సూక్ష్మ మేహం!

‘చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెదికినట్టు’ అని సామెత. మధుమేహం విషయంలో మనం ఇలాగే ప్రవర్తిస్తున్నామా? ఆధునిక వైద్య పరిశోధనలు ఇదే సూచిస్తున్నాయి.

Updated : 14 Nov 2023 08:11 IST

నేడు ప్రపంచ మధుమేహ దినం

‘చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెదికినట్టు’ అని సామెత. మధుమేహం విషయంలో మనం ఇలాగే ప్రవర్తిస్తున్నామా? ఆధునిక వైద్య పరిశోధనలు ఇదే సూచిస్తున్నాయి. జీవక్రియ రుగ్మత(మెటబాలిక్‌ సిండ్రోమ్‌)లో భాగమైన మధుమేహం, ఊబకాయం, బొజ్జ, అధిక కొలెస్ట్రాల్‌ వంటి వాటికీ మన పేగుల్లోని బ్యాక్టీరియాకూ బలమైన సంబంధం ఉంటున్నట్టు స్పష్టమవుతుండటమే దీనికి నిదర్శనం. మనం తిన్న ఆహారం గ్లూకోజుగా మారటం, దాన్ని శరీరం సంగ్రహించుకునేలా చూడటంలో పేగు బ్యాక్టీరియా గణనీయ ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. మధుమేహం, ఊబకాయం తగ్గటానికి ఆహారం, వ్యాయామ నియమాలు పాటించటం, మందులేసుకోవటం తెలిసిందే. అవసరమైతే బేరియాట్రిక్‌ ఎండోస్కోపీ, శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. చిత్రమేంటంటే- వీటితో ఒనగూరే ఫలితాలన్నీ పేగు బ్యాక్టీరియా ప్రభావంతోనే ముడిపడి ఉండటం! అందుకే మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేయటం, వీలైతే మార్పిడి చేయటం రోజురోజుకీ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. భవిష్యత్తులో ఇవే ప్రధాన మధుమేహ చికిత్సలుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ మధుమేహ దినం సందర్భంగా పేగు బ్యాక్టీరియా తీరుతెన్నులు, ప్రాముఖ్యతపై సమగ్ర కథనం మీకోసం.

‘జబ్బులన్నీ పేగుల్లోనే మొదలవుతాయి’. ఆధునిక వైద్య పితామహుడు హిప్పోక్రేట్స్‌ అప్పుడెప్పుడో 2వేల ఏళ్ల క్రితమే చెప్పిన మాట. ఈ వ్యాఖ్య ఆయనది కాదని వాదించేవారూ లేకపోలేదు. వీటిల్లో నిజానిజాల మాటెలా ఉన్నా అప్పటి నుంచీ ఇది వైద్యరంగాన్ని ప్రభావితం చేస్తూనే వస్తోంది. మన పేగుల్లో తిష్ఠ వేసుకొని, మన ఆరోగ్యం మీద గణనీయ ప్రభావాన్ని చూపే సూక్ష్మక్రిములపై శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మన పేగుల్లో బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ వంటి కోటానుకోట్ల సూక్ష్మక్రిములు నివసిస్తుంటాయి. శరీర కణాల కన్నా వీటి సంఖ్య 10 రెట్లు ఎక్కువ! ఇవి అన్నవాహిక, జీర్ణాశయం దగ్గరి నుంచి చిన్న పేగులు, పెద్ద పేగుల వరకూ అంతటా విస్తరించి ఉంటాయి. అన్నింటికన్నా చిన్నపేగు చివరిభాగంలో మరింత ఎక్కువగానూ నివసిస్తాయి. ఇంత పెద్ద మొత్తంలో ఉన్నప్పటికీ బ్యాక్టీరియాను బయటకు తీసి ప్రయోగశాలలో వృద్ధి చేయటం అంతగా సాధ్యం కాదు. ఇవి శరీరంలో చాలా లోపలి భాగాల్లో ఉంటాయి. ఆక్సిజన్‌ లేని వాతావరణంలో జీవిస్తాయి. కాబట్టి కేవలం 30% సూక్ష్మక్రిములనే వృద్ధి చేయగలం. ఈ విషయంలో గత పదేళ్లలో మెటాజినోమిక్‌ వంటి కొత్త పరిజ్ఞానాల సాయంతో గొప్ప పురోగతి సాధించాం. సూక్ష్మక్రిములు విడుదల చేసే పదార్థాలు (మెటాబోలైట్లు), వీటి ప్రభావాల గురించి కొత్త కొత్త సంగతులు తెలుసుకుంటున్నాం. ఇవి వినూత్న చికిత్సలకూ మార్గం చూపిస్తుండం విశేషం.

సమతుల్యత ప్రధానం

పేగుల్లో దాదాపు వెయ్యి రకాల బ్యాక్టీరియా ఉంటుంది. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బ్యాక్టిరాయిడిటీస్‌, ఫర్మిక్యూట్స్‌ గురించే. సింహభాగం ఇవే ఆక్రమిస్తాయి. బ్యాక్టిరాయిడిటీస్‌ మంచి చేస్తే, ఫర్మిక్యూట్స్‌ హాని చేస్తాయి. వీటి మధ్య సమతుల్యతను బట్టే మన ఆరోగ్యం నిర్ణయమవుతుంది. మేలు చేసే బ్యాక్టీరియా కన్నా హాని చేసే బ్యాక్టీరియా సంఖ్య పెరిగితే సమతుల్యత లోపిస్తుంది (గట్‌ డిస్‌బయోసిస్‌). వీటి సమతుల్యత మీద రకరకాల అంశాలు ప్రభావం చూపుతాయి. పుట్టినప్పుడే.. ఆ మాటకొస్తే తల్లికడుపులో ఉన్నప్పుడే మనలోని బ్యాక్టీరియా రకాలు నిర్ణయమవుతాయనీ చెప్పుకోవచ్చు! సిజేరియన్‌ కాన్పుతో పుట్టినవారితో పోలిస్తే సహజ కాన్పుతో పుట్టినవారిలో.. అలాగే ఆరునెలల వరకూ తల్లిపాలే తాగినవారిలో మంచి బ్యాక్టీరియా ఎక్కువ. పుట్టిన తొలినాళ్లలో యాంటీ బయాటిక్‌ మందులు వాడిన పిల్లల్లో మంచి బ్యాక్టీరియా తగ్గుతుంది. చుట్టుపక్కల పరిసరాలు, ఆహారం, పెంపుడు జంతువులు, వివిధ రకాల జబ్బులూ పేగు బ్యాక్టీరియా మీద ప్రభావం చూపుతాయి. గర్భిణి తీసుకునే ఆహారం సైతం శిశువు పేగు బ్యాక్టీరియాను నిర్ణయిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లి సరైన ఆహారం తీసుకోకపోతే బిడ్డలో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే అవకాశముందని వివరిస్తున్నాయి. అంటే తల్లి కడుపులో ఉండగానే మన భవిష్యత్తు ఆరోగ్యం నిర్ణయమైపోతుందన్నమాట. ఇలా మధుమేహం, అధిక బరువు వంటి జీవక్రియ సమస్యలకు పుట్టక ముందే బీజం పడుతోందన్నమాట.

మంచిని పెంచుకోవచ్చు

అనాదిగా మనమంతా సూక్ష్మక్రిములతో పాటే జీవిస్తూ వస్తున్నాం. పరిణామం చెందుతూ వచ్చాం. ఇవి మనకు ఎన్నో విధాలుగా మేలు చేకూరుస్తూ వస్తున్నాయి. కాబట్టి మంచి బ్యాక్టీరియాను పెంచుకుంటే ఆరోగ్యమూ మెరుగవుతుంది. ఇందుకు ఆహారం, నిద్ర, మానసిక ప్రశాంతత వంటివన్నీ తోడ్పడతాయి. బ్యాంకులో ఎంత డబ్బుంటే అంత ధనవంతులమైనట్టుగానే పేగుల్లో మంచి బ్యాక్టీరియా నిల్వ ఎంత ఎక్కువుంటే అంత ఆరోగ్యవంతులమైనట్టే.

ఆహారం ముఖ్యం: మనం తిన్న ఆహారం జీర్ణం కావటం, దాన్నుంచి శక్తిని సంగ్రహించి శరీరానికి అందించటంలో పేగు బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుంది. చెడు బ్యాక్టీరియా మనం తినే పిండి పదార్థంలోని మొత్తం శక్తిని శరీరానికే అందజేస్తుంది. అదే మంచి బ్యాక్టీరియా పిండి పదార్థాన్ని తీసుకొని దాన్ని విచ్ఛిన్నం చేసి షార్ట్‌ చెయిన్‌ కొవ్వు ఆమ్లాల వంటి వాటి రూపంలోకి మారుస్తుంది. ఇలా ఆహారాన్ని జీవక్రియలకు ఉపయోగపడేలా మారుస్తుంది. ఈ మంచి బ్యాక్టీరియా పెరగటానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. ప్రధానంగా చెప్పుకోవాల్సింది మధ్యధరా (మెడిటేరియన్‌) ఆహార పద్ధతి గురించి. ఇందులో గింజ పప్పులు, ఆలివ్‌ నూనె, చేపల వంటివి ఎక్కువగా ఉంటాయి. అయితే మనదేశంలో పాటించటం కష్టం. అలాగని నిరాశ పడాల్సిన పనిలేదు. దీన్ని మనదేశానికి అనుగుణంగానూ (ఇండోమెడిటేరియన్‌) మార్చుకోవచ్చు. దీంతోనూ మంచి ఫలితం కనిపిస్తున్నట్టు ఏఐజీలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఇండోమెడిటేరియన్‌ ఆహారం తిన్నవారిలో నెల తర్వాత బరువు, కొలెస్ట్రాల్‌ తగ్గటమే కాకుండా జీవక్రియలూ మెరుగయ్యాయి. మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందింది, అదే సమయంలో చెడు బ్యాక్టీరియా తగ్గింది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, మోనోఅన్‌సాచ్యురేటెడ్‌ కొవ్వు ఆమ్లాలతో కూడిన పాలు, పెరుగు, మజ్జిగ, చేపలు.. త్వరగా కరగని పీచు, ప్రిబయాటిక్స్‌ గల పొట్టుతీయని ధాన్యాలు.. గింజపప్పులు, పండ్లు, కూరగాయలు, పప్పులు, ఫాలీఫెనాల్స్‌ మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడతాయి. నిర్ణీతకాల (ఇంటర్‌మిటెంట్‌) ఉపవాసమూ ఉపయోగపడుతుంది.

అనారోగ్యకర ఆహారానికి దూరంగా ఉండటమూ ముఖ్యమే. సంతృప్త కొవ్వు, ఓమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే మాంసాహారం.. త్వరగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు, శుద్ధి చేసిన చక్కెరలు.. కూరగాయలు, పండ్లు తక్కువగా తినటం లేదా అసలే తినకపోవటం వంటివన్నీ చెడు బ్యాక్టీరియా వృద్ధికి దోహదం చేస్తాయి. అలాగే అతిగా మద్యం తాగటమూ హానికర సూక్ష్మక్రిములు పెరగటానికి తోడ్పడుతుంది.

మానసిక ప్రశాంతత: మెదడు, పేగు బ్యాక్టీరియా పరస్పర ప్రేరేపితాలు. మెదడు పేగుల్లోని బ్యాక్టీరియా మీద.. అలాగే పేగు బ్యాక్టీరియా మెదడు పైన నేరుగా ప్రభావం చూపుతాయి. మానసిక ఒత్తిడి తీవ్రమైతే పేగు బ్యాక్టీరియా తీరుతెన్నులు మారతాయి. ఇందులో రోగనిరోధక, నాడీ, రక్త ప్రసరణ వ్యవస్థలన్నీ పాలు పంచుకుంటాయి. అన్నింటికన్నా ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బ్యాక్టీరియా విడుదల చేసే స్రావాలు, జీవక్రియ పదార్థాల గురించే. బ్యాక్టీరియా విడుదల చేసే షార్ట్‌ చెయిన్‌ కొవ్వు ఆమ్లాలు, పెప్టైడ్లు నేరుగా పేగుల్లోని గ్రంథి కణాలను ప్రభావితం చేస్తాయి. అలాగే మెదడులోకి చేరుకొని జీవక్రియలనూ నియంత్రిస్తాయి. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి.

కంటి నిండా నిద్ర: మన నిద్ర, మెలకువలను నియంత్రించే జీవ గడియారం (సర్కేడియన్‌ రిథమ్‌) కూడా పేగు బ్యాక్టీరియా మీద ప్రభావం చూపుతుంది. వేర్వేరు టైమ్‌ జోన్ల గుండా సుదీర్ఘ విమాన ప్రయాణం చేసి అలసి, నిద్ర పట్టక సతమతమయ్యేవారి (జెట్‌లాగ్‌) నుంచి, మామూలు వ్యక్తుల నుంచి మలాన్ని తీసుకొని బ్యాక్టీరియా రహిత ఎలుకల్లో ప్రవేశపెట్టి పరిశోధకులు పరిశీలించారు. జెట్‌లాగ్‌ అనుభవించినవారి మలాన్ని మార్పిడి చేసిన ఎలుకలు బాగా బరువు పెరిగినట్టు గుర్తించారు. జీవగడియారం పేగు బ్యాక్టీరియా మీద ప్రభావం చూపుతున్నట్టు ఇది తెలియజేస్తోంది. నిద్ర తీరుతెన్నులు మారితే జీవక్రియలు అస్తవ్యస్తమవుతాయి. ఇది మధుమేహం వంటి జీవక్రియ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి కంటి నిండా నిద్ర పట్టేలా చూసుకుంటే బ్యాక్టీరియా పనితీరును మార్చుకోవచ్చు.

మందులు, చికిత్సలు: పేగు బ్యాక్టీరియా తీరుతెన్నుల మీద మందులు, చికిత్సలూ ప్రభావం చూపుతాయి. మధుమేహం నియంత్రణలో లేనివారికి, తీవ్ర ఊబకాయం గలవారికి ఇటీవల బేరియాట్రిక్‌ చికిత్సలు, శస్త్రచికిత్సలు ఉపయోగపడుతున్న విషయం తెలిసిందే. నిజానికివి పేగు బ్యాక్టీరియా తీరుతెన్నులను మార్చటం ద్వారానే ప్రభావం చూపుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. జీఎల్‌పీ1 అనలాగ్‌, ఓర్లిస్టాట్‌ మందులతోనూ మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అదే యాంటీబయాటిక్స్‌, ఛాతీమంట తగ్గించే పీపీఐ రకం మందులు చెడు బ్యాక్టీరియా వృద్ధికి దోహదం చేస్తాయి.  

అధ్యయనాల దన్ను

పేగు బ్యాక్టీరియా చేసే పనుల్లో కొన్నింటి గురించి ఇంతకుముందు తెలియదు. ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అధ్యయనాల్లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

ఊబకాయంతో సంబంధం

మధుమేహానికీ ఊబకాయానికీ దగ్గరి సంబంధం ఉంది. ఈ ఊబకాయం విషయంలో పేగు బ్యాక్టీరియా గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్టు, ఈ రెండింటికీ ప్రత్యక్ష సంబంధం ఉంటున్నట్టు 2008లోనే నేచర్‌ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం నిరూపించింది. ఊబకాయ ఎలుకల మలాన్ని ప్రవేశపెట్టినప్పుడు బ్యాక్టీరియా రహిత ఎలుకలకూ ఊబకాయం వచ్చినట్టు తేలింది. అలాగే సన్నటి ఎలుకల మలాన్ని బ్యాక్టీరియా రహిత ఎలుకల్లో ప్రవేశపెట్టగా సన్నబడ్డాయి. ఆహార పరిమాణం, వ్యాయామంతో సంబంధం లేకుండా కేవలం బ్యాక్టీరియా మూలంగానే బరువు పెరగటం, తగ్గటం గమనార్హం. ఊబకాయ ఎలుకల పేగుల్లో ఫర్మిక్యూట్స్‌, సన్నటి ఎలుకల్లో బ్యాక్టిరాయిడిటీస్‌ ఎక్కువగా ఉంటున్నట్టు తేలటం ఆశ్చర్యం. ఇటీవలి ఒక అధ్యయనమూ దీన్ని మరింత బలపరుస్తోంది. ఊబకాయ, సన్నటి కవల మహిళల మలం నుంచి తీసిన సూక్ష్మక్రిములను బ్యాక్టీరియా రహిత ఎలుకల్లో ప్రవేశపెట్టటం దీనిలోని కీలకాంశం. ఊబకాయ మహిళ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టిన ఎలుకల్లో కొవ్వు కణజాలం ఎక్కువై ఊబకాయం రాగా.. సన్నటి మహిళ బ్యాక్టీరియాను ప్రవేశపెట్టిన ఎలుకలు బరువు తగ్గాయి. ఈ రెండు రకాల ఎలుకలకూ తక్కువ కొవ్వు, అధిక పీచు ఆహారం ఇచ్చినప్పటికీ బరువులో మార్పు కనిపించింది. పేగు బ్యాక్టీరియాలోనే బరువు పెంచే గుణం ఉంటున్నట్టు ఇది స్పష్టంగా సూచిస్తోంది. మనుషుల్లోనూ ఇలాంటి ప్రభావమే కనిపిస్తున్నట్టు ఫిన్‌లాండ్‌ అధ్యయనం పేర్కొంటోంది. కొందరు ఊబకాయులకు అక్రిమాన్సియా మ్యుసినిఫిలియా అనే మంచి బ్యాక్టీరియాను మందు రూపంలో ఇవ్వగా ఇన్సులిన్‌ సామర్థ్యం పెరగటంతో పాటు బరువు, కొవ్వు, తుంటి చుట్టుకొలత తగ్గటం విశేషం.

తిరిగి బరువు పెరగకుండానూ

ఆహార పద్ధతులతో మొదట్లో బరువు తగ్గినా తర్వాత తిరిగి పెరుగుతుంది. ఈ విషయంలోనూ మంచి బ్యాక్టీరియా మేలు చేస్తోంది. నియమిత ఆహారం, మధ్యధరా ఆహారం, పాలీఫెనాల్స్‌తో కూడిన మధ్యధరా ఆహార పద్ధతులు పాటించేవారిపై నిర్వహించిన అధ్యయనమే దీనికి సాక్ష్యం. బరువు తగ్గుతున్న సమయంలో పరిశోధకులు వీరి మలం నుంచి బ్యాక్టీరియా నమూనాలు సేకరించి, శీతలీకరించి, భద్రపరిచారు. తిరిగి బరువు పెరుగుతున్న సమయంలో ఈ బ్యాక్టీరియాను ఇచ్చి పరిశీలించారు. ముఖ్యంగా పాలీఫెనాల్స్‌తో కూడిన ఆహారం తిన్నవారి నుంచి సేకరించిన బ్యాక్టీరియా తీసుకున్నవారిలో బరువు పెరగకపోవటం గమనార్హం. అంటే బరువు తగ్గుతున్నప్పుడు పేగుల్లో పుట్టుకొచ్చిన బ్యాక్టీరియా ఆ తర్వాతా అదే గుణాన్ని కనబరుస్తోందన్నమాట.  

కాలేయ కొవ్వు తగ్గుముఖం

కాలేయంలో కొవ్వు పేరుకున్నవారికి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే మిశ్రమాన్ని ఇవ్వగా.. కాలేయంలో కొవ్వు మాత్రమే కాకుండా జీవక్రియ రుగ్మత కూడా తగ్గినట్టు మరో అధ్యయనంలో తేలింది. ఇలా పరోక్షంగా మధుమేహం తగ్గటానికీ తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు.

గ్లూకోజు అదుపు

కొన్నిరకాల బ్యాక్టీరియా మూలంగా రక్తంలో మూడు నెలల గ్లూకోజు సగటు (హెచ్‌బీఏ1సీ), శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) తగ్గుతున్నట్టు పలు అధ్యయనాలు వివరిస్తున్నాయి.

 వ్యాయామానికి ప్రోత్సాహం

కొందరు వ్యాయామం చేయటానికి బద్ధకిస్తుంటారు. కొందరు వ్యాయామానికి ఉత్సాహం చూపుతారు. ఇదీ పేగు బ్యాక్టీరియాతోనే ముడిపడి ఉండటం విచిత్రం. బ్యాక్టీరియా రహిత ఎలుకల్లో చురుకుదనాన్ని ప్రోత్సహించే గుణం గల బ్యాక్టీరియాను ప్రవేశపెట్టగా అవి మరింత ఎక్కువగా వ్యాయామం చేసినట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా విడుదల చేసే పదార్థాలు మెదడులోకి చేరుకొని డొపమైన్‌ వ్యవస్థను ప్రేరేపించటమే దీనికి కారణం. ఇక బద్ధకం కలిగించే బ్యాక్టీరియాను ప్రవేశపెట్టిన ఎలుకలు వ్యాయామానికి సుముఖంగా లేకపోవటం గమనార్హం. మధుమేహం, ఊబకాయంలో బ్యాక్టీరియా పాత్రకిది నిదర్శనం.

చికిత్సతో మెరుగు!

పేగుపూత (ఐబీడీ) వంటి చికిత్సలకు ఇప్పటికే మలం మార్పిడి చికిత్సలు చేస్తున్నారు. ఇవి మంచి ఫలితాన్నీ చూపిస్తున్నాయి. ప్రయోగశాలలో వృద్ధి చేసిన బ్యాక్టీరియాతో జీవక్రియలు మారుతున్నట్టు, ఊబకాయం తగ్గుతున్నట్టు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. అందుకే మున్ముందు మధుమేహం వంటి జీవక్రియ రుగ్మత చికిత్సల్లో కృత్రిమ పేగు బ్యాక్టీరియా ప్రాధాన్యం సంతరించుకుంటుందనే భావన బలపడుతోంది. అయితే ఎలుకల్లో మాదిరిగా మనుషుల్లో పూర్తిగా బ్యాక్టీరియా లేకుండా చేయటం అసాధ్యం. కానీ మంచి బ్యాక్టీరియాను ప్రవేశ పెట్టొచ్చు. చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నవారికీ మంచి బ్యాక్టీరియాను ప్రవేశపెడితే జీవక్రియ రుగ్మత తగ్గుతుండటం గొప్ప విషయం. ఈ బ్యాక్టీరియాతో పాటు అంతగా పులియని పీచు కూడా ఇస్తే మరింత ఎక్కువ ప్రభావమూ కనిపిస్తోంది.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని