Updated : 23 Apr 2019 05:44 IST

టీకా.. భవిష్యత్తుకు భరోసా!

జబ్బుల మీద టీకాస్త్రం! ఒక్కసారి సంధిస్తే చాలు. చాలారకాల ఇన్‌ఫెక్షన్‌ జబ్బులు జీవితంలో మరెప్పుడూ మన దరిజేరవు. చుట్టుపక్కల వాళ్లకూ వ్యాపించవు. టీకాస్త్రాన్ని సరిగా ప్రయోగిస్తే మహమ్మారి జబ్బులనైనా సమూలంగా మట్టుపెట్టొచ్చు. ఒకప్పుడు ప్రపంచాన్ని గడగడలాడించిన మశూచి (స్మాల్‌పాక్స్‌) పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటమే దీనికి నిదర్శనం. అంతెందుకు? పిల్లలను వైకల్యానికి గురిచేసి.. భవిష్యత్తుతో చెలగాటమాడుకునే పోలియోని ఇప్పుడు మనదేశం నుంచి పూర్తిగా నిర్మూలించగలిగామంటే అదంతా టీకా మహాత్మ్యమే. అయినా కూడా టీకాలపై ఇప్పటికీ ఎన్నెన్నో అనుమానాలు, భయాలు, అపోహలు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది పిల్లలు అసలు టీకాలకే నోచుకోవటం లేదు. ఒకవేళ తీసుకున్నా అరకొరగా మోతాదులతోనే నెట్టుకొస్తున్నారు. అందుకే ప్రపంచ టీకాల వారం ‘టీకాలు కాపాడతాయి: పనిచేస్తాయి’ అని నినదిస్తోంది. ఈ నేపథ్యంలో టీకాల ప్రాముఖ్యత, ఆవశ్యకతపై సమగ్ర కథనం ఈవారం మీకోసం.

టీకా అంటే ఒక భరోసా. టీకా అంటే ఒక నమ్మకం. టీకా అంటే ఒక సంరక్షణ. జబ్బుల బారినపడకుండా కాపాడే మంచి తంత్రం, మంత్రం! జబ్బులు వచ్చాక బాధపడితే ఏం లాభం? అవి రాకుండా చూసుకోవటంలోనే ఉంది గొప్పతనం. ఇందుకు టీకానే ఉత్తమ మార్గం. జబ్బుల నివారణలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించటంలో టీకాలను మించిన మంచి కార్యక్రమం మరోటి లేదు. పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదిగేలా చూడటం ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఇది వ్యక్తిగతంగానే కాదు.. సమాజానికీ దేశానికీ మేలు చేస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు. అందుకే చిన్న పిల్లల వైద్య విభాగం కేవలం చికిత్సకే (క్యూరేటివ్‌) పరిమితం కావటం లేదు. జబ్బులు రాకుండా చూడటానికి (ప్రివెంటివ్‌), పిల్లలు మంచి ఆరోగ్యంతో ఎదగటానికి (ప్రమోటివ్‌) కూడా అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఇలా అన్ని రకాలుగా పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదిగేలా చూడటంలో టీకాల పాత్ర చాలా కీలకం. క్షయ, కంఠసర్ఫి, కోరింతదగ్గు, ధనుర్వాతం, గవదబిళ్లలు, రుబెల్లా, న్యుమోనియా, కామెర్లు, పోలియో, విరేచనాలు.. ఇలా పిల్లలను ఉక్కిరిబిక్కిరి చేసే ఎన్నో రకాల జబ్బులకు టీకాలతో ఆదిలోనే ముకుతాడు వేయొచ్చు. పుట్టిన ప్రతి బిడ్డకూ టీకాలను పొందే అర్హత ఉందని, వాటిని ఇప్పించాల్సిన బాధ్యత పెద్దలదేనని తెలుసుకోవాలి. టీకా ఇస్తే బిడ్డ ఏడుస్తుందేమో, నొప్పి పుడుతుందేమో, జ్వరం వస్తుందేమో అని భయపడకుండా సార్వత్రిక టీకా కార్యక్రమంలో పేర్కొన్న అన్ని టీకాలను ఇప్పించాలి. ప్రభుత్వ కార్యక్రమంలో లేని మరికొన్ని టీకాలు ఇప్పించటమూ అవసరమే. కాబట్టి పిల్లలకు అవసరమైన టీకాల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకొని ఉండటం ఎంతైనా అవసరం.

టీకాలు ఎందుకు?
మన చుట్టూ బోలెడన్ని బ్యాక్టీరియా, వైరస్‌లు తిరుగాడుతుంటాయి. ఇవి శరీరం మీద దాడి చేసినపుడు రకరకాల జబ్బులు (ఇన్‌ఫెక్షన్లు) తలెత్తుతుంటాయి. నిజానికి హానికారక సూక్ష్మక్రిముల నుంచి మన రోగనిరోధక వ్యవస్థ నిరంతం కాపాడుతూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు సూక్ష్మక్రిములు రోగనిరోధక వ్యవస్థను అధిగమించి తమ ప్రతాపాన్ని చూపొచ్చు. ఇది జబ్బులకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం హానికారక సూక్ష్మక్రిములను మన రోగనిరోధక వ్యవస్థ గుర్తించలేకపోవటం. మరి సూక్ష్మక్రిములను రోగనిరోధక వ్యవస్థ గుర్తించగలిగిలా చేయగలిగితే? సరిగ్గా టీకాలు చేసే పని ఇదే. హానికారక సూక్ష్మక్రిములు ఏవి? వాటిని ఎదుర్కోవటం, నిర్మూలించటం ఎట్లా? అనేవి రోగనిరోధక వ్యవస్థ గుర్తించటానికి టీకాలు తోడ్పడతాయి. ఇలా జబ్బుల బారినపడకుండా కాపాడతాయి.

ప్రధానంగా 3 రకాలు
నిజానికి టీకాల్లో ఉండేవి కూడా సూక్ష్మక్రిములే. కాకపోతే ఇవేవీ మనకు హాని చేయవు. సూక్ష్మక్రిములను నిర్వీర్యం చేసో.. చంపేసో లేదంటే వాటి భాగాలతోనో టీకాలను తయారుచేస్తారు. జీవించి ఉన్న సూక్ష్మక్రిములతో కూడినవి సజీవ (లైవ్‌) టీకాలు. సూక్ష్మక్రిములను నిర్వీర్యం చేసి వీటిని రూపొందిస్తారు. అందువల్ల ఇవి ఒంట్లోకి చేరినా వృద్ధి చెందవు, వ్యాపించవు. కానీ మన రోగనిరోధక వ్యవస్థ ఈ సూక్ష్మక్రిములను పసిగట్టి.. వాటిని ఎదుర్కోవటానికి అవసరమైన యాంటీబాడీలను తయారుచేసుకొని పెట్టుకుంటుంది. చనిపోయిన సూక్ష్మక్రిములతో తయారుచేసేవి విగత (కిల్డ్‌) టీకాలు. ఇక సూక్ష్మక్రిముల భాగాలతో రూపొందించినవి ఆంశిక (కాంపోనెంట్‌) టీకాలు. వీటిల్లోని సూక్ష్మక్రిముల భాగాలను, ప్రోటీన్ల వంటి వాటిని శరీరం పసిగట్టి యాంటీబాడీలను తయారుచేసుకుంటుంది. ఇవి మన శరీరంలో జీవితాంతం ఉంటాయి. మున్ముందు మళ్లీ ఎప్పుడైనా అవే సూక్ష్మక్రిములు దాడిచేస్తే ఇవి పెద్దఎత్తున ఉత్పత్తయ్యి సూక్ష్మక్రిముల పని పడతాయి. మన రోగనిరోధక వ్యవస్థలో టి కణాలు, బి కణాలు ఉంటాయి. టి కణాలను జ్ఞాపక కణాలని అనుకోవచ్చు. ఇవి ఆయా సూక్ష్మక్రిములను ఎప్పటికీ మరచిపోవు. అలాంటి క్రిములు ఒంట్లో ఎప్పుడు ప్రవేశించినా వెంటనే గుర్తుపట్టి యాంటీబాడీల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇక బి కణాలేమో అవసరమైనప్పుడు యాంటీబాడీలను తయారుచేస్తాయి.

సురక్షితకే తొలి ప్రాధాన్యం!
టీకాల విషయంలో ఎప్పుడైనా సురక్షితకే తొలి ప్రాధాన్యం. మంచి ఆరోగ్యంతో ఉన్న పిల్లలకు టీకా ఇస్తున్నామంటే దాంతో ఎలాంటి హాని కలగకుండా ఉండటం ముఖ్యం. అందుకే టీకాలను రూపొందించినపుడు ముందుగా జంతువుల మీద ప్రయోగించి అవి సురక్షితమా? కాదా? ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయి? అనేది తెలుసుకుంటారు. అనంతరం మనుషుల మీద ప్రయోగించి చూస్తారు. అవి సురక్షితంగా, బాగా పనిచేస్తున్నాయని తేలితేనే పిల్లలకు ఇచ్చి పరీక్షిస్తారు. ఇలా నాలుగైదు ప్రయోగ పరీక్షలు చేసి.. అన్నింట్లోనూ మంచి ఫలితం కనబడితే ఎక్కువమంది పిల్లలకు ఇచ్చి చూస్తారు. అప్పుడు కూడా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పని చేస్తున్నట్టు తేలితేనే అందరికీ ఇవ్వటానికి అనుమతిస్తారు.

చులకనగా చూడొద్దు!

ప్రభుత్వం ఉచితంగా ఇస్తోందనో, చవకగా దొరుకుతున్నాయనో టీకాలను చులకగా చూడొద్దు. ఇవి శాస్త్రవేత్తలు ఎంతో సమయం వెచ్చించి, నిబద్ధతతో శ్రమంచి మానవాళికి అందించిన గొప్ప వరాలు. వీటి తయారీ పెద్ద యజ్ఞం లాంటిది. ఒక టీకా రూపకల్పన దగ్గర్నుంచి ప్రయోగ పరీక్షలన్నీ దాటుకొని అందరికీ అందుబాటులోకి రావటానికి కనీసం 10-15 సంవత్సరాలు పడుతుంది. అదీ ఇరవై టీకాల మీద ప్రయోగాలు చేస్తే ఒకటో రెండో విజయవంతమవుతాయి. టీకాల పరిశోధన, రూపకల్పనకు ఖర్చు కూడా ఎక్కువే అవుతుంది. కాబట్టి టీకాలను తేలికగా తీసుకోవటానికి వీల్లేదు.

టీకా మరచిపోతే..
ఎప్పుడైనా టీకా వేయించటం మరచిపోతే ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా ఇప్పించాలి. అయితే ఒక మోతాదుకు మరో మోతాదుకు మధ్యలో కనీసం నెల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు- ఆరోవారం వేయించాల్సిన టీకా మరచిపోయారు. పదో వారం దగ్గర పడింది. అప్పుడు ఆరోవారం వేయించాల్సిన టీకాను ఇప్పించి.. నెల తర్వాత పదోవారం మోతాదు ఇప్పించాలి.

బూస్టర్‌ టీకా ఎందుకు?
టీకాలు ఇప్పించాం కదా. మళ్లీ బూస్టర్‌ టీకాలు ఎందుకని కొందరు భావిస్తుంటారు. ఇది తప్పు. కొన్ని టీకాల ప్రతిస్పందన కొన్నిరోజులకు నిద్రావస్థలోకి వెళ్లిపోతుంటుంది. బూస్టర్‌ టీకా ఇవ్వగానే యాంటీబాడీలు తిరిగి పుంజుకుంటాయి. అంటే టీకాల ప్రభావం తగ్గకుండా ఉంటుందన్నమాట. ఒకసారి టీకా ఇచ్చినపుడు కొన్ని యాంటీబాడీలు తయారవుతాయి. రెండోసారి ఇస్తే అవి మరింత ఎక్కువగా పుట్టుకొస్తాయి. మూడోసారి ఇస్తే ఇంకాస్త ఎక్కువగా పుట్టుకొస్తాయి. టీకా మోతాదు అంతే అయినా ప్రతిస్పందన తీరు మరింత ఉద్ధృతంగా ఉంటుంది. కాబట్టి కొన్ని టీకాలకు బూస్టర్‌ అవసరమని గుర్తించాలి.

పెద్దలకు కూడా..
టీకాలనగానే ముందు చిన్న పిల్లలు గుర్తుకొచ్చేమాట నిజమే గానీ పెద్దలకు ముఖ్యంగా వృద్ధులకు కూడా కొన్ని టీకాలు అవసరం. అరవై ఏళ్లు దాటిన అందరూ ఫ్లూ టీకా తీసుకోవాలి. దీన్ని ఏటా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే న్యుమోనియా రాకుండా న్యుమోకోకల్‌ టీకా తీసుకోవాలి. దీన్ని ఒక మోతాదు తీసుకుంటే సరిపోతుంది.

ప్రత్యేక పరిస్థితుల్లో..
జాతరలు, మేళాలు, కుంభమేళాల వంటి ప్రత్యేక పరిస్థితుల్లో కలరా వచ్చే అవకాశముంది. అందువల్ల అక్కడికి వెళ్లిన అందరూ కలరా టీకా తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కరచినపుడు రేబిస్‌ టీకా అవసరపడుతుంది. దీన్ని ఇచ్చిన తర్వాత వారం, పది రోజులకు గానీ యాంటీబాడీలు ఉత్పత్తి కావు. కాబట్టి రేబిస్‌ ఇమ్యునోగ్లోబులిన్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

జాగ్రత్తలు తప్పనిసరి
* నాణ్యమైన టీకాలు ఇప్పిస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. టీకాలు చెడిపోకుండా వాటిని చల్లటి పెట్టెలో భద్రపరచటం చాలా కీలకం. ఏమాత్రం ఎండ తగిలినా టీకా నిర్వీర్యమైపోతుంది. ఇచ్చినా పనిచేయదు.
* చల్లటి పెట్టెలోంచి లేదా ఫ్రిజ్‌లోంచి తీశాక వెంటనే టీకాను ఇచ్చేలా చూసుకోవాలి. కొన్ని టీకాలు పొడి రూపంలో ఉంటాయి. వీటికి డిస్టిల్డ్‌ నీళ్లు కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి టీకాలను ఎప్పటికప్పుడే ఇచ్చేయాలి. మిగిలిపోతే మర్నాడు ఇవ్వటం తగదు. ఇద్దరు ముగ్గురికి ఇవ్వాల్సినపుడు ఒకటే మోతాదు గల సీసాను వాడుకోవటం మంచిది.
* ఏ టీకా తీసుకున్నా అరగంట వరకు ఆసుపత్రిలోనే ఉండాలి. ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే వెంటనే జాగ్రత్త పడటానికి వీలుంటుంది. ఆసుపత్రుల్లో కూడా దుష్ప్రభావాలు తలెత్తినపుడు అత్యవసరంగా చికిత్స చేయటానికి అవసరమైన సదుపాయాలన్నీ ఉండాలి.
* టీకాల పట్టీలో టీకా ఇచ్చిన తేదీతో పాటు టీకా బ్యాచ్‌ సంఖ్య, తయారైన తేదీ కూడా నమోదు చేయాలి. ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే ఆ టీకా ఎక్కడెక్కడ ఉన్నది, ఎవరికి ఇచ్చారనేది వెంటనే తెలిసిపోతుంది.

అపోహలు వద్దు!
* టీకా తీసుకోవటం తప్పనిసరి కాదన్నది కొందరి అపోహ. ఇష్టముంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు అని భావిస్తుంటారు. ఇది సరికాదు. టీకాలు తీసుకోవటం పిల్లల హక్కు. ఇచ్చే బాధ్యత మనది. వాళ్ల హక్కులను పరిరక్షించాలి. బాధ్యతాయుతంగా ఇప్పించాలి.
* టీకాలతో ఆటిజమ్‌, మెదడు దెబ్బతినటం, సంతానలేమి వంటివి తలెత్తుతాయన్నది మరికొందరి అపోహ. ఇందులో నిజం లేదు. టీకాలు సురక్షితమని గుర్తించాలి.
* టీకా ఇవ్వటం వల్ల సహజ రక్షణ వ్యవస్థ క్షీణిస్తుందని మరికొందరు అనుకుంటుంటారు. ఇది తప్పు. యాంటీ వ్యాక్సిన్‌ లాబీలు చేసే ప్రచారాలు నమ్మొద్దు. వాటిని వ్యాపింపజేయొద్దు. టీకాలతో సహజ రక్షణ వ్యవస్థను ప్రేరేపిస్తున్నామే గానీ అణచి వేయటం లేదని తెలుసుకోవాలి.
* టీకా ఇచ్చినపుడు కొందరికి నొప్పి, జ్వరం వంటి చిన్నా చితకా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. ఇవి తాత్కాలికం. టీకాలతో ఒనగూడే ప్రయోజనాలతో పోలిస్తే ఇవి ఒక లెక్కలోకే రావు. అందువల్ల వీటిని పెద్దగా పట్టించుకోవద్దు.

తల్లిపాలే తొలి టీకా

నిజానికి పిల్లలకు తొలి టీకా తల్లిపాలే. తొలిసారిగా వచ్చే ముర్రుపాలలో యాంటీబాడీలు, రోగనిరోధక వ్యవస్థ ప్రేరేపకాలు సంసిద్ధంగా ఉంటాయి. కాబట్టి మాములు కాన్పయినా, సిజేరియన్‌ అయినా బిడ్డ పుట్టిన గంటలోపు.. వీలైనంత త్వరగా తల్లిపాలు పట్టటం తప్పనిసరి. తల్లిపాలు ఇవ్వకపోతే తొలి టీకా ఇవ్వనట్టే!

క్రమం తప్పకుండా..

పిల్లలకు సార్వత్రిక టీకా కార్యక్రమంలో చాలావరకు టీకాలు ఇస్తున్నారు. ఇందులో లేని మరికొన్ని టీకాలు కూడా పిల్లలకు అవసరమేనని పిల్లల వైద్య సమాఖ్య సిఫారసు చేస్తోంది.

తొలిరోజున..

* ఎడమ చేయికి బీసీజీ టీకా ఇవ్వాలి. ఇది క్షయ బారినపడకుండా కాపాడుతుంది. అలాగే పోలియో టీకా చుక్కలు వేస్తారు. దీన్ని ‘జీరో డోస్‌’ అంటారు. ఇది మిగతా పోలియో మోతాదులకు అదనం. వీటితో పాటు హెపటైటిస్‌ బి టీకా ఇవ్వాలి. దీన్ని తొడకు వెలుపలి వైపున ఇవ్వటం మంచిది. ఎందుకంటే పుట్టినపుడు పిల్లలకు కండరం ఇక్కడే ఎక్కువగా ఉంటుంది.

6వ వారాల తర్వాత..

* ఆరో వారం తర్వాత పోలియో చుక్కలతో పాటు కంఠసర్ఫి, కోరింతదగ్గు, ధనుర్వాతం నుంచి రక్షించే డీపీటీ టీకా కూడా ఇవ్వాలి. అలాగే చెవి ముక్కు గొంతు ఇన్‌ఫెక్షన్లు, న్యుమోనియా, మెదడు వాపు రాకుండా చూసే హిమోఫిలస్‌ ఇన్‌ఫ్లుయెంజా బి (హిబ్‌) టీకా.. కామెర్ల నుంచి కాపాడే హెపటైటిస్‌ బి టీకా కూడా ఇవ్వాలి. ఇప్పుడు డీపీటీ, హిబ్‌, హెపటైటిస్‌ బి టీకాలన్నీ ఒక్క టీకా రూపంలోనే (పెంటావాలెంట్‌) అందుబాటులో ఉంది. ఈ ఒక్కటి ఇప్పిస్తే ఐదు జబ్బుల నుంచీ రక్షణ లభిస్తుంది.
* పోలియో చుక్కలతో పాటు ఇటీవలి కాలంలో పోలియో సూది టీకా (ఇంజెక్టబుల్‌ పోలియో వ్యాక్సిన్‌- ఐపీవీ) కూడా ఇస్తున్నారు. ఇతర దేశాల్లో ఐపీవీనే ఇస్తుంటారు. మనదేశంలోనూ నెమ్మదిగా చుక్కల మందును తీసేసి సూది టీకాను ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలియో చుక్కలతో పాటు సూది టీకానూ ఇస్తున్నారు. కొన్నాళ్లు పోయాక ఒక్క పోలియో సూది టీకానే ఇవ్వచ్చు.

10, 14 వారాల తర్వాత..

* 10వ వారం అలాగే 14వ వారం తర్వాత పెంటావాలెంట్‌ టీకాను ఇవ్వాలి. దీంతో మొత్తం మూడు మోతాదులు పూర్తవుతాయి. అలాగే పోలియో చుక్కలు, పోలియో సూది టీకా కూడా ఇవ్వాలి. ఇవికాకుండా న్యుమోనియా బారినపడకుండా చూసే పీసీవీ టీకా, విరేచనాల నుంచి రక్షించే రోటా టీకా కూడా అవసరమే. దాదాపు 141 దేశాలు తమ జాతీయ టీకా కార్యక్రమంలో వీటిని ఇస్తున్నాయి. మనదేశంలోనూ సార్వత్రిక టీకా కార్యక్రమంలో కొన్ని రాష్ట్రాల్లో వీటిని ఇస్తున్నారు. త్వరలోనే వీటిని అన్ని రాష్ట్రాలకూ విస్తరించనున్నారు.

6వ నెలలో..

* ఫ్లూ టీకా ఇవ్వాలి. (ప్రభుత్వ టీకా కార్యక్రమంలో లేకపోయినప్పటికీ దీన్ని 6వ నెలలో ఆరంభించి.. నెల తర్వాత మరో మోతాదు ఇప్పించాలి. ఆ తర్వాత ప్రతి ఏటా ఒక మోతాదు తప్పకుండా ఇప్పించాలి)

9 నెలల తర్వాత..

* గతంలో తట్టు, తడపర నుంచి కాపాడే మీజిల్స్‌ టీకా మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు దీనికి రుబెల్లా (జర్మన్‌ మీజిల్స్‌) టీకాను కూడా కలిపి ‘ఎంఆర్‌’ టీకా ఇస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో దీనికి బదులు గవదబిళ్లల నుంచి కాపాడే మమ్స్‌ టీకాతో కూడిన ఎంఎంఆర్‌ టీకా ఇస్తున్నారు. దీంతో పాటు టైఫాయిడ్‌ టీకా కూడా ఇప్పించాలి. అలాగే మెదడువాపు ఎక్కువగా కనబడే జిల్లాల్లో ‘జపనీస్‌ ఎన్‌కెఫలైటిస్‌ (జెబి) బి టీకా’ కూడా ఇప్పించటం అవసరం.

12 నెలల తర్వాత..

* హెపటైటిస్‌ ఎతో పాటు ఆటలమ్మ నుంచి రక్షించే వారిసెల్లా టీకా ఇప్పించాలి.

15 నెలల తర్వాత..

* పీసీవీ బూస్టర్‌, ఎంఎంఆర్‌ ఇప్పించాలి.

16-18 నెలల్లో..

* పోలియో, డీపీటీ, హిబ్‌ బూస్టర్‌ టీకాలు.. అలాగే హెపటైటిస్‌ ఎ రెండో మోతాదు కూడా ఇప్పించాలి.

4-6 ఏళ్లలో..

* డీపీటీ బూస్టర్‌, వారిసెల్లా రెండో మోతాదు, ఎంఎంఆర్‌ టీకా ఇప్పించాలి.

9 ఏళ్లు దాటాక..

* టీడ్యాప్‌ టీకా ఇవ్వాలి. అలాగే అదనంగా బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారినపడకుండా చూసే హెచ్‌పీవీ టీకా ఇప్పించాలి. దీన్ని మొత్తం మూడు మోతాదులు (మొదటి టీకా తీసుకున్నాక 2 నెలలకు, 6 నెలలకు) ఇప్పించాలి. క్యాన్సర్‌ నుంచి తప్పించే టీకా ఇదొక్కటే కావటం గమనార్హం. అయితే దీన్ని 11 ఏళ్ల లోపే తీసుకుంటే రెండు మోతాదులే సరిపోతాయి. అదే 12 ఏళ్లు దాటితే మూడు మోతాదులూ తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు