Published : 28 Jan 2020 02:20 IST

జలుబు కిరీటం మనకేల?

కరోనా కలవరం

కరోనా, కరోనా.. ప్రపంచమంతా ఈ పేరుతోనే మారుమోగుతోంది. మొన్న చైనాలో వెలుగుచూసిన ఈ వైరస్‌.. నిన్న జపాన్‌, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్‌కు విస్తరించింది. అక్కడితో ఆగితేనా? అమెరికాకు సైతం పాకింది. కేసుల సంఖ్య, మరణాల సంఖ్యా రోజురోజుకీ ఎక్కువవుతూనే వస్తోంది. ఎక్కడో విదేశాల్లో వైరస్‌ చక్కర్లు కొడుతుంటే మనకేం అనుకోవటానికి లేదు. వైరస్‌కు సరిహద్దులంటూ ఏవీ లేవు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతో దేశదేశాలు చుట్టిరావటం సర్వసాధారణమైపోయిన రోజుల్లో ఇది ఏ క్షణంలోనైనా మనదేశంలోకీ అడుగుపెట్టొచ్చు.  ప్రస్తుతానికిది స్వల్ప స్థాయిలోనే ఉన్నా ఎప్పుడైనా మహమ్మారిగా పరిణమించే అవకాశం లేకపోలేదని నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. సాధారణంగా జంతువుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఇది మనుషుల నుంచి మనుషులకూ సోకేలా మారిపోవటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండటం ఎంతైనా అవసరం.
మనకు వైరస్‌లు కొత్త కాదు. ఇవి జన్యుమార్పులతో సరికొత్త రూపాలను ధరించటమూ కొత్త కాదు. క్రమంగా వీటి ఉద్ధృతి తగ్గటం, ప్రమాదకరం కాని స్థితికి మారటమూ మామూలే. కాకపోతే ఆలోపే విలయం సృష్టించినంత పనిచేయటమే ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ అలాంటి కలవరమే కలిగిస్తోంది. అక్కడ్నుంచి హద్దులు దాటుకొని శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తూ మరింత కలకలం సృష్టిస్తోంది. నిజానికి కరోనా వైరస్‌ కొత్తదేమీ కాదు. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకే రకానికి చెందిన వైరస్‌ (జూనోసిస్‌). వీటిల్లో ఏడు ఉపజాతులున్నాయి. వీటిని తొలిసారిగా 1960లో జలుబు బాధితుల ముక్కు స్రావాల్లో గుర్తించారు. అవే హ్యూమన్‌ కరోనావైరస్‌ 229ఇ, హ్యూమన్‌ కరోనావైరస్‌ ఓసీ43. అనంతరం మనుషులకు సోకిన మరో రెండు వైరస్‌లూ బయటపడ్డాయి. గతంలో చైనాలోనే సార్స్‌ (సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) రూపంలో పుట్టుకొచ్చి పెద్ద కలకలమే సృష్టించింది. ఆ మధ్య గల్ఫ్‌దేశాల్లో మెర్స్‌ (మిడిల్‌ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌) రూపంలోనూ బయటపడింది. ఇప్పుడు తాజాగా చైనాలోని వూహాన్‌లో కొత్తరూపు సంతరించుకొంది. అక్కడ గత నెలలో కొందరు అనూహ్యంగా తీవ్రమైన న్యుమోనియా బారినపడటం ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణమేంటని అన్వేషించగా కొత్తరకం కరోనా వైరస్‌ అని బయటపడింది. అందుకే దీనికి సరికొత్త కరోనా వైరస్‌- నావల్‌ కరోనా వైరస్‌ (ఎన్‌సీఓవీ) 2019 అని పేరు పెట్టారు.  
జంతువుల నుంచి మనుషులకు
వైరస్‌లు రకరకాలు. కొన్ని మనుషుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంటాయి. మరికొన్ని జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంటాయి. కరోనా వైరస్‌ ఇలాంటిదే. కరోనా అంటే కిరీటం అని అర్థం. దీని ఉపరితలాన కిరీటంలా పొడుచుకొచ్చే బుడిపెల వంటి భాగాలుంటాయి. అందుకే కరోనా వైరస్‌ అనే పేరు వచ్చింది. ఇది సాధారణంగా జంతువుల్లోనే ఉంటుంది. జంతువుల్లోనే సమస్యలు సృష్టిస్తుంటుంది. కారణమేంటో తెలియదు గానీ అప్పుడప్పుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. తాజాగా ఇది సముద్ర ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ నుంచి మనుషులకు వ్యాపించటం గమనార్హం. అలాగని మనుషుల నుంచి మనుషులకు వ్యాపించకూడదనేమీ లేదు. మెర్స్‌, సార్స్‌ కారక కరోనా వైరస్‌లు ముందు జంతువుల నుంచి వ్యాపించినా అనంతరం మనుషుల నుంచి మనుషులకు సోకినవే. కరోనా సైతం మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్టు తాజాగా బయటపడింది. గబ్బిలాలు, పాముల్లోని కరోనా వైరస్‌ కలగలసి కొత్తరూపం ధరించిందని భావిస్తున్నారు. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే రకంగానూ మారిపోయింది. ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది. తుంపర్ల ద్వారా వెలువడే వైరస్‌ కొద్దిదూరం.. 3 అడుగుల వరకే వ్యాపిస్తుంది. అంటే ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారికి సన్నిహితంగా మెలిగేవారికి అంటుకునే అవకాశం ఎక్కువన్నమాట. ఇది నోరు, ముక్కు, కళ్ల వంటి అవయవాల పొరల మీదికి చేరుకొని ఇన్‌ఫెక్షన్‌ కలగజేస్తుంది. తుంపర్లు పడిన వస్తువులను ముట్టుకొని అవే చేతులతో నోరు, ముక్కు, కళ్లను రుద్దుకున్నా వైరస్‌ ఒంట్లోకి ప్రవేశిస్తుంది.
మనకూ ప్రమాదమే!
ఇతర దేశాలకు కరోనా వైరస్‌ వ్యాపించటం అనూహ్యమేమీ కాదు, దీన్ని కట్టడి చేయటానికి అన్ని దేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి- అన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచన. ఇది సమస్య తీవ్రతను చెప్పకనే చెబుతోంది. అందువల్ల జన సాంద్రత ఎక్కువగా గల మనం మరింత అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. కిక్కిరిసిన ఆవాసాల్లో వైరస్‌ ఎక్కువకాలం జీవించే అవకాశముందని గుర్తుంచుకోవాలి. పోషణలోపం, రోగనిరోధకశక్తి తక్కువగా గలవారూ మనదగ్గర ఎక్కువే. ఇలాంటివారికి ఎలాంటి వైరస్‌ అయినా త్వరగా సోకే ప్రమాదముంది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ గలవారిని గుర్తించటానికి మన ఓడరేవుల్లో తగిన సదుపాయాలు లేకపోవటమూ గమనార్హం. పైగా కరోనా లక్షణాలు చాలావరకు జలుబును పోలి ఉండటం వల్ల దీన్ని గుర్తించటమూ కష్టమే. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు జాగ్రత్తగా మసలు కోవాలి.

నివారణే కీలకం
ప్రస్తుతానికి కరోనా వైరస్‌కు టీకా ఏదీ లేదు. నివారణ ఒక్కటే మార్గం. అందువల్ల ఎవరి జాగ్రత్తలో వారుండటం మంచిది. వైరస్‌ వ్యాప్తిలో ఉన్న చైనా, జపాన్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాలకు వెళ్లి వచ్చినవారిలో ఎవరికైనా జలుబు లక్షణాలు కనిపిస్తే తాత్సారం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. వీరిని ప్రత్యేకంగా విడిగా ఉంచి, చికిత్స చేయాల్సి ఉంటుంది.
* తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కుకు, నోటికి రుమాలు అడ్డం పెట్టుకోవాలి.
* జలుబు, ఫ్లూ లక్షణాలు గలవారికి దూరంగా ఉండటం మేలు.
* తరచూ చేతులను కడుక్కోవాలి. ముఖ్యంగా దగ్గిన తర్వాత, తుమ్మిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. జబ్బు బారినపడ్డవారికి సేవలు చేశాక.. వంట వండటానికి ముందు, వండేటప్పుడు, వంట పూర్తయ్యాక.. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.  
* జనసమ్మర్థ ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది.
* చేతికి, నోటికి, ముక్కుకు రక్షణ లేకుండా అనవసరంగా జంతువులను తాకరాదు. ఒకవేళ జంతువులను, జంతువుల వ్యర్థాలను తాకితే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
* మాంసాహారులైతే మాంసం, గుడ్ల వంటివి బాగా ఉడికిన తర్వాతే తినాలి.
గర్భిణులు మరింత జాగ్రత్త
గర్భిణులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ అయినా మంచిది కాదు. తల్లీ బిడ్డలకూ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇక కరోనా వంటి తీవ్ర ఇన్‌ఫెక్షన్ల విషయంలో ఇంకాస్త జాగ్రత్త అవసరం. ఎందుకంటే గతంలో వెలుగుచూసిన మెర్స్‌ బారినపడ్డ గర్భిణులకు శిశువు చనిపోయి పుట్టిన ఉదంతాలున్నాయి. సార్స్‌ మూలంగా గర్భస్రావాలూ జరిగాయి. కొందరు గర్భిణులూ మరణించారు. తీవ్ర సమస్యలతోనూ సతమతమైనవారు లేకపోలేదు.
మామూలు జలుబు లక్షణాలే
తాజా కరోనా వైరస్‌ స్వరూప స్వభావాలేంటి? ఎంత తీవ్రంగా పరిణమిస్తుంది? అనేవి ఇదమిత్థంగా తెలియరావటం లేదు. ప్రస్తుతానికైతే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్నా ఇది వేగంగా విస్తరిస్తున్న సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌లోనూ ముందుగా మామూలు జలుబు లక్షణాలే కనిపిస్తాయి. ప్రధాన లక్షణాలు ఇవీ..
* ముక్కు కారటం
* తుమ్ములు
* జ్వరం
* ఒళ్లునొప్పులు
* గొంతునొప్పి
* ఛాతీలో నొప్పి
* తలనొప్పి
* చలి
* గుండెవేగంగా కొట్టుకోవటం
* రెండు మూడు రోజుల తర్వాత పొడి దగ్గు
* స్వల్పంగా ఆయాసం
* జీర్ణకోశ సమస్యలు
* విరేచనాలు
తీవ్రమైతే న్యుమోనియాగా..
చాలావరకు కరోనా ఇన్‌ఫెక్షన్‌ అంతగా హాని కలిగించేదేమీ కాదు. సాధారణంగా జలుబు లక్షణాలు రెండు మూడు రోజులుండి తగ్గిపోతుంటాయి. కొందరికి ఇన్‌ఫెక్షన్‌ ఊపిరితిత్తులకు చేరుకొని శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతినొచ్చు. తీవ్ర న్యుమోనియా, బ్రాంకైటిస్‌గా మారొచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు, వృద్ధులకు, రోగనిరోధకశక్తిని అణచిపెట్టే మందులు వేసుకునేవారికి సమస్య తీవ్రమయ్యే ముప్పు ఎక్కువ. అప్పటికీ తగు చికిత్స అందకపోతే ప్రాణాపాయానికి దారితీయొచ్చు. ఒకప్పుడు సార్స్‌ రూపంలో విజృంభించిన కరోనా ఇన్‌ఫెక్షన్‌ బారినపడ్డవారిలో 15% మంది మృత్యువాత పడగా.. వీరిలో సగానికన్నా ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడ్డవారే. అలాగే మెర్స్‌ బారినపడ్డ ప్రతి 10 మందిలో నలుగురు చనిపోవటం గమనార్హం. కాబట్టి వృద్ధులు, పిల్లల విషయంలో మరింత అప్రమత్తత అవసరం.
* సమస్య తీవ్రమైతే కిడ్నీ వైఫల్యం, చివరికి ప్రాణాపాయమూ సంభవించొచ్చు.
లక్షణాలను బట్టి చికిత్స
కరోనా ఇన్‌ఫెక్షన్‌కు కచ్చితమైన చికిత్సంటూ ఏదీ లేదు. చాలావరకు మందులేవీ వేసుకోకపోయినా లక్షణాలు తగ్గిపోవచ్చు. మరీ ఇబ్బంది పెడుతుంటే ఆయా లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. జ్వరం, నొప్పులు తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు ఉపయోగపడతాయి. సమస్య తీవ్రమై శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే ఆసుపత్రిలో చేర్చి ఆక్సిజన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే వెంటిలేటర్‌తో కృత్రిమ శ్వాస కల్పించాల్సి వస్తుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ మూలంగా ఇతరత్రా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు తలెత్తితే యాంటీబయోటిక్స్‌తో చికిత్స చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు