చెడు కొలెస్ట్రాల్‌నీ పట్టించుకోండి

గుండె పోటు, పక్షవాతం రాక ముందే కాదు.. వాటి నుంచి బయటపడ్డ తర్వాతా చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) మీద కన్నేసి ఉంచాలి. మరోసారి సమస్యల దాడి చేయకుండా చూసుకోవటానికిది ముఖ్యం.

Updated : 29 Aug 2023 05:44 IST

గుండె పోటు, పక్షవాతం రాక ముందే కాదు.. వాటి నుంచి బయటపడ్డ తర్వాతా చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) మీద కన్నేసి ఉంచాలి. మరోసారి సమస్యల దాడి చేయకుండా చూసుకోవటానికిది ముఖ్యం. కానీ చాలామందికి దీనిపై అవగాహనే ఉండటం లేదు. గుండె పోటు, పక్షవాతం బారినపడి, వాటి నుంచి బయటపడ్డవారిలో 75% మందికి చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటున్నప్పటికీ కేవలం 49% మందే దీన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ అధ్యయనంలో తేలింది. చెడు కొలెస్ట్రాల్‌ పర్యవసానాల మీద అత్యధిక శాతం మందికి అవగాహనే ఉండటం లేదనే విషయాన్ని ఇది తేటతెల్లం చేస్తోంది. ఎల్‌డీఎల్‌ ఎక్కువగా ఉన్నా ఎలాంటి లక్షణాలూ ఉండవు. కానీ లోపల నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇది రక్తనాళాల గోడల మీద పోగుపడి, పూడికలకు దారితీస్తుంది. ఫలితంగా గుండె పోటు, పక్షవాతం ముప్పు పెరుగుతుంది. ఎల్‌డీఎల్‌ పరీక్ష తేలికైంది. పెద్దగా ఖర్చేమీ కాదు. ఒకవేళ ఇది ఎక్కువుంటే వ్యాయామం చేయటం, ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించటం ద్వారా అదుపులోకి వస్తుంది. అవసరమైతే మందులూ వేసుకోవాలి. 20 ఏళ్లు, అంతకన్నా ఎక్కువ వయసువారంతా గుండె జబ్బు ముప్పు తగ్గేంతవరకూ ప్రతి 4-6 ఏళ్లకోసారి కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకోవాలని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ సిఫారసు చేస్తోంది. 40 ఏళ్ల తర్వాత గుండె పోటు, పక్షవాతం ముప్పులను అంచనా వేయటానికీ డాక్టర్లు కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయిస్తారు. దీని ద్వారా పదేళ్ల కాలంలో ఈ సమస్యలు ఎంతవరకు రావొచ్చనేది లెక్కిస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని