రెమ్‌డెసివిర్‌తో గుండె వేగం నెమ్మది!

కొవిడ్‌-19 చికిత్సలో వైరస్‌ వృద్ధిని తగ్గించటానికి రెమ్‌డెసివిర్‌ మందును విరివిగా వాడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే దీని వాడకంలో కాస్త జాగ్రత్త అవసరమని హార్ట్‌ రిథమ్‌ సొసైటీ పత్రికలో ప్రచురితమైన ఉదంతం ఒకటి పేర్కొంటోంది.

Published : 29 Jun 2021 01:21 IST

కొవిడ్‌-19 చికిత్సలో వైరస్‌ వృద్ధిని తగ్గించటానికి రెమ్‌డెసివిర్‌ మందును విరివిగా వాడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే దీని వాడకంలో కాస్త జాగ్రత్త అవసరమని హార్ట్‌ రిథమ్‌ సొసైటీ పత్రికలో ప్రచురితమైన ఉదంతం ఒకటి పేర్కొంటోంది. తీవ్రమైన ఆయాసంతో వచ్చిన ఒకామెకు అమెరికాలోని రీజినల్‌ మెడికల్‌ సెంటర్‌ బేయోనెట్‌ పాయింట్‌ వైద్యులు కొవిడ్‌-19 ఉందని నిర్ధరించుకున్నాక రెమ్‌డెసివిర్‌ చికిత్స ఆరంభించారు. అయితే 24 గంటల తర్వాత రక్తపోటు, గుండె వేగం పడిపోవటం కలవరం కలిగించింది. గుండె నిమిషానికి 38 సార్లే కొట్టుకుంటున్నట్టు గుర్తించారు. అంతకుముందు ఆమెకు ఎలాంటి గుండెజబ్బులూ లేవు. రెమ్‌డెసివిర్‌ ఇవ్వటానికి ముందు ఈసీజీ వంటి పరీక్షలన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. గుండె వేగం తగ్గటం రెమ్‌డిసివిర్‌ ప్రభావంతోనే అని అనుమానించిన వైద్యులు వెంటనే సెలైన్‌ ద్వారా డొపమైన్‌ ఇవ్వటం ఆరంభించారు. దీంతో గుండె వేగం తిరిగి మామూలు స్థాయికి వచ్చింది. రెమ్‌డెసివిర్‌ చివరి మోతాదు ఇచ్చిన 18 గంటల తర్వాతే డొపమైన్‌ ఆపేశారు. ఆమె జబ్బు నుంచి కోలుకున్నారు. గుండె పనితీరూ కుదుట పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకొనే రెమ్‌డెసివిర్‌ ఇచ్చే సమయంలో గుండె పనితీరును గమనిస్తూ ఉండటం మంచిదని, వేగం తగ్గితే అవసరమైన చికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. ఒకవేళ అప్పటికే గుండె జబ్బులు ఉన్నట్టయితే మరింత అప్రమత్తత అవసరమని సూచిస్తున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని