స్టాటిన్‌ మాత్రలు వేసుకోవాలా?

నాకు 62 ఏళ్లు. బీపీ, షుగర్‌ లేవు. నా ప్రధానమైన సమస్య కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం.

Updated : 11 Apr 2023 04:03 IST

సమస్య: నాకు 62 ఏళ్లు. బీపీ, షుగర్‌ లేవు. నా ప్రధానమైన సమస్య కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండటం. ఐదేళ్ల క్రితం ఎల్‌డీఎల్‌ మోతాదులు 200గా ఉండేవి. దీంతో మా డాక్టర్‌ స్టాటిన్‌ మాత్రలు వేసుకోవాలని సూచించారు. రోజూ ఉదయం, సాయంత్రం నడక, వ్యాయామాలు.. ధ్యానం ఆరంభించాను. శాకాహారమే తింటున్నాను. దీంతో ఎల్‌డీఎల్‌ 99.9, హెచ్‌డీఎల్‌ 54, యూరిక్‌ యాసిడ్‌ 6కు చేరుకున్నాయి. అయితే గత సంవత్సరం మాత్రలు మానేశాను. ఆహార, వ్యాయామ నియమాలు అలాగే పాటిస్తున్నాను. ఇప్పుడు ఎల్‌డీఎల్‌ 199కు పెరిగింది. హెచ్‌డీఎల్‌ 45కు తగ్గింది. యూరిక్‌ యాసిడ్‌ అంతే ఉంది. నేను తిరిగి మాత్రలు వేసుకోవటం మొదలెట్టాలా? జీవనశైలిలో ఏవైనా మార్పులు చేసుకోవాలా?

శ్యామ్‌

సలహా: ‘మంచి జీవనశైలిని పాటిస్తున్నాను, సన్నగా ఉన్నాను. నాకు కొలెస్ట్రాల్‌ ఎక్కువవేమీ ఉండదు’ అని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. కొలెస్ట్రాల్‌ మోతాదులపై ఒక్క జీవనశైలి మాత్రమే కాదు.. జన్యువులూ ప్రభావం చూపుతాయి. కొలెస్ట్రాల్‌ మోతాదులు పెరగటానికి మూడింట రెండొంతుల వరకు జన్యు స్వభావమే కారణం. ఆహార మార్పులు, వ్యాయామం వంటివి ఒక వంతు ప్రభావమే చూపుతాయి. మంచి జీవనశైలిని పాటిస్తున్నా కూడా కొందరిలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండటానికి ఈ జన్యు స్వభావమే కారణమని గుర్తించాలి. ఇలాంటివారు సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా ఒంట్లో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా తయారవుతుంటుంది. అలాగని జన్యు స్వభావం బాగానే ఉన్నవారు ఎలాంటి జీవనశైలి పాటించినా ఏమీ కాదని అనుకోవటానికీ లేదు. సరైన ఆహార, వ్యాయామ నియమాలు పాటించకపోతే వీరిలోనూ కొలెస్ట్రాల్‌ పెరిగే ప్రమాదముంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ విషయంలో ఏదో ఒక్కదాంతోనే సరిపెట్టుకోవటానికి లేదు. సాధారణంగా ఎల్‌డీఎల్‌ 100 లోపుంటే మంచిది. మీకు 199 ఉంది. ఇది చాలా ఎక్కువ. మీరు మందులు వాడినప్పుడు కొలెస్ట్రాల్‌ తగ్గింది, మానేస్తే ఎక్కువైందని అంటున్నారు. అంటే మీకు జన్యుపరంగా కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉత్పత్తయ్యే స్వభావం ఉన్నట్టుగా అనిపిస్తోంది. జన్యుపరంగా కొలెస్ట్రాల్‌ ఎక్కువయ్యే గుణం గలవారికి ఆహార, వ్యాయామ నియమాలతో 10-20% వరకే కొలెస్ట్రాల్‌ తగ్గే అవకాశముంటుంది. కాబట్టి మీరు మాత్రలు తిరిగి కొనసాగించటమే మంచిది. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆహారంలో నూనె పదార్థాలు, వేపుళ్లు తగ్గించుకోవాలి. రోజూ నూనెను కొలిచి, వాడుకోవటం కుదరకపోవచ్చు. నూనె ఎందులో ఎక్కువుంది? ఎందులో తక్కువుంది? అని ప్రతిసారీ చూసుకోవటం సాధ్యం కాదు. దీని కన్నా నెల మొత్తమ్మీద ఎంత నూనె వాడుతున్నారో గుర్తించటం తేలిక. ఒకరు నెలకు అరకిలో వరకు నూనె వాడుకుంటే ఇబ్బందేమీ ఉండదు. కుటుంబంలో నలుగురుంటే నెలకు 2 కిలోల నూనె కన్నా ఎక్కువ మించకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలతో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు