ఎందుకీ చెమట్లు?

నాకు 65 ఏళ్లు. మా ఇంట్లో అన్నదమ్ములకి, నాకు చిన్నప్పట్నుంచీ అన్నికాలాల్లో తలలో నుంచి బాగా చెమట్లు వస్తుంటాయి.

Published : 23 Mar 2021 01:03 IST

సమస్య - సలహా

సమస్య: నాకు 65 ఏళ్లు. మా ఇంట్లో అన్నదమ్ములకి, నాకు చిన్నప్పట్నుంచీ అన్నికాలాల్లో తలలో నుంచి బాగా చెమట్లు వస్తుంటాయి. నాకు అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నాయి. ఇటీవల రాత్రిపూట నిద్రలో తలస్నానం చేసినట్టుగా విపరీతంగా చెమట్లు పడుతున్నాయి. పక్క దుప్పట్లు తడిసిపోయి మెలకువ వస్తోంది. దీనికి కారణమేంటి? ఇదేమైనా అనారోగ్యమా? ఫ్యాన్‌, ఏసీ లేకుండా ఒక్క నిమిషమైనా ఉండలేను. పరిష్కార మార్గం తెలపండి.

- నిర్మల, హైదరాబాద్‌

సలహా: విపరీతంగా చెమట్లు పట్టటాన్ని హైపర్‌హైడ్రోసిస్‌ అంటారు. మీకు, అన్నదమ్ములకు చిన్నప్పట్నుంచీ ఈ సమస్య ఉందటున్నారు కాబట్టి చాలావరకు శరీర స్వభావమే కారణమై ఉండొచ్చు. దీనికి పెద్దగా చేయగలిగిందేమీ లేదు. అయితే మీకు అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నాయంటున్నారు. ఇవేవైనా కారణమవుతున్నాయేమో చూసుకోవటం మంచిది. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజు బాగా తగ్గినప్పుడు చెమటలు ఎక్కువగా వచ్చే అవకాశముంది. ఇటీవల మీరు గ్లూకోజు పరీక్ష చేయించుకున్నారో లేదో తెలపలేదు. ఒకవేళ చేయించుకుంటే గ్లూకోజు స్థాయులు నార్మల్‌గా ఉన్నా రాత్రిపూట గ్లూకోజు తగ్గుతుందేమో చూసుకోవటం ముఖ్యం. చెమటలు వచ్చినప్పుడు ఒకసారి గ్లూకోమీటరుతో పరీక్షించుకుంటే గ్లూకోజు ఎంత ఉందో తెలుస్తుంది. గ్లూకోజు బాగా తగ్గినట్టు తేలితే వేసుకుంటున్న మందుల మోతాదులను మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు ఫ్యాన్‌, ఏసీ లేకుండా నిమిషమైనా ఉండలేనని అంటున్నారంటే థైరాయిడ్‌ సమస్యేమైనా ఉందేమో చూసుకోవాల్సీ ఉంటుంది. థైరాయిడ్‌ సమస్య గలవారికి శరీరం వేడిగా, పొగలు పొగలుగా, ఆవిర్లు పడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. అరుదుగా కొందరికి గుండె వైఫల్యం, ఊపిరితిత్తుల వైఫల్యం, కొన్నిరకాల క్యాన్సర్లతోనూ చెమట్లు పట్టొచ్చు. ముందుగా మీరు దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించండి. గ్లూకోజు, థైరాయిడ్‌ వంటి అవసరమైన పరీక్షలు చేయిస్తారు. ఏవైనా తేడాలుంటే తగు మందులు, చికిత్స సూచిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు