నీళ్లతో కరోనా పోతుందా?

కరోనా వైరస్‌ మన ఒంట్లోకి ప్రవేశించినా వెచ్చటి నీళ్లు తాగితే అది పొట్టలోకి వెళ్లిపోతుందని, జబ్బురాదని చదివాను...

Published : 23 Jun 2020 00:38 IST

సమస్య - సలహా

సమస్య: కరోనా వైరస్‌ మన ఒంట్లోకి ప్రవేశించినా వెచ్చటి నీళ్లు తాగితే అది పొట్టలోకి వెళ్లిపోతుందని, జబ్బురాదని చదివాను. ఇది నిజమేనా?

- రమ్యశ్రీ (ఈ-మెయిల్‌ ద్వారా)

సలహా: కరోనా జబ్బు మీద రకరకాల ప్రచారాలు వ్యాప్తిలో ఉన్నాయి. వెచ్చటి నీళ్లు తాగటమనేదీ ఇలాంటిదే. నీళ్లు తాగటం ఆరోగ్యానికి మంచిదే గానీ ఇది కరోనా నివారణకు తోడ్పడుతుందని అనుకోవటం తప్ఫు తరచూ నీళ్లు తాగుతుంటే గొంతులో ఉండే వైరస్‌ అన్నవాహిక ద్వారా జీర్ణాశయం లోపలికి వెళ్లిపోతుందని, ఊపిరితిత్తుల్లోకి చేరుకోదనే భావన దీనికి మూలం. ఇది నిజం కాదు. శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ కాలేదు. నిజంగా ఎవరైనా కరోనా బారినపడ్డారనుకోండి. వైరస్‌ గొంతులోనే తిష్ఠ వేసిందనుకోండి. అక్కడ వేలాది సంఖ్యలో వైరస్‌లుంటాయి. నీళ్లు తాగితే ఇవన్నీ ఒకేసారి గొంతును దాటుకొని, అక్కడ్నుంచి పొట్టలోకి పోతాయని అనుకోవటం భ్రమ. కరోనా వైరస్‌ మీద కొవ్వు పొర ఉంటుంది. దీని సాయంతో కణజాలానికి గట్టిగా అంటుకొని ఉంటుంది. కరోనా వైరస్‌ గొంతు ద్వారానే కాదు.. ముక్కు, కళ్ల ద్వారానూ ఒంట్లోకి ప్రవేశిస్తుందని మరవరాదు. ఒకవేళ గొంతులో స్థిరపడిందని భావించి నీళ్లు తాగినా.. అంతకుముందే అది ముక్కు ద్వారా శ్వాసకోశంలోకి వెళ్లి ఉండొచ్ఛు పైగా మనం తరచూ చేత్తో ముక్కు, నోరు, కళ్లు తాకుతుంటాం. వైరస్‌తో కూడిన తుంపర్లు అంటుకున్న చోట పెట్టిన చేత్తో ముక్కు, కళ్లను రుద్దుకున్నా వైరస్‌ ఒంట్లోకి చేరుకోవచ్ఛు గోరు వెచ్చటి నీళ్లు తాగితే గొంతునొప్పి వంటి లక్షణాల నుంచి కాస్త ఉపశమనం లభించొచ్చేమో గానీ గొంతులోని వైరస్‌ పొట్టలోకి వెళ్లిపోతుందని, జబ్బు అసలే రాదని అనుకోవటం తగదు. ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, మాస్కు ధరించటం వంటి జాగ్రత్తలు విధిగా పాటించటమే ఉత్తమమైన నివారణ మార్గమని తెలుసుకోవాలి.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన చిరునామా

సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు ప్రధాన కార్యాలయం,

రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512 email: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని