అనుమానాలు అపోహలొద్దు!

రొమ్ముక్యాన్సర్‌. పల్లె, పట్నం తేడా లేకుండా మహిళలందరినీ కలవర పెడుతున్న సమస్య. రొమ్ములో గడ్డ తలెత్తగానే ఎవరికైనా ఆందోళన, భయం కలగటం సహజమే.

Updated : 03 Oct 2023 03:19 IST

ఇది రొమ్ము క్యాన్సర్‌ అవగాహనా మాసం

రొమ్ముక్యాన్సర్‌. పల్లె, పట్నం తేడా లేకుండా మహిళలందరినీ కలవర పెడుతున్న సమస్య. రొమ్ములో గడ్డ తలెత్తగానే ఎవరికైనా ఆందోళన, భయం కలగటం సహజమే. అయితే గడ్డలన్నీ క్యాన్సర్‌ కాకపోవచ్చు. ఇతరత్రా సమస్యలూ కావొచ్చు. అలాగని నిర్లక్ష్యం పనికిరాదు. ఎందుకంటే మనదేశంలో మహిళల్లో అతి ఎక్కువగా కనిపిస్తున్నది రొమ్ము క్యాన్సరే. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడిది చిన్న వయసులోనే మొదలవుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. మారిపోతున్న జీవనశైలి, కాలుష్యం, జన్యువులు, అధిక బరువు, త్వరగా రజస్వల కావటం, ఆలస్యంగా నెలసరి నిలిచిపోవటం వంటివెన్నో దీనికి దోహదం చేస్తున్నాయి. కారణాలేవైనా రొమ్ముక్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, చికిత్స తీసుకుంటే చాలావరకు బయటపడొచ్చు. దీనికి కావాల్సిందల్లా జబ్బుపై అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండటం. అనుమానాలు, అపోహలకు తావివ్వకుండా సందేహాలను నివృత్తి చేసుకోవటం. రొమ్ముక్యాన్సర్‌ అవగాహనా మాసం సందర్భంగా అలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

రొమ్ముల్లో గడ్డలన్నీ క్యాన్సర్లేనా? ఇంకా ఏవైనా సమస్యలు వస్తాయా?
రొమ్ముల్లో క్యాన్సర్‌ మాత్రమే కాదు.. కణజాలం గట్టిపడటం (ఫైబ్రాడినోమా), నీటి తిత్తులు (సిస్ట్‌).. క్షీరగ్రంథులు, క్షీరనాళాల కణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగటం (హైపర్‌ప్లేసియా) వంటి రకరకాల సమస్యలూ తలెత్తొచ్చు. గడ్డల్లోనూ అన్నీ క్యాన్సర్‌ కాకపోవచ్చు. మామూలువీ ఉండొచ్చు. క్యాన్సర్‌ రహిత గడ్డలు సాధారణంగా 20-45 ఏళ్ల వయసువారిలో చూస్తుంటాం. 35 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసువారిలో క్యాన్సర్‌ను పోలిన మరికొన్ని సమస్యలూ తలెత్తుతుంటాయి. ఒకప్పుడు 40 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసు మహిళల్లో రొమ్ముక్యాన్సర్‌ వస్తుండేది. ఇప్పుడు 30 ఏళ్ల వారిలోనూ కనిపిస్తోంది. జీవనశైలి మారటం, పర్యావరణ అంశాల వంటివన్నీ ఇందుకు కారణమవుతున్నాయి. రొమ్ముల్లో తలెత్తే ప్రతి 10 గడ్డల్లో 9 గడ్డలు మామూలువే. అయితే అవి క్యాన్సర్‌ గడ్డలో, కాదో అని ధ్రువీకరించుకోవటం ముఖ్యం. అందువల్ల గడ్డ ఎలాంటిదైనా రొమ్ము నిపుణులతో పరీక్ష చేయించు కోవాలి.

ఎప్పుడు అనుమానించాలి? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
రొమ్ముక్యాన్సర్‌ను వీలైనంత త్వరగా గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. మంచి ఫలితం కనిపిస్తుంది. కాబట్టి తరచూ రొమ్ముల తీరుతెన్నులను పరిశీలిస్తూ ఉండటం ఎంతైనా అవసరం. రొమ్ము సైజు మారటం, రొమ్ముల్లో విడవకుండా నొప్పి రావటం.. చేత్తో తాకితే కొత్తగా మందంగా, గట్టిగా గడ్డల్లాంటివి తగలటం.. రొమ్ము మీద, చనుమొనల వద్ద చర్మం రంగు మారటం.. చనుమొనల నుంచి స్రావాలు రావటం, చనుమొనలు లోపలి వైపునకు లాక్కుపోవటం, రొమ్ముల మీద సొట్ట పడటం, చంకల్లో బిళ్ల కట్టటం, నొప్పి వంటి మార్పులు కనిపిస్తే  నిర్లక్ష్యం చేయరాదు.

గడ్డలను గమనిస్తే ఏం చేయాలి? ఎలాంటి పరీక్షలు అవసరం?
రొమ్ముల్లో కొత్తగా అసాధారణ మార్పులు కనిపిస్తే ముందుగా చేయాల్సిన పని రొమ్ము నిపుణులను సంప్రదించటం. అంతే తప్ప ఇరుగుపొరుగు వారు చెప్పారని చిట్కాల వంటివి పాటించొద్దు. అనుభవం గల డాక్టర్లు రొమ్మును చేత్తో తాకి పరిశీలించి, సమస్య ఏంటనేది గుర్తిస్తారు. ఏదైనా అనుమానం వస్తే మామోగ్రామ్‌ లేదా అల్ట్రాసౌండ్‌ పరీక్షలు సూచిస్తారు. వయసు, రొమ్ము తీరుతెన్నులను బట్టి ఎవరికి ఏ పరీక్ష అవసరమో నిర్ణయిస్తారు. సాధారణంగా 40 ఏళ్ల లోపు వయసువారికి అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయిస్తారు. రొమ్ముక్యాన్సర్‌ కావొచ్చని బలంగా అనుమానిస్తే మామోగ్రామ్‌ పరీక్ష చేయిస్తారు. ఎందుకంటే 40 ఏళ్ల లోపువారిలో రొమ్ము కణజాలం మందంగా ఉంటుంది. దీంతో మామోగ్రామ్‌ పరీక్షలో కొన్నిసార్లు గడ్డలు కనిపించకపోవచ్చు. సమస్యను పట్టుకోలేకపోతే అలాగే ముదురుతూ వస్తుంది. కాబట్టి అవసరమైనవారికి సరైన పరీక్ష చేయటం చాలా ముఖ్యం. దీన్ని అనుభవమున్న వైద్యులే నిర్ణయించగలరు. సమస్యను కచ్చితంగా గుర్తిస్తే వెంటనే చికిత్స సాధ్యమవుతుంది. మామోగ్రామ్‌, అల్ట్రాసౌండ్‌, సూది ద్వారా గడ్డలోంచి ముక్క తీసి (బయాప్సీ) పరీక్షించటం ద్వారా సమస్య కచ్చితంగా నిర్ధరణ అవుతుంది.

రొమ్ముల్లో నొప్పి మామూలేనా? చింతించాల్సిన పనిలేదా?
రొమ్మునొప్పి తరచూ చూస్తుంటాం. అన్ని వయసుల వారిలోనూ ఇది కనిపిస్తుంటుంది. ముఖ్యంగా చిన్నవయసువారిలో శారీరక కారణాలతో నొప్పి వస్తుంటుంది. నెలసరి రావటానికి 10, 15 రోజుల ముందు రొమ్ము నొప్పి రావటం సహజమే. రొమ్ములు బరువుగా అనిపించటం, సలపరం, కాస్త సైజు పెరగటమూ గమనిస్తుంటాం. దీనికి చింతించాల్సిన పనిలేదు. అయితే నెలసరి తర్వాత కూడా నొప్పి తగ్గకుండా వేధిస్తుంటే అనుమానించాల్సిందే. తాత్సారం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎప్పుడెప్పుడు రొమ్ము నొప్పి వస్తుందో డైరీలో రాసుకుంటే సమస్యను గుర్తించటానికి వీలుంటుంది. అలాగే రొమ్ముల సైజుకు తగిన బ్రా ధరించటం, రోజూ వ్యాయామం చేయటమూ ముఖ్యమే. హార్మోన్ల మోతాదులు అస్తవ్యస్తమైతే వ్యాయామంతో కుదురుకుంటాయి.

గర్భం ధరించినప్పుడు ఎలాంటి మార్పులను పరిశీలించాలి?
గర్భం ధరించినప్పుడు రొమ్ములు పెద్దగా అవుతాయి. నొప్పి పుడతాయి. కొందరికి కొత్తగా గడ్డలూ ఏర్పడొచ్చు. అంతకుముందు ఏవైనా గడ్డలుంటే వాటి సైజూ పెరుగుతుంది. అందువల్ల గర్భం ధరించిన తర్వాత కొత్తగా ఏవైనా గడ్డలు ఏర్పడితే వెంటనే రొమ్ము నిపుణులను సంప్రదించాలి. గర్భధారణతో ముడిపడిన రొమ్ముక్యాన్సర్‌ ఏమైనా ఉందా? అనేది పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అయితే గర్భం ధరించినప్పుడు డాక్టర్‌ సలహా మేరకే మామోగ్రామ్‌ చేయించుకోవాలి. గర్భిణులకు అల్ట్రాసౌండ్‌ పరీక్ష సురక్షితమైన పద్ధతని తెలుసుకోవాలి. గర్భధారణతో ముడిపడిన రొమ్ము క్యాన్సర్‌ చాలా తీవ్రంగా ఉంటుంది. చాలావరకు బాగా ముదిరిన తర్వాతే బయటపడుతుంటుంది. గర్భిణుల రొమ్ముల్లో గడ్డలు మామూలేనని, క్యాన్సర్‌కు సంబంధించినవి కావని చాలామంది భావిస్తుండటమే దీనికి కారణం. కాబట్టి అనుమానిత లక్షణాలు కనిపించినప్పుడు సరైన పరీక్ష, అవసరమైతే బయాప్సీ చేయటం చాలా ముఖ్యం.

దగ్గరలో మంచి ఆసుపత్రి, రోగ నిర్ధరణ కేంద్రాలు లేకపోతే ఏం చేయాలి?
మనదేశంలో మారుమూల ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో మంచి ఆసుపత్రులు, నిర్ధరణ పరీక్ష కేంద్రాలు అంతగా అందుబాటులో ఉండవు. ఇలాంటి సమయంలో ముఖ్యంగా చేయాల్సింది ఎవరికి వారే తరచూ రొమ్ములను తాకి, నిశితంగా పరీక్షించుకోవటం. అలాగే అద్దం ముందు నిల్చొని పక్కలకు తిరుగుతూ రొమ్ము సైజు ఏమైనా మారిందా? అనేది చూసుకోవాలి. నెలసరి వచ్చిన తర్వాతే ఈ స్వీయ పరీక్ష చేసుకోవాలి. రొమ్ము అంతకు ముందు నెలలో మాదిరిగానే ఉంటే ఆందోళన అవసరం లేదు. ఒకవేళ కొత్తగా గడ్డలు, మొనల నుంచి స్రావాలు, చర్మం రంగు మారటం, దద్దురు వంటి మార్పులు గమనిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మహిళలంతా 40 ఏళ్లు దాటాక ఏటా ఒకసారి మామోగ్రామ్‌ పరీక్ష చేయించుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని