Summer Skin Care: చర్మానికి ఎండ దెబ్బ!
మనకు చర్మమే పెట్టని కోట. శరీరం మీద మెత్తగా పరచుకొని, అవయవాలను కాపాడుతుంది. బ్యాక్టీరియా, వైరస్, దుమ్మూధూళీ వంటివి లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. పెద్ద సంఖ్యలో నాడులు, రక్తనాళాలతో కూడుకున్న ఇది మరెన్నో పనుల్లోనూ పాలు పంచుకుంటుంది. స్పర్శజ్ఞానాన్ని కలిగిస్తూ ఆయా వస్తువుల గురించి తెలియజేస్తుంది.
మనకు చర్మమే పెట్టని కోట. శరీరం మీద మెత్తగా పరచుకొని, అవయవాలను కాపాడుతుంది. బ్యాక్టీరియా, వైరస్, దుమ్మూధూళీ వంటివి లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. పెద్ద సంఖ్యలో నాడులు, రక్తనాళాలతో కూడుకున్న ఇది మరెన్నో పనుల్లోనూ పాలు పంచుకుంటుంది. స్పర్శజ్ఞానాన్ని కలిగిస్తూ ఆయా వస్తువుల గురించి తెలియజేస్తుంది. దీని మూలంగానే వాతావరణంలో వేడి, చల్లదనం అవగతమవుతాయి. అంతేకాదు.. ఒంట్లో ఉష్ణోగ్రత నిర్ణీత స్థాయిలో ఉండేలా చూస్తుంది. చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉంచుతుంది. ఇలా వాతావరణానికి అనుగుణంగా స్పందిస్తుంది కాబట్టే బయటి ఉష్ణోగ్రతలు చర్మం మీద సహజంగానే చాలా ప్రభావం చూపిస్తాయి. ఇది కొన్నిసార్లు సమస్యలకూ దారితీస్తుంది. వేసవిలో తలెత్తే చర్మ సమస్యలు ఇలాంటివే.
ఎండాకాలంలో కొన్ని రకాల చర్మ సమస్యలు మొదలవుతాయి. కొన్ని సమస్యలేమో ఎక్కువవుతాయి. వీటికి మొదటి కారణం వేడి. రెండోది తడి. చర్మమంతా ఒక్కటిగానే కనిపించినా ఇందులో పైపొర (ఎపిడెర్మిస్), మధ్య పొర (డెర్మిస్), దిగువ పొర (హైపోడెర్మిస్- కొవ్వుపొర).. ఇలా మూడు భాగాలుంటాయి. అన్నింటికన్నా పలుచటిది పైపొర. అయితేనేం? బయటి ప్రపంచం నుంచి కాపాడేది ఇదే. సూక్ష్మ క్రిములు, ఎండలోని అతినీలలోహిత కిరణాలు, రసాయనాల వంటి వాటి నుంచి రక్షిస్తుంటుంది. చర్మం ఆకారానికి దన్నుగా నిలిచే మధ్య పొరేమో కాస్త మందంగా ఉంటుంది. అనుసంధాన కణజలాలు, నాడుల చివరలు, స్వేదగ్రంథులు, తైల గ్రంథులు, వెంట్రుకల కుదుళ్లు, రక్తనాళాల వంటివన్నీ ఇందులో ఉంటాయి. ఇక దిగువ పొర శరీరంలోంచి వేడి బయటకు వెళ్లిపోకుండా, విఘాతం కలగకుండా కాపాడుతుంది. చర్మాన్ని కండరాలకు, ఎముకలకు అతుక్కొని ఉండేలా చేస్తుంది. వెంట్రుక కుదుళ్ల మూలమూ దీనిలోనే ఉంటుంది. చర్మం రక్తనాళ వ్యవస్థ దీన్నుంచే పైకి వెళ్తుంది. ఈ మూడు పొరలూ నిరంతరం ఒక సమన్వయంతో పనిచేస్తాయి. బయటి వాతావరణానికి అనుగుణంగా చర్మం పనితీరు మారుతుంటుంది. చలికాలంలో- వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు సంకోచించి, ఒంట్లోంచి వేడి బయటకు వెళ్లకుండా నిలువరిస్తాయి. అదే వేసవిలో- వాతావరణం వేడిగా ఉన్నప్పుడు రక్తనాళాలు వ్యాకోచించి, చర్మానికి ఎక్కువ రక్తసరఫరా అయ్యేలా చేస్తాయి. అదే సమయంలో స్వేదగ్రంథులూ వ్యాకోచించి, చెమటను ఉత్పత్తి చేస్తాయి. ఈ చెమట గాలికి ఆవిరవటం వల్లనే శరీరం చల్లబడుతుంది. ఇదంతా శరీరాన్ని రక్షించే ప్రయత్నమే. అయితే బయటి వేడి, దాన్ని ఎదుర్కోవటానికి లోపల్నుంచి పుట్టుకొచ్చే తడి మూలంగా కొన్ని సమస్యలు బయలుదేరతాయి. చాలావరకివి మామూలువే. కానీ నిర్లక్ష్యం చేస్తే కొన్ని తీవ్రం కావొచ్చు. కాబట్టి వేసవి చర్మ సమస్యలను అర్థం చేసుకొని, నివారించుకునే మార్గాలను తెలుసుకొని ఉండటం మంచిది.
చెమట పొక్కులు
ఇది ఎండ వేడితో వచ్చే సమస్య. సాధారణంగా గాలి తగిలినప్పుడు చెమట ఆవిరై చల్లగా అనిపిస్తుంది. అయితే వేసవిలో బయటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నిసార్లు చెమట ఆవిరి కాదు. చర్మం పైపొరల్లోనే ఇంకిపోతుంటుంది. ఫలితంగా పొక్కులు (మిలియేరియా క్రిస్టలీనా) తలెత్తుతాయి. వీటిల్లో నీరు స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఉష్ణోగ్రత ఇంకా పెరిగితే.. చెమట మరింత లోపలి పొరల్లోకీ ఇంకిపోవచ్చు. దీంతో పొక్కులు మరింత తీవ్రంగా, ఎర్రగా (మిలియేరియా ప్రొఫౌండా) అవుతాయి. చర్మం బుడిబుడిపెలుగా కనిపిస్తుది. తాకితే గరుకుగా అనిపిస్తుంది. చెమట మూలంగా లోపలి నాడులు ప్రేరేపితమై దురద, మంట కూడా పుడతాయి. సాధారణంగా వీపు, మెడ, కడుపు మీద చెమట పొక్కులు ఎక్కువగా వస్తుంటాయి. కొందరికి ముఖం, కాళ్లు, చేతుల మీదా రావొచ్చు. ఇవి కొద్దికాలమే ఉంటాయి. కొందరికి వస్తూ పోతూ ఉంటాయి. పిల్లల్లో, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.
చికిత్స: చెమట పట్టకుండా చూసుకుంటే పొక్కులను నివారించుకోవచ్చు. వచ్చినా త్వరగా తగ్గుతాయి. కాబట్టి ఇంట్లో, ఆఫీసులో చల్లగా ఉండేలా చూసుకోవాలి. తేలికైన, గాలి ఆడే నూలు దుస్తులు ధరించాలి. అవసరమైతే మెంథాల్, క్యాంపర్‌తో కూడిన టాల్కం పౌడర్లు అద్దుకోవచ్చు. చెమట పొక్కులు తీవ్రమై, మంట, దురదతో వేధిస్తుంటే స్టిరాయిడ్ పూత మందులు, మాయిశ్చరైజింగ్ లోషన్లు వాడుకోవాలి.
సెగ్గడ్డలు
ఇది ఎండాకాలంలో తరచూ చూసే సమస్య. దీనికి మూలం బాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు. చర్మం పైపొరల మీద రకరకాల బ్యాక్టీరియాలు మనతో పాటే సహ జీవనం చేస్తుంటాయి. చెమట తడికి చర్మం మెత్తబడుతుంది. దీనిలోంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్లటానికి అవకాశం చిక్కుతుంది. ఇది వెంట్రుకల కుదుళ్ల వద్ద ఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తుంది. క్రమంగా గడ్డ ఏర్పడి, లోపల చీము గూడు కడుతుంది. దీన్నే మనం వేడి గుల్లలు, సెగ్గడ్డలు అంటుంటాం. ఇవి బాగా నొప్పి పెడతాయి. కొందరికి జ్వరమూ రావొచ్చు. ఎక్కువసేపు ఒకేదగ్గర కూర్చొని పని చేసేవారికి పిరుదులు, తొడలు, ఛాతీ వద్ద సెగ్గడ్డలు వస్తుంటాయి. చాలామంది మామిడి పండ్లు తినటం వల్ల ఇవి వస్తాయని అనుకుంటుంటారు. ఇది నిజం కాదు. కానీ మధుమేహులకు మామిడిలోని తీపితో సెగ్గడ్డలు తలెత్తొచ్చు. వీరికి మామిడి పండ్లే కాదు, తీపి పదార్థాలు ఏవైనా ఇన్‌ఫెక్షన్ కలగజేయొచ్చు. మిగతావారికి మామిడి పండ్లు తింటే ఇబ్బందేమీ ఉండదు.
చికిత్స: సెగ్గడ్డలను గిల్లొద్దు. చీమును పిండొద్దు. అలా చేస్తే ఇన్‌ఫెక్షన్ ఇతర భాగాలకు విస్తరిస్తుంది. సెగ్గడ్డ చిన్నగా ఉంటే వేడి కాపడం వంటివి ఉపశమనం కలిగిస్తాయి. కొద్దిరోజులకు దానంతటదే పగిలిపోతుంది. గడ్డ పెద్దగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇన్‌ఫెక్షన్ లోతుగా, తీవ్రంగా ఉంటే గాటు పెట్టి చీమును పూర్తిగా బయటకు తీయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్ మందులు వేసుకోవాల్సి ఉంటుంది.
చర్మం కమలటం
సముద్ర తీరాల్లో, ఎడారి ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ప్రతిఫలిస్తుంటుంది. అతి నీలలోహిత కాంతి తీవ్రత ఎక్కువవుతుంది. దీంతో ముఖం మీద, దుస్తులు లేని చోట చర్మం కమిలిపోవచ్చు (సన్ బర్న్). చర్మం రంగు మారొచ్చు (ట్యాన్). తీవ్రమైన వేడి, ప్రకాశంతో కూడిన ఎండ నేరుగా చర్మానికి తగిలినప్పుడు వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) మొదలవుతుంది. ముఖ్యంగా ఎండ అలవాటు లేనివారికి దీని ముప్పు ఎక్కువ. ఇందులో ముందు చర్మం ఎర్రబడుతుంది. అనంతరం నీలం రంగులోకి మారుతుంది. ఎండ తీవ్రత మరీ ఎక్కువగా లేకపోతే ఎరుపు క్రమంగా తగ్గిపోతుంది. కాకపోతే చర్మం రంగు కాస్త ముదురుగా అవ్వచ్చు. ఎండ ప్రభావం ఎక్కువగా పడితే కొందరిలో ఎరుపు తీవ్రం కావొచ్చు. చర్మం ఉబ్బి, నొప్పి పుట్టొచ్చు. కొందరికి పొక్కులూ తలెత్తొచ్చు.
* వారాల కొద్దీ ఎండ ప్రభావానికి గురవుతుంటే చర్మం క్రమంగా దానికి అలవడుతూ వస్తుంది. అప్పుడు ఎరుపు, కమలటం వంటివి ఉండవు గానీ చర్మం రంగు మారుతూ వస్తుంది. ఎక్కువసేపు ఎండలో గడిపే కూలీలు, రైతులు, నావికులు, సైనికుల వంటి వారిలో ఇలాంటిది చూస్తుంటాం.
* ఎండాకాలంలో ఆడవారిలో ముఖం మీద మంగు (మెలస్మా) రావొచ్చు. అప్పటికే దీంతో బాధపడుతున్నవారికిది ఎక్కువ కావొచ్చు కూడా.
చికిత్స: చర్మం ఎరుపు ఎక్కువగా ఉంటే మలాములు మేలు చేస్తాయి. కెమికెల్ పీల్స్, లేజర్లు, కొన్ని పూత మందులతో నలుపును తగ్గించుకోవచ్చు. చర్మానికి నేరుగా ఎండ తగలకుండా చూసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. స్కూటర్ మీద వెళ్లేవారు చేతులకు గ్లవుజులు ధరిస్తే మంచిది.
* మంగు గలవారు బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్లు వాడుకోవాలి. నలుపు తగ్గటానికి డీ పిగ్మెంట్ ఏజెంట్స్ కూడా ఉపయోగపడతాయి.
ఎండ అలర్జీ
కొందరికి ఎండక పడకపోవచ్చు. ఇది అలర్జీకి కారణమవుతుంది (పాలీమార్ఫస్ లైట్ ఎరప్షన్). దీంతో చర్మం మీద ఎర్రటి దద్దుర్లు వస్తాయి. ఎండ తగిలే చోట మాత్రమే అలర్జీ తలెత్తుతుంది. వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంటుంది. ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ బాగా కాయటం వల్ల అతి నీలలోహిత కాంతి ప్రభావమూ ఎక్కువగానే ఉంటుంది. చేతులు, ముంజేయి, ముఖం, మెడ మీద అలర్జీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ అలర్జీ తలెత్తొచ్చు. కాబట్టి వేసవి సెలవుల్లో ఇలాంటి చోట్లకు వెళ్తే జాగ్రత్త అవసరం.
* ఎండాకాలంలో బయటికి వెళ్లినప్పుడు పుప్పొడి రేణువులు చర్మం మీద పడొచ్చు. వీటికి చెమట, ఎండ కూడా తోడై ముఖం నల్లగా అవ్వచ్చు (ఫైటో ఫొటో డెర్మటైటిస్). ఇది చేతులకు, ముంజేయికి రావొచ్చు. ఇందులో దురద ఎక్కువ. ఇది ఆక్టినిక్ రెటిక్యులాయిడ్ అనే తీవ్ర సమస్యకూ దారితీయొచ్చు. దురదను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకూ ప్రయత్నిస్తుండటం గమనార్హం.
చికిత్స: సాధారణంగా ఎండ అలర్జీ దానంతటదే కొద్దిరోజుల్లో తగ్గిపోతుంది. సమస్య తీవ్రంగా ఉండి, మాటిమాటికీ దద్దుర్లు వస్తుంటే చికిత్స అవసరమవుతుంది. దురద తగ్గించే మలాములు, యాంటీహిస్టమిన్ మాత్రలు ఉపయోగపడతాయి. నీటిలో తువ్వాలును ముంచి అద్దటం, చన్నీటితో స్నానం మేలు చేస్తాయి. తరచూ దద్దు వస్తుంటే ఫొటోథెరపీ ఉపయోగపడుతుంది. ఇందులో అతినీలలోహిత కాంతిని తక్కువ మోతాదులో చర్మం మీద పడేలా చేస్తారు. దీంతో చర్మం క్రమంగా దానికి అలవడుతుంది. ఫైటో ఫొటో డెర్మటైటిస్‌కు సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవచ్చు.
చర్మం ముడతలు
వయసు మీద పడుతున్నకొద్దీ చర్మకణాలు, కొవ్వు, స్వేదగ్రంథులు, నూనె గ్రంథులు, కొలాజెన్, చర్మం కింద ఉండే సాగే కణజాలం తగ్గిపోతూ రావటం వల్ల ముడతలు పడటం సహజమే. అయితే ఎండ ప్రభావంతో చర్మం ముడతలు పడే ప్రక్రియ ఎక్కువవుతుంది. నిజానికి మనం ఎండకు వెళ్లాల్సిన పనిలేదు. ఎండే మనదగ్గరకు వస్తుందని గుర్తుంచుకోవాలి. దీనికి తోడు పొగ తాగటం, మద్యం అలవాట్లు కూడా ఉంటే ముడతలు మరింత ఎక్కువవుతాయి.
క్యాన్సర్ల ప్రమాదం
ఎండ మనకు అత్యవసరం. ఇది లేకపోతే జీవించలేం. అయితే ఇదే కొన్నిసార్లు హానికరంగా పరిణమించొచ్చు. చర్మ క్యాన్సర్‌కు కారణమయ్యే జబ్బులకు (ఆక్టినిక్ కెరటోసిస్) దారితీయొచ్చు. బవెన్స్ డిసీజ్, లెంటిగో మెలిగ్నా తలెత్తొచ్చు. కొందరికి చర్మ క్యాన్సర్లు (స్క్వామ్‌సెల్ కార్సినోమా, బేసల్ సెల్ కార్సినోమా, మెలనోమా) కూడా రావొచ్చు. కొందరికి పెదవులు ఎండిపోయి, పగుళ్లు పట్టొచ్చు (ఆక్టినిక్ కీలైటిస్). పాశ్చాత్యదేశాల్లో చర్మక్యాన్సర్లు ఎక్కువ. అక్కడివారిలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం తక్కువగా ఉంటుంది. దక్షిణాసియా, ఆఫ్రికా వాసుల్లో మెలనిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకు చర్మ క్యాన్సర్ల ముప్పు తక్కువ. కానీ ఇటీవల మనదగ్గరా ఇవి ఎక్కువవుతున్న విషయాన్ని మరవరాదు. దీనికి కారణం సి రకం అతినీలలోహిత కాంతిని వడకట్టే ఓజోన్ పొర క్షీణిస్తుండటం. క్యాన్సర్ తొలిదశలో వేళ్ల దగ్గరి నుంచి ముంజేయి వరకు సన్నటి బుడిపెలు, ఎరుపు పొక్కులు, పులిపిర్ల వంటివి తలెత్తుతాయి. ముఖం మీద.. ముఖ్యంగా ముక్కు, బుగ్గలు, నుదురు, పెదవుల మీద కూడా ఇవి రావొచ్చు. ఇలాంటివి ఒక పట్టాన మానవు. పొట్టు కూడా రాలొచ్చు.
* కొందరికి జన్యుపరంగా ఎండను తట్టుకునే సామర్థ్యం ఉండదు (జెరోడెర్మా పిగ్మెంటోజమ్). ఎండలోకి వెళ్తే సరిగా చూడలేరు కూడా. వీరికి సన్నగా నల్లటి మచ్చల వంటివి వస్తుంటాయి. వీరిలో డీఎన్‌ఏ మరమ్మతు కాదు కాబట్టి చర్మ క్యాన్సర్లు వచ్చే ముప్పూ ఎక్కువే.
చికిత్స: చర్మం మీద తలెత్తే మార్పులు మందులతో తగ్గకుండా మొండికేస్తే ముందస్తు క్యాన్సర్ సమస్యలేమోనని అనుమానించాలి. ఏదైనా మచ్చ పెద్దగా అవుతున్నా, రంగు మారినా, విస్తీర్ణం మారినా, హద్దు గట్టిగా అయినా, రక్తం వస్తున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి. ముందస్తు క్యాన్సర్ సమస్యలను లేజర్ లేదా ఎలక్ట్రో కాట్రీతో తొలగిస్తే అంతటితోనే ఆపేయొచ్చు. క్యాన్సర్‌గా మారకుండా చూడొచ్చు. కెమికల్ పీల్స్, పూత మందుల ద్వారానూ తొలగించుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Shubman Gill: శుభ్‌మన్ గిల్‌ను సచిన్, కోహ్లీలతో పోల్చడం సరికాదు: భారత మాజీ కోచ్
-
General News
Train Accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 178 మంది ఏపీ ప్రయాణికులు: వాల్తేరు డీఆర్ఎం
-
India News
Odisha Train Tragedy: 300 ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 200 అంబులెన్సులు.. రెస్క్యూ ఆపరేషన్ సాగిందిలా..!
-
India News
Manish Sisodia: కోర్టు ఊరటనిచ్చినా.. భార్యను చూడలేకపోయిన సిసోదియా..!
-
India News
Train Accident: నేలలో కూరుకుపోయిన బోగీ.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం?
-
India News
Odisha Train tragedy: ‘లగ్జరీ ట్రైన్స్కాదు.. కామన్ మ్యాన్‌ను పట్టించుకోండి’