Diabetes : మధుమేహులు మద్యం తాగొచ్చా?

మా నాన్నగారికి 55 ఏళ్లు. ఇరవై ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారు. అప్పుడప్పుడు మద్యం తాగుతారు. మద్యం తాగాక మధుమేహం మందులు వేసుకోవచ్చా? సాధారణంగా మద్యం తాగాక ఏవైనా మాత్రలు వేసుకోవచ్చా? దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా?

Updated : 09 Aug 2022 09:53 IST

సమస్య: మా నాన్నగారికి 55 ఏళ్లు. ఇరవై ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారు. అప్పుడప్పుడు మద్యం తాగుతారు. మద్యం తాగాక మధుమేహం మందులు వేసుకోవచ్చా? సాధారణంగా మద్యం తాగాక ఏవైనా మాత్రలు వేసుకోవచ్చా? దుష్ప్రభావాలు ఏవైనా ఉంటాయా?

- అనిల్‌, హైదరాబాద్‌

సలహా: మధుమేహం గలవారు అసలు మద్యం తాగనే కూడదు. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. కాబట్టి మద్యం తాగాక మందులు వేసుకోవచ్చా? అన్న ప్రశ్నకు తావేలేదు. మధుమేహానికి మద్యం తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్టే. ఎందుకంటే మద్యంతో నాడులు దెబ్బతింటాయి. మామూలుగానే మధుమేహులకు నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువ. ఎంత ఎక్కువకాలం నుంచి మధుమేహంతో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదముంది. దీని మూలంగానే చాలామంది కాళ్లు చేతుల తిమ్మిర్లు, మంట పెట్టటం, సూదులు పొడిచినట్టు అనిపించటం వంటి వాటితో బాధపడుతుంటారు. దీనికి మద్యం కూడా తోడైతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇంకాస్త త్వరగా నాడులు దెబ్బతినొచ్చు. కాళ్లు మొద్దుబారి, పుండ్లు పడొచ్చు. పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావొచ్చు. ఒకవేళ ఎప్పుడైనా మద్యం తాగాల్సి వస్తే విధిగా భోజనం చేయాలి. ఆ తర్వాత మాత్రలు వేసుకోవాలి. మద్యం తాగాక భోజనం చేయకపోతే మందులు వేసుకోవద్దు. మామూలుగా కాలేయం నిరంతరం గ్లూకోజును ఉత్పత్తి చేస్తూ.. రక్తంలో గ్లూకోజు మోతాదులు స్థిరంగా ఉండేలా చూస్తుంది. మద్యంలోని ఆల్కహాల్‌ ఈ ప్రక్రియను దెబ్బతీస్తుంది. దీంతో తగినంత గ్లూకోజు ఉత్పత్తి కాదు. ఫలితంగా గ్లూకోజు మోతాదులు పడిపోతాయి. ఆల్కహాల్‌ తాగాక భోజనం చేస్తే ఇది కొంతవరకు కుదురుకుంటుంది. అయితే చాలామంది భోజనం చేయరు. దీంతో గ్లూకోజు మోతాదులు పడిపోయి హైపోగ్లైసీమియాలోకి వెళ్లిపోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం. సత్వరం చికిత్స లభించకపోతే ప్రాణాంతకంగానూ పరిణంచొచ్చు. ఇక ఇతరత్రా మందులు విషయంలో- యాంటీబయాటిక్స్‌, నొప్పిని తగ్గించే మందుల వంటివి జీర్ణాశయ పూత (గ్యాస్ట్రయిటిస్‌) సమస్యకు దారితీస్తాయి. మద్యం కూడా దీన్ని తెచ్చిపెట్టొచ్చు. మందులు, మద్యం రెండూ కలిస్తే సమస్య ఇంకాస్త ఎక్కువవుతుంది. దీంతో ఛాతీలో మంట, వాంతులు తలెత్తొచ్చు. కొందరికి రక్తం వాంతులూ కావొచ్చు. కాబట్టి మందులు వేసుకునేటప్పుడు మద్యం జోలికి వెళ్లకూడదని గుర్తుంచుకోవాలి.

మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని