మెదడు సమస్యల గుట్టు పెట్‌ స్కాన్‌తో రట్టు

కొత్త కరోనా జబ్బు మెదడునూ వదలటం లేదు. విషయ గ్రహణ సామర్థ్యాన్నీ బాగానే దెబ్బతీస్తోంది. చాలామందిలో రోజులు గడుస్తున్నకొద్దీ దీని దుష్ప్రభావాలు తగ్గుతూ....

Published : 22 Jun 2021 00:22 IST

కొత్త కరోనా జబ్బు మెదడునూ వదలటం లేదు. విషయ గ్రహణ సామర్థ్యాన్నీ బాగానే దెబ్బతీస్తోంది. చాలామందిలో రోజులు గడుస్తున్నకొద్దీ దీని దుష్ప్రభావాలు తగ్గుతూ రావొచ్చు గానీ కొందరిలో ఆరు నెలలు దాటాకా కొనసాగుతూనే వస్తున్నట్టు తాజా అధ్యయనం పేర్కొంటోంది. జబ్బు నుంచి కోలుకున్న తర్వాత కూడా ఎంతోమంది మతిమరుపు, ఏకాగ్రత కొరవడటం, విషయ గ్రహణశక్తి తగ్గటం వంటి వాటితో సతమతమైపోతున్నారు. కొవిడ్‌-19 తీవ్రమైనవారిలోనే కాదు.. ఒక మాదిరి, మధ్యస్థ జబ్బు గలవారిలోనూ ఇవి దీర్ఘకాలం వేధిస్తుండటం గమనార్హం. మరి మెదడు దెబ్బతిన్న విషయాన్ని గుర్తించటమెలా? పెట్‌ స్కాన్‌తో దీన్ని కచ్చితంగా గుర్తించే అవకాశముందని సొసైటీ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ మాలిక్యులర్‌ ఇమేజింగ్‌ (ఎన్‌ఎన్‌ఎంఎంఐ) వార్షిక సమావేశంలో సమర్పించిన అధ్యయనం పేర్కొంటోంది. కరోనా బారినపడి, ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నవారి మెదడును పెట్‌ స్కాన్‌ చేయగా.. నాడీ వ్యవస్థ పనితీరులో లోపాలు ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. చాలామందిలో నాడీ పనితీరు, విషయ గ్రహణ గణనీయంగా మెరుగుపడుతున్నప్పటికీ కొందరిలో ఆరు నెలల అనంతరమూ లోపాలు స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం. సుదీర్ఘంగా మెదడు స్కాన్‌లను పరిశీలిస్తూ.. మార్పులను విస్పష్టంగా పేర్కొన్నందుకు గాను అధ్యయనంలో ప్రచురితమైన ఫొటోకు ఎన్‌ఎన్‌ఎంఎంఐ మేటి చిత్రంగానూ గుర్తింపు లభించింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని