సుదీర్ఘ ప్రయాణమా? కాళ్లు జాగ్రత్త సుమా!

ఒక్క విమాన ప్రయాణమనే కాదు.. రైలు, కారు ఏదైనా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం డీవీటీకి కారణం కావొచ్చు. సాధారణంగా వృద్ధ మహిళలు, గర్భనిరోధక మాత్రలు వేసుకునేవారికి దీని ముప్పు ఎక్కువ.

Updated : 06 Jun 2023 10:02 IST

ఇటీవల విమాన ప్రయాణాలు ఎక్కువయ్యాయి. విదేశాలకు వెళ్లేవారైతే గంటల కొద్దీ ప్రయాణం చేస్తుంటారు. ఇలా కదలకుండా ఎక్కువసేపు కూర్చుంటే కాళ్లలో రక్తం పోగుపడి, రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడే ప్రమాదముంది. దీన్నే డీవీటీ (డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌) అంటారు. దీంతో రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోవచ్చు కూడా. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. రక్తం గడ్డలు అక్కడి నుంచి కదిలి, ఊపిరితిత్తులకు చేరుకుంటే తీవ్ర శ్వాస సమస్యలకు దారితీస్తుంది.

ఒక్క విమాన ప్రయాణమనే కాదు.. రైలు, కారు ఏదైనా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం డీవీటీకి కారణం కావొచ్చు. సాధారణంగా వృద్ధ మహిళలు, గర్భనిరోధక మాత్రలు వేసుకునేవారికి దీని ముప్పు ఎక్కువ. మధుమేహంతో బాధపడే వృద్ధులకూ ప్రమాదం ఎక్కువే. కాబట్టి ఎక్కువ దూరాలు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి. కొన్ని చిట్కాలతో కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసుకోవచ్చు.

* ప్రయాణాలు చేసే ముందు కాసేపు అటూఇటూ నడవాలి. దీంతో కొంతసేపటి వరకు కాళ్లకు రక్త సరఫరా మెరుగ్గా ఉంటుంది.
* విమానం ఎక్కిన తర్వాతా అప్పుడప్పుడు నడవటం మంచిది. దీంతో రక్త ప్రసరణ పుంజుకుంటుంది.
* సాగే లేదా కంప్రెషన్‌ సాక్సు ధరిస్తే కాళ్లు, పాదాలు ఉబ్బకుండా చూసుకోవచ్చు. కాలి సిరల్లో రక్తం గూడు కట్టే సమస్య గలవారికి ఈ సాక్సు ఎంతో మేలు చేస్తాయి. అయితే మధుమేహం గలవారు వీటిని ధరించే ముందు డాక్టర్ల సలహా తప్పకుండా తీసుకోవాలి.
* కూర్చున్నప్పుడు మోకాలి వెనక భాగం సీటు అంచుకు కాస్త దూరంగా ఉండేలా చూసుకోవాలి. లెగ్‌ రెస్ట్‌ మీద పాదాలు పెట్టాలి. లేకపోతే మోకాలి వెనక భాగం సీటు అంచులకు ఒత్తుకుపోయి, సిరల మీద ఒత్తిడి పెరుగుతుంది.
* ఆస్ప్రిన్‌ మాత్రలు వాడేవారు వీటిని వేసుకోవటం మరవరాదు. ఆస్ప్రిన్‌ రక్తాన్ని పలుచగా చేసి, రక్తం గడ్డలు ఏర్పడకుండా కాపాడుతుంది. కొందరు డాక్టర్లు రక్తం గడ్డల నివారణకు ఆస్ప్రిన్‌ను సూచిస్తుంటారు కూడా.
* తగినంత నీరు తాగటం ఉత్తమం. ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది. రక్త ప్రసరణ తేలికగా జరిగేలా చూస్తుంది. గడ్డలు ఏర్పడకుండా కాపాడుతుంది.


తేలికైన వ్యాయామాలు

రక్తం గడ్డలు ఏర్పడకుండా చూసుకోవటానికి కొన్ని వ్యాయామాలూ ఉపయోగపడతాయి.

మడమలు తిప్పటం: పాదాలను కాస్త పైకి లేపాలి. వేళ్లతో సున్నాలను గీస్తున్నట్టు పాదాలను తిప్పాలి. 15 సెకండ్ల తర్వాత పాదాలను మరోవైపునకు తిప్పాలి.


పాదాలు వెనక్కీ, ముందుకీ: మడమలను కింద ఆనించి ఉంచాలి. వేళ్ల భాగాన్ని వీలైనంతవరకు శరీరం వైపు లాక్కోవాలి. ఒకట్రెండు సెకండ్ల పాటు అలాగే ఉంచి, తర్వాత ముందుకు చాచాలి. ఇలా వీలైనన్ని సార్లు చేయాలి.


మోకాళ్లు ఎత్తటం: రెండు అరచేతులతో కుడి మోకాలిని చుట్టి, పట్టుకోవాలి. శరీరాన్ని కాస్త ముందుకు వంచాలి. తర్వాత మోకాలిని ఛాతీ వైపు లాగాలి. 15 సెకండ్ల పాటు అలాగే ఉంచి, నెమ్మదిగా మోకాలిని కిందికి దించాలి. ఎడమ మోకాలితోనూ ఇలాగే చేయాలి. ఇలా 10 సార్లు చేయాలి.


ముందుకు వంగటం: పాదాలను కింద ఆనించాలి. నెమ్మదిగా ముందుకు వంగాలి. చేతులతో మడమలను తాకే ప్రయత్నం చేయాలి. 15 సెకండ్ల పాటు అలాగే ఉండి, యథాస్థితికి రావాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని