నడుం సన్నం జ్ఞాపకం ఘనం!

మతిమరుపులో శరీర ఆకారమూ పాలు పంచుకుంటుందా? ఆశ్చర్యంగానే అనిపించినా ఇది నిజమేనని మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ జార్జియా పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. బొజ్జ గలవారిలో శరీర బరువు నడుం పైభాగాననే ఎక్కువగా పడుతుంది.

Published : 17 Aug 2021 02:08 IST

 

తిమరుపులో శరీర ఆకారమూ పాలు పంచుకుంటుందా? ఆశ్చర్యంగానే అనిపించినా ఇది నిజమేనని మెడికల్‌ కాలేజ్‌ ఆఫ్‌ జార్జియా పరిశోధకుల అధ్యయనం పేర్కొంటోంది. బొజ్జ గలవారిలో శరీర బరువు నడుం పైభాగాననే ఎక్కువగా పడుతుంది. నడుం సన్నగా (పియర్స్‌ ఆకారంలో) ఉండేవారిలో బరువు సమానంగా విస్తరించి ఉంటుంది. వీరికి గుండెజబ్బులు, మధుమేహం ముప్పులు తక్కువన్న సంగతి తెలిసిందే. తాజాగా తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా ముప్పూ తక్కువేననీ బయటపడింది. దీనికి కారణం నడుం సన్నగా ఉండేవారిలో చర్మం కింద లేత గోధుమరంగు కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండటమే. మన శరీరంలో తెల్ల, గోధుమ రంగు కొవ్వులతో పాటు లేత గోధుమ రంగు కొవ్వు కూడా ఉంటుంది. గోధుమ రంగు కొవ్వు శక్తి ఖర్చయ్యేలా చేస్తుంది. తెల్ల కొవ్వు శక్తిని నిల్వ చేసుకుంటుంది. ఇలా అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తుంది. ఇక తెల్ల కొవ్వుతో మిళితమై ఉండే లేత గోధుమరంగు కొవ్వు శక్తిని ఖర్చు చేసే, నిల్వ చేసే గుణాలూ రెండూ కలిగుంటుంది. నాడుల రక్షణకు, తెల్ల కొవ్వు ప్రేరేపించే వాపు ప్రక్రియ నివారణకు ఇది అత్యవసరమని శాస్త్రవేత్తలు గుర్తించారు. లేత గోధుమ రంగు కొవ్వు యువతీ యువకుల్లో ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. చల్లటి వాతావరణం, వ్యాయామాలు తెల్ల కొవ్వు కణాలను లేత గోధుమ రంగు కొవ్వు కణాలుగా మారుస్తుండటం విశేషం. ఇది వేడిని విడుదల చేయటం ద్వారా శక్తి ఖర్చు కావటానికి తోడ్పడుతుంది. డిమెన్షియా నివారణకు, ఊబకాయానికి కొత్త చికిత్సలను రూపొందించటంలో తాజా అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు. రోజురోజుకీ ఊబకాయం పెరుగుతుండటం, వృద్ధుల సంఖ్యతో పాటు డిమెన్షియా ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇవి కొత్త ఆశలు రేపుతున్నాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని