వంటివి ఎక్కువగా వాడటం వంటి వాటి వల్ల పేగుల్లో పుండ్లు వస్తాయి. ముఖ్యంగా హెలికో బ్యాక్టర్‌ పైలోరీ వంటి సూక్ష్మక్రిమి వల్ల ఇవి ఏర్పడుతున్నాయని వైద్య పరిశోధనల్లో స్పష్టంగా గుర్తించారు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవటం, శుభ్రమైన ఆహారం తీసుకోవటం వంటివి ముఖ్యం. ఒకసారి అల్సర్లు ఏర్పడిన తర్వాత మాత్రం మసాలా పదార్థాలను మానెయ్యటం అవసరం. దాల్చిన చెక్క, లవంగం మొగ్గవంటి మసాలా పదార్థాల వల్ల అల్సర్లు వస్తాయనుకోనక్కర లేదు. కాకపోతే ఈ మసాలాల వల్ల అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి అంతా వీటిని చాలా మితంగా తీసుకోవటమే మంచిది.

పాలకూర

పాలకూర, టమోటాలు కలిపి తింటే జబ్బు చేస్తుందని చాలామంది చెబుతుంటారుగానీ.. ఇది పూర్తి నిజం కాదు. ఆ రెండూ కలిపి వండేవాళ్లూ, తినేవాళ్లూ చాలామంది ఉన్నారు. దానివల్ల ఎలాంటి సమస్యలూ ఉండవు కూడా. కాకపోతే చాలా కొద్దిమందిలో ముఖ్యంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా కూర్చుని పని చేయటం వంటి జీవనశైలి ఉన్నవారిలో- కొన్ని రకాల రసాయనాలు బాగా పేరుకున్నట్టయ్యే అవకాశం ఉంటుంది. పాలకూర, టమోటాల్లో ఆక్సలేట్‌ ఉంటుంది. ఈ రెంటినీ కలిపి వండటం వల్ల వాటిలోని ‘క్యాల్షియం ఆక్సలేట్‌’ రసాయనం పేరుకున్నట్టై క్రమేపీ అది చిన్నచిన్న రాళ్లలా తయారవుతుంది. ఇలా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి. ఇలా కిడ్నీల్లో రాళ్లు వచ్చిన, వస్తున్న శారీరక తత్వం ఉన్న వారు... వీటిని కలిపి తినకుండా ఉండటం ఉత్తమం. ఇలాంటి సమస్యలేమీ లేనివారు ఆ రెంటినీ నిశ్చింతగా కలిపి తినొచ్చు.

నూనెలు

అస్సలు నూనె లేకుండా వండుకోవటం (జీరో ఆయిల్‌ కుకుంగ్‌) గుండెకు మంచిదని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇందులో నిజం లేదు. అస్సలు నూనె అనేది లేకుండా ఉడకబెట్టేసుకు తినమని చెప్పటం సరికాదు. నూనెల నుంచి వచ్చే పోషకాలు, శక్తి-క్యాలరీలు కూడా మన శరీరానికి అవసరం. మనం తినే ఆహారంలో, ఆహారం ద్వారా మనకు లభించే క్యాలరీల్లో కనీసం 20% నూనెల నుంచి రావటం ఎంతైనా అవసరం. నూనెల నుంచి మన శరీరానికి అత్యవసరమైన కొవ్వు ఆమ్లాలు (ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్స్‌) కొన్ని లభిస్తాయి. మన శరీరంలో కొన్ని జీవక్రియలు సజావుగా జరగాలంటే కొవ్వు తప్పనిసరి. అలాగే ఎ, బి, ఇ, కె విటమిన్లు కేవలం కొవ్వులో మాత్రమే కరుగుతాయి, కొవ్వు ఉంటేనే ఇవి మన ఒంటికి పడతాయి.

కాబట్టి ఇవన్నీ సజావుగా జరగాలంటే మన ఆహారంలో నూనె, కొవ్వు తప్పనిసరిగా ఉండాలి. అది అస్సలు లేకుండా వంటలు చేస్తుంటే- రకరకాల చర్మ సమస్యలు, విటమిన్‌ లోపాల వంటి రుగ్మతలు మొదలవుతాయి. మరోవైపు నూనె అవసరమంటున్నారు కదా అని.. వాటిని విపరీతంగా తినకూడదు. దానివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. చక్కటి ఆరోగ్యానికి మితంగా అంటే రోజుకు మనిషికి 20 గ్రాములకు మించకుండా నూనె వాడుకోవటం అవసరం. శరీరానికి అన్ని పోషకాలూ అవసరం, కానీ వాటిని మితంగా, సమతులంగా తీసుకోవటం మంచిది. ఆపిల్‌లో తొక్కలోనే పోషకాలు ఎక్కువ, లోపల ఉండేదంతా వట్టి పిండి పదార్థమే. పిండిపదార్థం మనం తినే వరి అన్నం వంటి వాటి నుంచి దండిగానే లభిస్తుంది. కాబట్టి ఆపిల్‌ వంటివి తొక్కతో తినటం మంచిది.

నీళ్లు

మనం నీళ్లు ఎంత తాగితే అంత మంచిదనీ, రోజుకు 4-5 లీటర్లైనా తాగితే ఒంట్లో మలినాలు కొట్టుకుపోతాయనీ చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది సమస్యలు తెచ్చిపెట్టే నమ్మకం!  నీరనేది కేవలం మనం తాగే నీళ్ల రూపంలోనే కాదు.. పండ్లు, కూరగాయలు, అన్నం, చారు, మజ్జిగ.. ఇలా అన్నింటిలోనూ ఉంటుంది. చాలామంది దీన్ని గుర్తించరు. ఇలాంటి పదార్థాల ద్వారా కాకుండా మనం రోజు మొత్తమ్మీద 2 నుంచి 2.5 లీటర్ల నీరు తాగితే చాలు! అంతకంటే ఎక్కువ తాగితే శరీరంలోని స్రావాలన్నీ పల్చబడిపోయి వాటి పనిసామర్థ్యం బాగా తగ్గిపోతుంది. చాలామంది నిద్ర లేస్తూనే 2 లీటర్ల నీటిని తాగేసెయ్యాలని చెబుతుంటారుగానీ ఇలా ఎక్కువగా తాగటం వల్ల జీర్ణ ప్రక్రియ వెనకబడుతుంది. మనం తినే ఆహారానికి తగ్గట్టుగా ఎంజైముల వంటివి ­రతాయి. కానీ మనం ఒక్కసారే నీళ్లు ఎక్కువగా తాగేస్తే అవన్నీ పల్చబడి, వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. ఆహారం తినేటప్పుడు మధ్య మధ్యలో కాకుండా మొత్తం తినటం పూర్తయిన తర్వాత తాగాలి. ఆ 2 లీటర్లు కూడా ఒక్కసారే ఎక్కువగా తాగటం కాకుండా రోజంతా వివిధ సందర్భాల్లో తాగుతుండటం ముఖ్యం. (కిడ్నీ సమస్యల వంటివి ఉన్నవారు వైద్యుల సలహా మేరకే తాగాలి)

నెయ్యి

నెయ్యి ఎవరికీ మంచిది కాదని భావిస్తూ కొందరు అస్సలు నెయ్యిని పూర్తిగా దూరంగా పెట్టేస్తున్నారు. ఇది సరికాదు. చంటి పిల్లలు, పెరిగే పిల్లలు, రోజంతా కష్టించి బరువు పని చేసేవారు, క్రీడాకారులు.. వీరంతా రోజూ నెయ్యి వంటివి తీసుకోవటం మంచిదే. నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్‌-ఎ ఉంటుంది. ఇది శరీరానికి చాలా మంచిది. పెరిగే పిల్లలకు చాలా మంచి చేస్తుంది. కాకపోతే అస్సలు శారీరక శ్రమ లేని కంప్యూటర్‌ ఉద్యోగుల వంటివారు, శారీరక కదలికలు పెద్దగా లేని, మంచం దిగని వృద్ధుల వంటివారు రోజూ నెయ్యి వంటివి తినటం మంచిది కాదు. నెయ్యి అనేది సంతృప్త కొవ్వు కాబట్టి దానివల్ల కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఉంటుంది. మిగతా వంట నూనెలను తగ్గించటమంటే కష్టంగానీ నెయ్యి తగ్గించెయ్యటం, మానెయ్యటం తేలికే. అందుకే ఎదిగే వయసు దాటిపోయిన పెద్దలు దీనికి దూరంగా ఉండొచ్చు.

పంచదార

పంచదార ఎక్కువ తింటే ‘షుగర్‌’ వస్తుందన్నది చాలామంది నమ్మే విషయం. కానీ ఇది వాస్తవం కాదు.  షుగర్‌.. మధుమేహం అన్నది కేవలం పంచదార, తీపి పదార్థాలు ఎక్కువగా తినటం వల్లనే రాదు. మనం ఏం తీసుకున్నా శరీరంలో అది ముందు షుగర్‌ కింద మారి, వినియోగానికి వీలైన శక్తిగా (క్యాలరీల్లా) సిద్ధంగా ఉంటుంది. కానీ మనం ఎటువంటి శారీరక శ్రమా చెయ్యకుండా దాన్ని ఖర్చు పెట్టకపోతే, అది తనకు తానుగా కొవ్వుగా మారిపోయి శరీరంలో పేరుకుని, నిల్వ ఉంటుంది. దీనివల్ల బరువు పెరగటం, అది తెచ్చే దుష్ప్రభావాలు మొదలవుతాయి. అంతేగానీ పంచదార తింటే మధుమేహం వస్తుందని భావించటం సరికాదు. మధుమేహానికి మన జీవనశైలి, ఒత్తిళ్లు, జన్యువుల వంటివి ముఖ్యమైన కారణాలుగానీ పంచదార కాదు. అయితే ఒకసారి మధుమేహం వస్తే మాత్రం పంచదార, తీపి, స్వీట్ల విషయంలో పథ్యం తప్పదు. తీపి, కొవ్వు తక్కువగా తీసుకోవాలి.

వంట

ఆహార పదార్థాలను అతిగా వండితే వాటిల్లోని పోషకాలు పోతాయని భావించేవారున్నారు. ఇది కొంత వరకూ నిజమే. బియ్యం, గోధుమల వంటి పిండి పదార్థాలను; చికెన్‌, మటన్‌ వంటి మాంసకృత్తులను బాగా వండితేనేగానీ అవి మన ఒంటికి పట్టవు. మన శరీరం జంతువుల్లాంటిది కాదు. కొంతమేరకు వేడి చేసి, వాటి స్వభావాన్ని మారిస్తేనే మన పేగులు వాటిని జీర్ణం చేసుకోగలుగుతాయి. వంట రూపంలో ముందు కొంత జీర్ణప్రక్రియ జరిగితే.. మిగతా దాన్ని మన శరీరం జీర్ణించుకుంటుంది. కాబట్టి పిండి పదార్థాలను, మాంసకృత్తులను కనీసంగానైనా వండటం అవసరం. అయితే కాయగూరల విషయానికి వచ్చేసరికి ఇది వర్తించదు. కూరగాయల్లో ఉండే ఖనిజ లవణాలు, నీటిలో కరిగే విటమిన్లు- మనం వేడి చేస్తే హరించుకుపోతాయి. అలాగని వండకుండా తినలేం కాబట్టి కూరగాయలను వేడి వేడి నూనెల్లో వేయించెయ్యటం వంటివి చెయ్యకుండా... కొద్దిగా నూనె వేసి తాలింపు పెట్టి తేలికగా ఉడికించి తినటం మంచిది. అలా చేసినా కొన్ని విటమిన్లు పోతాయి కాబట్టి రోజూ మనం విడిగా కొన్ని పచ్చి కూర ముక్కలు (సలాడ్లు), పండ్లు, పండ్ల రసాలు, మొలకెత్తిన గింజల వంటివి తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. కొత్తిమీర, పుదీనా వంటివాటితో పచ్చిగా చేసే రోటి పచ్చళ్ల వంటివీ బాగా ఉపయోగపడతాయి.

గుడ్డు

గుడ్డులో కొలెస్ట్రాల్‌ ఉంటుంది కాబట్టి దాన్ని తినకూడదని నమ్మేవాళ్లూ చాలామంది ఉన్నారు. కానీ ఇది పూర్తి నిజం కాదు.  గుడ్డులోని తెల్లసొనలో ఆల్బుమిన్‌, బోలెడన్ని మాంసకృత్తులు ఉంటాయి. దాంట్లో కొలెస్ట్రాలేమీ ఉండదు. పచ్చసొనలోనే కొలెస్ట్రాల్‌ ఉంటుందిగానీ అదొక్కటే కాదు, అందులో విటమిన్‌-ఎ, ఇతర కొవ్వు ఆమ్లాల వంటివెన్నో ఉంటాయి. కాబట్టి అందరికీ గుడ్డు మంచిది. కాకపోతే రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నవాళ్లకు, గుండె జబ్బులు, హైబీపీ వంటివి ఉన్నవారికి ఈ పచ్చసొనతో కొంత ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి వాళ్లు పచ్చసొన తీసేసి ఒక్క తెల్లదాన్ని తినొచ్చు. ఏ సమస్యా లేని సాధారణ ఆరోగ్యవంతులు గుడ్డు నిశ్చింతగా తినొచ్చు, రోజుకు ఒకటి తింటే మేలే చేస్తుంది.

శాక్రీన్‌

మధుమేహం ఉన్న వారికి కృత్రిమ తీపి పదార్థాలు (ఆర్టిఫీషియల్‌ స్వీటనర్స్‌) మంచివని భావిస్తూ చాలామంది వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇదంత మంచిది కాదు. ఆస్పర్టేమ్‌, శాక్రీన్‌ వంటి కృత్రిమ తీపి పదార్థాలను ఏదో పాలు, కాఫీల్లో రుచికి కొద్దిగా కలుపుకొంటే పెద్దగా నష్టం ఉండదుగానీ వాటితోనే స్వీట్లు, బిస్కట్లు, బేకరీ ఉత్పత్తుల వంటివన్నీ చేసుకుని.. వాటిని పెద్ద మొత్తంలో తినటం వల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయో ప్రస్తుతానికి చెప్పటం కష్టం. అవేవీ సహజమైనవి కావు, కృత్రిమ రసాయనాలు. వాటిపై జరిగిన అధ్యయనాలు ఇంకా స్పష్టంగా ఏమీ తేల్చకపోయినా సాధ్యమైనంత వరకూ తగ్గించుకోవటమే మంచిదని గుర్తించాలి.

ఉప్పు

మన ఆరోగ్యానికి ‘ఉప్పు పెద్ద ముప్పు’ అని భావిస్తూ ఉప్పును పూర్తిగా మానెయ్యటం అవసరమన్న భావన తరచుగా వినపడుతుంటుందిగానీ అది పూర్తిగా మంచిది కాదు. ఉప్పు కూడా మన శరీరానికి, జీవక్రియలకు అవసరమైన వనరు. ఆరోగ్యవంతులు రోజుకు కాస్త అటూ ఇటూగా 4 గ్రాముల ఉప్పు తీసుకోవటం మంచిది. చాలామంది మన శరీరానికి కావాల్సిన సోడియం అంతా కూడా కూరగాయలు, మన ఆహార పదార్థాల నుంచి సహజంగానే వచ్చేస్తుందనీ, ఇంక అదనంగా ఉప్పు వేయటం వల్ల దాని పరిమితి పెరిగిపోతుందని చెబుతుంటారుగానీ నిజానికి ఆహారం కాకుండానే 4 గ్రాములు (యాడెడ్‌ సాల్ట్‌) తీసుకోవాలన్నది శాస్త్రరంగం చేస్తున్న సిఫార్సు. కొన్ని రకాల జీవక్రియల్లో సోడియం క్లోరైడ్‌ (ఉప్పు) చాలా అవసరం. ఒంట్లో నీరు, ఖనిజ లవణాల సమతుల్యత (బ్యాలెన్స్‌) సజావుగా ఉండటానికి, మనం ‘డీహైడ్రేషన్‌’ లోకి వెళ్లకుండా ఇది చాలా కీలకం. దీనర్థం ఉప్పు ఎక్కువెక్కువగా వాడమని కాదు. ఉదాహరణకు హైబీపీ ఉన్నవాళ్లు, కిడ్నీ జబ్బులున్న వాళ్లు ఉప్పు తగ్గించుకోవటం అసవరం. అంతేగానీ ఆరోగ్యవంతులు అసలు ఉప్పును పెద్ద శత్రువులా అభిప్రాయపడుతూ, అస్సలు ఉప్పు లేకుండా తినటం సరికాదు.

ప్రోటీన్లు

మన శరీరానికి మాంసకృత్తులే చాలా మంచివనీ, పిండిపదార్థాలు అంతగా మంచివి కావని చాలామంది నమ్ముతుంటారు. కానీ ఇది సరైన అవగాహన కాదు. బియ్యం, గోధుమల వంటివి పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్‌). రకరకాల పప్పులు, మాంసం వంటివి మాంసకృత్తులు (ప్రోటీన్స్‌). నిజానికి ఈ రెండు రకాల ఆహార పదార్థాలూ మన శరీరానికి అవసరమైనవే. ఇందులో పిండిపదార్థాలు మన శరీరానికి అవసరమైన శక్తిని నిరంతరం అందిస్తుంటాయి. మాంసకృత్తులు కండరాల నిర్మాణానికి (మజిల్‌ బిల్డింగ్‌) దోహదం చేస్తాయి. మనం ఎప్పుడైతే పిండిపదార్థాలను తగ్గించేసి మాంసకృత్తులే తినటం మొదలుపెడతామో అప్పుడు శరీరం... మాంసకృత్తులను కండర నిర్మాణానికి కాకుండా శక్తి కోసం వాడుకోవటం ఆరంభిస్తుంది. దీంతో శారీరక, కండర నిర్మాణం వెనకబడుతుంది. ఇలా ప్రోటీన్లను శక్తి కోసం వినియోగించేసుకుంటూ ఉండటంతో.. మనం శరీరంలో ప్రోటీన్ల లోపం తలెత్తుతుంది. ఇది మంచిది కాదు. కాబట్టి మనం పిండిపదార్థాలూ తినాలి, మాంసకృత్తులూ తినాలి. కాకపోతే... పిండిపదార్థాలను మితంగా తినాలి.

పాలు

‘పాలు’ అనేవి పిల్లలకేగానీ పెద్ద వాళ్లకు అక్కర్లేదని చాలామంది నమ్ముతున్నారు. కానీ వాస్తవానికి...  పాలన్నది సంపూర్ణ ఆహారం. చంటి పిల్లలకు అదొక్కటే ఆహారం, కొంచెం పెద్దయితే పాలతో పాటు అదనపు ఆహారం కూడా ఇస్తారు. పాల ద్వారా మన శరీరానికి వచ్చే పోషకాలు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లలకు సమృద్ధంగా పాలు ఇవ్వాలి. ఇక పెద్దల విషయానికి వస్తే- పాలలో ఉండే కొవ్వు ఒక్కటి తప్పించి మిగతావన్నీ మనకు చాలా అవసరమైనవి. పాలలో క్యాల్షియం వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్లకు క్యాల్షియం చాలా ఎక్కువ అవసరం. లేకపోతే ఒక వయసు వచ్చేసరికి ఎముకలు బోలుబోలుగా తయారై ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి పెద్దలు కొవ్వు తీసిన, లేదా కొవ్వు తక్కువున్న పాలు తీసుకోవటం మంచిది. స్త్రీలకు పాలు మరీ ముఖ్యం.

రాత్రి తిండి

రాత్రిపూట తిండి ఎక్కువైతే బరువు పెరుగుతారని చాలామంది నమ్ముతుంటారు. కొంత వరకూ ఇందులో నిజం లేకపోలేదు. మనం రోజు మొత్తం మీద తినే తిండి, దాని ద్వారా వచ్చే మొత్తం క్యాలరీలు- మూడు పూట్లా చేసే భోజనాల నుంచి సమానంగా ఒంటికి దక్కటం మంచిది. కానీ చాలామంది ఉదయం ఆఫీసులకు వెళ్లే హడావుడిలో, మధ్యాహ్నం పని ఒత్తిడిలో పడి ఉదయపు అల్పాహారం అసలు తీసుకోవటం లేదు. రాత్రంతా ఏమీ తీసుకోకుండా ఉంటారు కాబట్టి ఉదయపు అల్పాహారం కాస్త దండిగా ఉండటం మంచిది, అవసరం కూడా. మధ్యాహ్నం ఓ మోస్తరుగా, రాత్రికి చాలా తేలికగా ఆహారం తీసుకోవటం మంచిది. రాత్రిపూట ఎక్కువగా తినటం అంత మంచిది కాదు, రాత్రంతా శారీరక శ్రమ లేకుండా పడుకునే ఉంటాం కాబట్టి క్యాలరీల ఖర్చుండదు, దాంతో అది కొవ్వుగా మారి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఉదయాన్నే వ్యాయామాలు చెయ్యటం వల్ల మంచి జరుగుతుంది. అయితే- రోజులో కేవలం మూడుసార్లే ఆహారం తినటం కాకుండా కాస్త తక్కువ పరిమాణంలో, రోజులో ఎక్కువ దఫాలు తీసుకోవటం మంచిది. ఎదురుచూసీచూసీ రోజులో మూడుసార్లు తినటం వల్ల ఆకలికి ఎక్కువ మొత్తంలో తినటం జరుగుతుంది. అలా కాకుండా మధ్య మధ్యలో తినటం వల్ల అంత ఎక్కువ ఆకలి ఉండదు. తక్కువగానే తింటాం. ఇలా ఎక్కువసార్లు తిన్నా తీసుకునే మొత్తం క్యాలరీలేమీ పెరగవు. దీనివల్ల బరువు పెరగరు, లావవ్వరు. 

కూరగాయలను కోసిన తర్వాత ఆ ముక్కలను నీళ్లలో కడగటం, నానబెట్టటం వంటివి చెయ్యకూడదు. అలా చేస్తే కూరగాయల్లో ఉండే బీకాంప్లెక్స్‌ విటమిన్లు, పొటాషియం తదితర ఖనిజాలన్నీ నీళ్లలో కరిగిపోయి, చివరికి వాటిలో వట్టి పిట్టు మిగులుతుంది. కాబట్టి కూరగాయలను ముందే శుభ్రంగా కడిగేసి.. అప్పుడు తరిగి, వండుకోవాలి. ఒకసారి తరిగిన తర్వాత మాత్రం మళ్లీ నీళ్లలో కడగకూడదు. (కిడ్నీ జబ్బులున్న వారు ఇలా నానబెట్టి తినటం అవసరం, వారికి వైద్యుల సలహా ముఖ్యం)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts