Heart Diseases: అదృశ్య గుండెజబ్బు

ఎలాంటి లక్షణాలు లేకుండా చాలామందిలో గుండెజబ్బు నిద్రాణంగా ఉంటున్నట్టు డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హాగెన్‌ పరిశోధకులు తాజాగా గుర్తించారు.

Published : 11 Apr 2023 00:10 IST

ఎలాంటి లక్షణాలు లేకుండా చాలామందిలో గుండెజబ్బు నిద్రాణంగా ఉంటున్నట్టు డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హాగెన్‌ పరిశోధకులు తాజాగా గుర్తించారు. చిన్నవయసులోనే గుండెజబ్బు మొదలవు తుండొచ్చనీ, కానీ అదృశ్యంగా ఉండొచ్చనీ ఇది సూచిస్తోంది. నలబై ఏళ్లు పైబడిన 9వేలకు పైగా మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో సుమారు సగం మందిలో గుండె రక్తనాళాల్లో పూడికల ఆనవాళ్లు ఉన్నట్టు తేలటం గమనార్హం. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో పూడికల మూలంగా గుండెపోటు సంభవించే ముప్పు 8 రెట్లు పెరుగుతుంది. గుండెజబ్బుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. కుటుంబ చరిత్ర వంటి ముప్పు కారకాలను మనం మార్చలేకపోవచ్చు గానీ పొగ తాగటం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం వంటి వాటిని మార్చుకోవచ్చు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉండటం మంచిది. తాజా అధ్యయనం ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది. గుండెజబ్బు చాలా ఏళ్ల ముందే మొదలయ్యే అవకాశం ఉండటం వల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు. సమస్యను ముందుగానే గుర్తిస్తే పెను ప్రమాదంగా మారకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2019లో గుండె రక్తనాళాల జబ్బుతో సుమారు 1.8 కోట్ల మంది మరణించారు. వీరిలో 85% మరణాలకు పక్షవాతం, గుండెపోటే కారణమవుతుండటం గమనించ దగ్గ విషయం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని