చలికాలం జర భద్రం!

చాలావరకు చలికాలం హాయిగానే గడుస్తుంది. ఉదయం నులి వెచ్చని ఎండలో సేద తీరుతాం. సాయంత్రం పకోడీలు, బజ్జీలు తింటూ.. కాఫీ, టీలు తాగుతూ రోజులను ఆస్వాదిస్తాం

Published : 07 Nov 2023 00:46 IST

చాలావరకు చలికాలం హాయిగానే గడుస్తుంది. ఉదయం నులి వెచ్చని ఎండలో సేద తీరుతాం. సాయంత్రం పకోడీలు, బజ్జీలు తింటూ.. కాఫీ, టీలు తాగుతూ రోజులను ఆస్వాదిస్తాం. చలి మరీ ఎక్కువైతే స్వెట్టర్లు, మంకీ క్యాప్‌ల ఆసరా ఉండనే ఉంది. రాత్రిపూట దుప్పటి కప్పేసుకొని పడుకుంటే తెల్లారినా మెలకువే రాదు. ఇంతవరకే అయితే ఇబ్బందేముంది? కానీ చలికాలం కొన్ని జబ్బులనూ మోసుకొస్తుంది. మామూలు జలుబు, దగ్గు దగ్గరి నుంచి తీవ్రమైన గుండెపోటు వరకూ ఎన్నెన్నో సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి చలికాలంలో జర భద్రంగా ఉండక తప్పదు.


జలుబు, దగ్గు

చలికాలంలో జలుబు, దగ్గు కాస్త ఎక్కువ. ఎందుకంటే వీటికి కారణమయ్యే వైరస్‌లు చల్లటి వాతావరణంలో తేలికగా, వేగంగా వృద్ధి చెందుతాయి, వ్యాపిస్తాయి. జలుబుతో బాధపడేవారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా వైరస్‌లు గాలిలో కలుస్తాయి. ఇవి శ్వాస ద్వారా చుట్టుపక్కల ఉన్నవారికి సంక్రమిస్తాయి. ఈ తుంపర్లు అంటుకుపోయిన వస్తువులను తాకిన చేతులతో కళ్లు, ముక్కు రుద్దుకున్నా వైరస్‌లు అంటుకుంటాయి. అప్పటికే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారికి ఇంకాస్త త్వరగానూ వ్యాపిస్తాయి. అలాగే మధుమేహం వంటి జబ్బులు గలవారికి, క్యాన్సర్‌ చికిత్సలు తీసుకునేవారికి, రోగనిరోధక శక్తిని అణచిపెట్టే మందులు వాడేవారికి, వృద్ధులకు, పిల్లలకు, గర్భిణులకు కూడా జలుబు ముప్పు ఎక్కువే. వీరినిది తీవ్రంగానూ వేధిస్తుంది.

  • ఊపిరితిత్తులు, వీటి లోపలి పొరలు చల్లగాలికి విపరీతంగా స్పందిస్తాయి. పొడి వాతావరణం మూలంగా గాలిలో దుమ్ముధూళి ఎక్కువగానూ కలుస్తుంది. దీంతో అలర్జీ, ఆస్థమా, సీవోపీడీ బాధితులకు దగ్గు, ఆయాసం వంటి ఇబ్బందులు తీవ్రం కావొచ్చు. కొందరికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకూ దారితీయొచ్చు.
  •  ఉష్ణోగ్రత బాగా తగ్గినప్పుడు బయటకు వెళ్తే ముక్కులోని కణజాలం ఉబ్బిపోయి ముక్కు దిబ్బడ వేయొచ్చు. ముక్కు చుట్టుపక్కల గదులకు వెళ్లే దారులు (సైనస్‌ మార్గాలు) కూడా మూసుకుపోవచ్చు. సైనసైటిస్‌తో బాధపడేవారికిది చిక్కులు తెచ్చిపెడుతుంది.

జాగ్రత్త ఇలా: మామూలు జలుబు చాలావరకు దానంతటదే తగ్గుతుంది. తగినంత విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. జ్వరం ఎక్కువగా ఉంటే పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవచ్చు. రెండు రోజులైనా జ్వరం తగ్గకపోయినా, జ్వరం తీవ్రంగా ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులు నిర్లక్ష్యం చేయొద్దు. తుమ్ములు, దగ్గు ఎక్కువగా ఉంటే యాంటీహిస్టమిన్‌ మందులు మేలు చేస్తాయి. ఆస్థమా గలవారు ముందు నుంచే కంట్రోలర్‌ మందులు వాడుకోవాలి. ఆస్థమా ఉద్ధృతమైనప్పుడు రిలీవర్లు వాడుకోవాలి. వీటిని నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలి. శ్వాస సమస్యలతో బాధపడేవారు రోజులో ఎప్పుడైనా గోరువెచ్చటి నీళ్లు తాగటం మంచిది.


గుండెకు ముప్పు

చల్లటి వాతావరణం గుండెకు చేటు చేస్తుంది. బయట ఉష్ణోగ్రత తగ్గినప్పుడు శరీరం తనను వెచ్చగా ఉంచుకోవటానికి రక్తనాళాలు సంకోచించేలా చేస్తుంది. దీంతో గుండె ఇంకాస్త బలంగా రక్తాన్ని పంప్‌ చేయటానికి ప్రయత్నిస్తుంది. గుండె కండరానికి సైతం ఆక్సిజన్‌తో కూడిన రక్త సరఫరా తగ్గొచ్చు. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశం పెరగొచ్చు. రక్తనాళాల్లో పూడికలు, అధిక రక్తపోటు వంటి సమస్యలు గలవారికి మరింత ఎక్కువ ప్రమాదం పొంచి ఉంటుంది. కొందరికి ఫ్లూ జ్వరంతో ఒంట్లో నీటిశాతం తగ్గిపోయి, రక్తపోటు పడిపోయే ప్రమాదమూ ఉంది. వీరిలో గుండెకు తగినంత రక్తం అందక గుండెపోటు తలెత్తొచ్చు. చలికాలంలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పులతో కొలెస్ట్రాల్‌, రక్తం గడ్డకట్టటానికి తోడ్పడే ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగొచ్చు. దీంతో రక్తం కాస్త చిక్కగా అవ్వచ్చు. రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. ఇవి అప్పటికే కుంచించుకుపోయిన రక్తనాళాల్లో అడ్డంకులు సృష్టిస్తాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఇలాంటి గడ్డలు ఉన్నట్టయితే గుండెపోటు తలెత్తొచ్చు. మెదడు రక్తనాళాల్లో అడ్డుపడితే పక్షవాతానికి దారితీస్తుంది.
జాగ్రత్త ఇలా: గుండెజబ్బులు, అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎక్కువగా చలి వాతావరణానికి గురికావొద్దు. క్రమం తప్పకుండా మందులేసుకోవాలి. ఒంటికి నువ్వుల నూనెతో మర్దన చేసుకుంటే రక్తనాళాలు సంకోచించటం తగ్గుతుంది.


ఉత్సాహం ఉఫ్‌

చలికాలంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. రోజులో తగినంత వెలుగు, సూర్యరశ్మి ఉండవు. దీంతో కొందరికి ఉత్సాహం సన్నగిల్లుతుంది. నిరాశ, నిస్పృహలకు లోనవుతుంటారు. కొందరిలో ఇవి మరింత తీవ్రంగానూ ఉండొచ్చు. కొందరికి చలికాలం వచ్చినప్పుడల్లా మొదలవ్వచ్చు. దీన్నే సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌ (ఎస్‌ఏడీ) అంటారు. ఇదో రకం కుంగుబాటు (డిప్రెషన్‌) సమస్యే. మనం నిద్ర పోవటాన్ని, లేవటాన్ని మెదడులో విడుదలయ్యే మెలటోనిన్‌, సెరటోనిన్‌ హార్మోన్లు నియంత్రిస్తుంటాయి. ఇవి ఉత్పత్తి కావటంలో సూర్యరశ్మి పాత్ర కీలకం. వెలుగు తగ్గి, చీకటి పడుతున్నప్పుడు మెలటోనిన్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్రమత్తు, నిరుత్సాహాన్ని కలగజేస్తుంది. వెలుతురు బాగా ఉన్నప్పుడు, శరీరానికి ఎండ తగిలినప్పుడు ఉత్సాహాన్ని కలగజేసే సెరటోనిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి సెరటోనిన్‌ ఉత్పత్తి తగ్గిపోయి నిరుత్సాహానికి దారితీస్తుంది. హుషారు, ఆసక్తి సన్నగిల్లుతాయి. ఎప్పుడూ పడుకోవాలనీ అనిపించొచ్చు. కొందరికి ఆకలి తగ్గితే.. మరికొందరికి పెరగొచ్చు.
జాగ్రత్త ఇలా: రోజూ శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. ఇంట్లోకి ఎండ, వెలుతురు వచ్చేలా కిటికీలు తెరవాలి. చలి పెడుతోందని అస్తమానం ఇంట్లోనే కూర్చోకుండా నలుగురితో కలవాలి. మిత్రులు, బంధువులతో సరదాగా గడపాలి.


పెరిగే బరువు

శరీరం చలి నుంచి కాపాడుకోవటానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటుంది. వీటిల్లో ఒకటి ఆకలి పెరగటం. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు మన రక్షణ వ్యవస్థ శరీరాన్ని త్వరగా వేడెక్కేలా పురమాయిస్తుంది. దీంతో మనసు సత్వరం శక్తిని, వేడిని ఇచ్చే పిండిపదార్థాల వైపు మళ్లుతుంది. చలికాలంలో వేడివేడి పకోడీలు, బజ్జీల వంటి చిరుతిళ్లు తినాలనిపించటం గమనించే ఉంటారు. కొందరు మిఠాయిలు కూడా తింటుంటారు. చక్కెర, పిండి పదార్థాలతో రక్తంలో గ్లూకోజు మోతాదులు వేగంగా పెరుగుతాయి. అంతే వేగంగా తగ్గుతాయి కూడా. అందువల్ల తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలేస్తుంది. ఇలా ఎక్కువెక్కువగా తినేస్తుంటారు. దీంతో బరువూ పెరుగుతుంది. చలికి భయపడి బయటకు వెళ్లకపోవటం, వ్యాయామం చేయకపోవటం కూడా బరువు పెరిగేలా చేస్తాయి. సాధారణంగా ఇది పెద్దగా ఇబ్బందేమీ పెట్టదు. కానీ అధిక బరువు గలవారికి మరిన్ని చిక్కులు కలగజేస్తుంది.
జాగ్రత్త ఇలా: త్వరగా జీర్ణమయ్యే పదార్థాలకు బదులు కాస్త ఆలస్యంగా జీర్ణమయ్యే దంపుడు బియ్యం, జొన్నలు, సజ్జల వంటి పొట్టుతీయని ధాన్యాల పదార్థాలు తీసుకోవాలి. వడ, దోశ, చికెన్‌, గుడ్ల వంటివి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. త్వరగా ఆకలి వేయదు. నువ్వుల నూనె, మితంగా నెయ్యి వాడుకోవచ్చు.


చర్మం పొడి

గాలిలో తేమ తగ్గటం వల్ల చలికాలంలో చర్మం పొడిబారుతుంది. గరుకుగా అవుతుంది. సన్నటి పగుళ్లూ ఏర్పడొచ్చు. దీంతో దురద పుడుతుంది. అదేపనిగా గోకటం, చేతులతో రుద్దటం వల్ల చర్మం మందమూ కావొచ్చు, పుండ్లూ పడొచ్చు. కొందరికి ఎండుగజ్జి (ఎగ్జిమా) కూడా రావొచ్చు. చర్మం ఎర్రబడొచ్చు, దద్దు రావొచ్చు. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లూ తలెత్తొచ్చు. చర్మం పొడిబారటం వృద్ధుల్లో మరింత ఎక్కువ. వీరికి వయసు మీద పడటం వల్ల సహజంగానే చర్మం మీద నూనె పొర తగ్గుతుంది. ఇది చలికాలంలో వృద్ధులకు మరిన్ని ఎక్కువ చిక్కులు తెచ్చిపెడుతుంది. అటోపిక్‌ డెర్మటైటిస్‌, థైరాయిడ్‌ సమస్యలు గలవారికీ చర్మం పొడిబారే ముప్పు ఎక్కువ. చలికాలంలో ఇది ఇంకాస్త ఎక్కువవుతుంది కూడా.
జాగ్రత్త ఇలా: చర్మానికి కొబ్బరినూనె వంటివి రాసుకోవాలి. మాయిశ్చరైజర్లూ వాడుకోవచ్చు. ఇవి చర్మంలో తేమను కాపాడతాయి. చర్మం పొడిబారినప్పుడు ఒంటికి నూనె రుద్దుకొని స్నానం చేయటం మంచిది. మామూలు సబ్బులకు బదులు గ్లిజరిన్‌తో కూడిన సబ్బులు వాడుకుంటే మేలు. సున్నిపిండి వాడుకున్నా మంచిదే. ఎండుగజ్జి, సోరియాసిస్‌ వంటి చర్మ సమస్యలు గలవారు స్వెట్టర్లు నేరుగా చర్మానికి తగలకుండా చూసుకోవాలి. ముందు నూలు దుస్తులేసుకొని, వాటి మీద ఉన్ని దుస్తులు, స్వెట్టర్లు ధరించాలి. చాలామందికి చల్లగాలికి పెదాలూ పగులుతుంటాయి. వైట్‌ పెట్రోలియం జెల్లీ పెదాలకు రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది.


నొప్పులు, బాధలు

చలికాలంలో నొప్పులు, బాధలు ఎక్కువ. ఉదయం లేస్తూనే కొందరికి ఒళ్లు, కీళ్ల నొప్పులు మొదలవుతాయి. దీనికి కారణం కాళ్లు, చేతుల వంటి భాగాలకు తగినంత రక్తం సరఫరా కాకపోవటం. చలికాలంలో శరీరం వేడిని దాచుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఊపిరితిత్తులు, గుండె వంటి భాగాలకు ఎక్కువ రక్తసరఫరా అవుతుంది. కాళ్లు, చేతులు, భుజాలు, కీళ్లకు తగినంత రక్తం సరఫరా కాదు. ఫలితంగా కీళ్లు బిగుసుకుపోయి నొప్పి పుడుతుంది. మరోవైపు చలికాలంలో ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోతుంటారు. కదలకుండా కూర్చోవటం, బద్ధకించటం వల్ల కీళ్లకు, ఎముకలకు దన్నుగా నిలిచే కండరాలు, కండర బంధనాలూ బిగుసుకుపోతుంటాయి. ఇదీ ఒళ్లు, మోకాళ్లు, ఎముకల నొప్పులకు దారితీయొచ్చు. అప్పటికే కీళ్లనొప్పులు గలవారికి మరింత ఎక్కువయ్యే అవకాశమూ ఉంది.
జాగ్రత్త ఇలా: పొద్దున లేవగానే కాసేపు కాళ్లూ చేతులూ ఆడించాలి, సాగదీయాలి. ఇది కదలికలు సాఫీగా సాగటానికి, బిగువు తగ్గటానికి తోడ్పడుతుంది. ఇంట్లోనైనా సరే.. రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయాలి. చలికాలంలోనూ తగినంత నీరు తాగాలి. ఇది కీళ్లు మృదువుగా, తేలికగా కదలటానికి తోడ్పడుతుంది. ఎక్కువ సేపు ఒకే కాలు మీద బరువు వేసి నిల్చోవద్దు. కాళ్ల మీద బరువు సమానంగా పడేలా చూసుకోవాలి. కీళ్లనొప్పులకు మందులు వేసుకుంటుంటే కొనసాగించాలి. చలికాలంలో ఎండ తక్కువగా ఉండటం వల్ల విటమిన్‌ డి లోపం తలెత్తొచ్చు. ఇదీ ఒళ్లు, కీళ్ల నొప్పులకు కారణం కావొచ్చు. కాబట్టి డాక్టర్‌ సలహా మేరకు విటమిన్‌ డి తీసుకోవాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. చేతికి గ్లవుజులు, పాదాలకు సాక్స్‌ వేసుకోవాలి. గోరు వెచ్చటి నీటితో స్నానం చేయటం, పొరల దుస్తులు ధరించటం మంచిది.


సాధారణ జాగ్రత్తలు

చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవటమే మంచిది. వృద్ధులు,పిల్లలకిది మరింత ముఖ్యం. బయటకు వెళ్లాల్సి వస్తే ముక్కుకు, నోటికి రుమాలు చుట్టుకోవాలి. తలకు మఫ్లరు లేదా మంకీక్యాప్‌ ధరించాలి.

  •  ఆరుబయట ఉదయం నడక అలవాటు గలవారు కాస్త ఎండ వచ్చాకే ఆరంభించాలి.
  •  చలికి భయపడి స్నానం
  •     మానేయొద్దు. రోజూ స్నానం చేయాలి. కొందరు చలికాలంలో చాలా వేడిగా ఉండే నీటితో స్నానం చేస్తుంటారు. ఇది తగదు. మరీ వేడి నీటితో స్నానం చేస్తే చర్మం మీద అక్కడక్కడా పొడిగా అవుతుంది. కాబట్టి గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.
  • అప్పుడే వండిన వేడివేడి పదార్థాలే తినాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. నీటిని గోరువెచ్చగా చేసుకొని తాగొచ్చు.
  • చలికాలంలో కూల్‌డ్రింకులు, ఐస్‌క్రీములకు దూరంగా ఉంటేనే మేలు. ఇవి నోరు, గొంతు పైపొరలను దెబ్బతీసి గొంతునొప్పి వంటి సమస్యలకు దారితీస్తాయి.
  •  గర్భిణులకు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వస్తే యాంటీబయాటిక్‌ మందుల వంటివి అంతగా ఇవ్వటం కుదరకపోవచ్చు. కాబట్టి విధిగా వ్యక్తిగత శుభ్రత పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. చేతులను కళ్లు, ముక్కు, నోటికి తాకనీయొద్దు.
  • డాక్టర్‌ పర్యవేక్షణలో ఫ్లూ, న్యుమోనియా టీకాల వంటివి తీసుకోవాలి.
  • చలికాలంలో చాలామంది చేసే పొరపాటు వ్యాయామం చేయటానికి, బయటకు వెళ్లటానికి బద్ధకించటం. నిజానికి చలికాలంలోనే వ్యాయామం అవసరం ఎక్కువ. గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం గలవారికివి మరింత అవసరం. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది, చురుకుదనం పెరుగుతుంది. రోగనిరోధకశక్తి ఇనుమడిస్తుంది. జలుబు, ఫ్లూ వంటి సమస్యలు త్వరగా దాడిచేయవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని