నోట్లో నల్లటి మచ్చలు, మంట?

నాకు 48 ఏళ్లు. మూడేళ్లుగా నోటి లోపల నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నాను. నేను భోజనం చేసినప్పుడు బుగ్గల చర్మం పంటి కింద పడి నలిగింది. పళ్ల డాక్టర్‌ దగ్గరికి వెళ్తే జ్ఞానదంతాలు తీసేశారు.

Updated : 08 Feb 2022 06:04 IST

సమస్య: నాకు 48 ఏళ్లు. మూడేళ్లుగా నోటి లోపల నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నాను. నేను భోజనం చేసినప్పుడు బుగ్గల చర్మం పంటి కింద పడి నలిగింది. పళ్ల డాక్టర్‌ దగ్గరికి వెళ్తే జ్ఞానదంతాలు తీసేశారు. బుగ్గలు నలిగిన చోట చర్మం నల్లగా అయ్యింది. మచ్చలు క్రమంగా పెరిగాయి. అనంతరం కారం తగిలితే బుగ్గలు మండటం మొదలైంది. పళ్ల డాక్టర్‌ బయాప్సీ చేయించాలని మరొక డాక్టర్‌కు సిఫారసు చేశారు. ఆయన నోరంతా పరిశీలించి బయాప్సీ అవసరం లేదన్నారు. ఇది చర్మ వ్యాధి అని, కొన్ని మందులు ఇచ్చారు. అవి వాడినా ఫలితం లేదు. నాకు థైరాయిడ్‌, గ్యాస్‌ సమస్యలున్నాయి. మందులు వాడితే తగ్గాయి. మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నాకు మాట ఆగిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారమేంటి?

- పి.లక్ష్మి, రాజమండ్రి

సలహా: మీరు మూడేళ్లుగా నోటి లోపల నల్ల మచ్చలు ఉన్నాయని అంటున్నారు. పళ్ల కింద బుగ్గల చర్మం నలగటం వల్ల ఏర్పడిన మచ్చలు, అవీ ఒకటేనా అన్నది స్పష్టంగా రాయలేదు. చర్మానికి రంగు తెచ్చిపెట్టే వర్ణద్రవ్యం ఎక్కువగా పోగుపడటం (హైపర్‌ పిగ్మెంటేషన్‌) వల్ల నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవేమీ ప్రమాదకరమైనవి కావు. తరచూ చూసే సమస్యే. దీనికి కారణం హార్మోన్ల మార్పులు. మీరు పంపించిన రిపోర్టుల్లోనూ థైరాయిడ్‌ గ్రంథి వాపు ఉన్నట్టు తేలింది. అందువల్ల మీరు ఒకసారి ఎండోక్రైనాలజిస్టును సంప్రదించి, పరీక్షించుకోవటం మంచిది. భోజనం చేసినప్పుడు పళ్ల కింద పడి బుగ్గలు నలగటం వల్ల ఏర్పడిన మచ్చలైనా భయపడాల్సిన పనేమీ లేదు. అయితే కారం తగిలినప్పుడు బుగ్గలు మండుతున్నాయని అంటున్నారు. నోట్లో లైకెన్‌ ప్లానస్‌ అనే సమస్యతో ఇలా మంట పుట్టొచ్చు. కాకపోతే ఇందులో మచ్చలు తెల్లగా ఉంటాయి. మీరు వాడిన విటమిన్ల మాత్రల వంటి మందులు మంచివే. మంట తగించేవే. కానీ ఎందుకు తగ్గలేదో అర్థం కావటం లేదు. కాబట్టి ఒకసారి చర్మ నిపుణులను సంప్రదించటం మేలు. నోట్లో నల్ల మచ్చలతో పాటు తెల్ల మచ్చలేవైనా ఉన్నాయేమో చూసి తగు మందులు సూచిస్తారు. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే సమస్య ప్రమాదకరమైంది కాదనే తోస్తోంది. అయితే మందులు వాడినా ఉపశమనం లేదంటున్నారంటే బయాప్సీ అవసరమనే అనిపిస్తోంది. ఇందులో సమస్యేంటన్నది కచ్చితంగా తేలుతుంది. మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు మాట ఆగిపోతోందనీ అంటున్నారు. ఎక్కువగా మాట్లాడేవారికి, గొంతు పొడిబారేవారికి ఇలాంటి సమస్య తలెత్తే అవకాశముంది. మీరు 3 రోజుల పాటు గొంతుకు విశ్రాంతి ఇచ్చి, ఎక్కువగా మాట్లాడకుండా చూసుకోండి. అలాగే నీళ్లు ఎక్కువగా తాగండి. అప్పటికీ తగ్గకపోతే ఈఎన్‌టీ సర్జన్‌ను సంప్రదించండి. స్వరపేటికను పరిశీలించి సమస్య ఏంటన్నది నిర్ధరిస్తారు.

చిరునామా: సమస్య-సలహా, సుఖీభవ, ఈనాడు కార్యాలయం, రామోజీ ఫిలింసిటీ, హైదరాబాద్‌ - 501 512

email:sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని