టెక్‌ మెడ నొప్పి!

మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు నిజంగానే మన మెడలు వంచేశాయి! ఆత్మీయులతో మాట్లాడాలన్నా, డబ్బులు పంపాలన్నా, ఇంటర్నెట్‌ చూడాలన్నా అన్నీ వీటితో మెడలు వంచే చేస్తున్నాం.

Updated : 05 Jul 2022 06:04 IST

మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు నిజంగానే మన మెడలు వంచేశాయి! ఆత్మీయులతో మాట్లాడాలన్నా, డబ్బులు పంపాలన్నా, ఇంటర్నెట్‌ చూడాలన్నా అన్నీ వీటితో మెడలు వంచే చేస్తున్నాం. ఇలా గంటల కొద్దీ ఫోన్‌, ట్యాబ్లెట్ల వంక చూస్తూ ఉండటం మెడ నొప్పికి దారితీస్తుంది. దీన్ని టెక్‌ నెక్‌ లేదా టెక్స్ట్‌ నెక్‌ అని పిలుచుకుంటున్నారు. ఎంత కిందికి వంచితే మెడ మీద అంత ఎక్కువ భారం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు- 15 డిగ్రీల కోణంలో మెడను ముందుకు వంచితే మెడ మీద 12.5 కిలోల అదనపు భారం పడుతుంది. అదే 30 డిగ్రీల కోణంలో వంచితే 16 కిలోలు, 60 డిగ్రీల కోణంలో వంచితే 27.2 కిలోల ఎక్కువ భారం పడుతుంది. దీంతో మెడ వద్ద వెన్నుపూసల మధ్య డిస్క్‌లు, చిన్న కీళ్లు (ఫేసెట్‌ జాయింట్స్‌) త్వరగా క్షీణిస్తాయి. క్రమంగా మెడ నొప్పికి దారితీస్తుంది. ఒకప్పుడు మెడ నొప్పి వృద్ధాప్యంలో వస్తుండేది. ఇప్పుడు మొబైల్‌ ఫోన్ల పుణ్యమాని చిన్న వయసులోనే మొదలవుతోంది. పిల్లల్లోనూ ఇది కనిపిస్తుండటం గమనార్హం. కొందరికి నిరంతరం స్వల్పంగా నొప్పి పుడుతున్నట్టు అనిపించొచ్చు. కొందరికి లోపలేదో బాదుతున్నట్టు తీవ్రంగానూ ఉండొచ్చు. ఈ నొప్పి భుజాలకు, చేతులకూ పాకుతుంటుంది. కొన్నిసార్లు ఏదో పొడుస్తున్నట్టు, మొద్దుబారినట్టూ అనిపించొచ్ఛు డిజిటల్‌ పరికరాల వాడకంతో ముడిపడిన మెడ నొప్పి వచ్చాక బాధ పడటం కన్నా నివారించుకోవటమే ఉత్తమం. భంగిమ సరిగా ఉండేలా, మెడ మరీ కిందికి వంచకుండా చూసుకోవాలి. పరికరాల వాడకం తగ్గించుకోవాలి. 10-15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు మొబైల్‌ ఫోన్లు వాడకుండా చూసుకోవాలి. వీలుంటే డెస్క్‌టాప్‌ వంటి పెద్ద తెర పరికరాలను వాడుకోవాలి. బల్ల మీద మొబైల్‌ స్టాండ్‌కు ఫోన్‌ను బిగిస్తే తల మరీ వంచకుండా చూసుకోవచ్చు. అలాగే మెడ, భుజాలు, వెన్నెముకకు దన్నుగా ఉండే కండరాలను బలోపేతం చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలతో మెడ నొప్పి ముప్పును తగ్గించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని