కరోనా తగ్గినా ఇంకా పొడి దగ్గు?

నాకు నాలుగు నెలల క్రితం కొవిడ్‌ వచ్చి తగ్గింది. కానీ ఇంకా పొడి దగ్గు వస్తూనే ఉంది. పగటి వేళ బాగా ఇబ్బంది పెడుతోంది. కూర్చున్నా, నిల్చున్నా దగ్గు వస్తుంది.

Updated : 07 Sep 2021 04:32 IST

సమస్య: నాకు నాలుగు నెలల క్రితం కొవిడ్‌ వచ్చి తగ్గింది. కానీ ఇంకా పొడి దగ్గు వస్తూనే ఉంది. పగటి వేళ బాగా ఇబ్బంది పెడుతోంది. కూర్చున్నా, నిల్చున్నా దగ్గు వస్తుంది. పడుకున్నప్పుడు రాదు. బుడేకార్ట్‌ ఇన్‌హేలర్‌ వాడితే ఉపశమనం కలుగుతుంది. పరీక్షల రిపోర్టులు, సీటీ స్కాన్‌ అన్నీ మామూలుగానే ఉన్నాయి. అయినా దగ్గు ఎందుకు వస్తోంది? దీనికి పరిష్కారమేంటి?

- సీహెచ్‌ సంపత్‌ కుమార్‌ (ఈమెయిల్‌)

సలహా: కొవిడ్‌-19 తగ్గిన తర్వాత కూడా 10-15% మందికి దీర్ఘకాలం దగ్గు రావటం చూస్తున్నాం. ఇలాంటివారిలో అప్పటికే కాస్త అలర్జీ కూడా ఉంటోంది. కొందరికి కొవిడ్‌-19 మూలంగా ఊపిరితిత్తుల్లో కణజాలం గట్టిపడొచ్చు (లంగ్‌ ఫైబ్రోసిస్‌). ఇది జబ్బు తీవ్రతను బట్టి ఆధారపడి ఉంటుంది. కొవిడ్‌-19 తీవ్రమైనవారిలో నాలుగైదు నెలల వరకు లోపల ఇది మచ్చల రూపంలో అలాగే ఉంటుంది. దీంతోనూ దీర్ఘకాలం దగ్గు వేధించొచ్చు. అందువల్ల మీకు ముందుగా మామూలు ఛాతీ ఎక్స్‌రేతో పాటు అలర్జీ పరీక్షలు, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలిపే స్పైరోమెట్రీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. దగ్గు అలర్జీతో వస్తోందా? ఆస్థమాతో వస్తోందా? అనేది వీటితో బయటపడుతుంది. దీని ప్రకారం మందులిస్తే తగ్గిపోతుంది. ఒకవేళ కణజాలం గట్టిపడినట్టయితే నాలుగైదు నెలల వరకు మందులు వాడుకోవాల్సి ఉంటుంది. మీరు పడుకున్నప్పుడు దగ్గు రావటం లేదని అంటున్నారు. నిజంగా జబ్బుతో అయితే పడుకున్నప్పుడూ దగ్గు రావాలి. ఆ మాటకొస్తే ఆస్థమా, అలర్జీతో వచ్చే దగ్గు రాత్రిపూట ఎక్కువగా వస్తుంది కూడా. మీరు అతిగా ఆలోచించటమో, ఇంకేదైనా మానసికంగానో బాధపడుతూ ఉండొచ్చేమోనని అనిపిస్తోంది. దీంతోనూ పగటి పూట దగ్గు రావొచ్చు. పనిచేసే చోట దుమ్ము ధూళి వంటివి పడటం లేదేమో కూడా చూసుకోవాలి. మీరు దగ్గర్లోని పల్మనాలజిస్టును సంప్రదిస్తే తగు పరీక్షలు చేసి, అవసరమైన మందులు సూచిస్తారు. కంగారు పడాల్సిన పనిలేదు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని