‘ఊపిరి’కి పొగ చిచ్చు!

చెట్టంత మనిషి అంటారు. ఏ ఉద్దేశంతో అన్నా మనలోనూ ఓ ‘చెట్టుంది'. కొమ్మలు కొమ్మలుగా విస్తరించిన గాలి గొట్టాలు.. వాటి చివర్లో ఆకుల్లాంటి గాలిగదులతో కూడిన ఊపిరితిత్తులు అచ్చం చెట్టునే తలపిస్తాయి. మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్‌ను రక్తంలోకి చేరుస్తూ.. వదిలే గాలి ద్వారా రక్తంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను బయటకు పంపిస్తూ ప్రాణాల్ని నిలబెడతాయి. మరి వీటికి మనమే ‘పొగ’ పెట్టుకుంటే? గాలిగొట్టాలను, గాలిగదులను కోలుకోలేని దెబ్బతీసే క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ) అలాంటిదే. ఇది సిగరెట్లు, బీడీల వంటివి తాగుతూ చేజేతులా

Updated : 13 May 2022 14:18 IST

రేపు ప్రపంచ సీవోపీడీ దినం

చెట్టంత మనిషి అంటారు. ఏ ఉద్దేశంతో అన్నా మనలోనూ ఓచెట్టుంది'. కొమ్మలు కొమ్మలుగా విస్తరించిన గాలి గొట్టాలు.. వాటి చివర్లో ఆకుల్లాంటి గాలిగదులతో కూడిన ఊపిరితిత్తులు అచ్చం చెట్టునే తలపిస్తాయి. మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్‌ను రక్తంలోకి చేరుస్తూ.. వదిలే గాలి ద్వారా రక్తంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ను బయటకు పంపిస్తూ ప్రాణాల్ని నిలబెడతాయి. మరి వీటికి మనమే ‘పొగ’ పెట్టుకుంటే? గాలిగొట్టాలను, గాలిగదులను కోలుకోలేని దెబ్బతీసే క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డిసీజ్‌ (సీవోపీడీ) అలాంటిదే. ఇది సిగరెట్లు, బీడీల వంటివి తాగుతూ చేజేతులా తెచ్చిపెట్టుకునే సమస్యే మరి. ఒకసారి మొదలైతే పెరగటమే తప్ప తగ్గటమనేది ఉండదు. అందుకే ప్రపంచ సీవోపీడీ దినం దీన్ని గుర్తించమని హెచ్చరిస్తోంది. పూర్తిగా నివారించుకోగల దీనికి లొంగిపోవటమెందుకని తరచి చూసుకోమంటోంది.

మన శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ అత్యవసరం. ఇది మనకు శ్వాస ద్వారానే లభిస్తుంది. మనం పీల్చుకున్న గాలి ముందుగా ముక్కు, శ్వాసనాళం, సన్నటి గాలిగొట్టాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుకుంటుంది. అక్కడ్నుంచి ప్రత్యేకమైన, సన్నటి పొరతో కూడిన సూక్ష్మమైన గాలిగదుల్లోకి వెళ్తుంది. వీటికి ఒకవైపున మనం పీల్చుకున్న గాలి, మరోవైపున గుండె నుంచి వచ్చిన చెడు రక్తం ఉంటాయి. గాలిలోని ఆక్సిజన్‌ సన్నటి పొరను దాటుకొని అవతలి రక్తంలోకి వెళ్తుంది. అదే సమయంలో చెడు రక్తంలోని కార్బన్‌ డయాక్సైడ్‌ ఇవతలి వైపునకు వస్తుంది. ఇదంతా మనకేమీ తెలియకుండా నిరంతరం సాగిపోయే ప్రక్రియ. ఇంతటి సంక్లిష్టమైన పనిని, అతి సున్నితంగా, సుతారంగా నిర్వహించే ఊపిరితిత్తులకు రకరకాల సమస్యలు రావొచ్చు. బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల వంటివి మన ప్రమేయమేమీ లేకుండానే దాడిచేసేస్తుంటాయి. కొన్ని మాత్రం మన ప్రమేయంతో, మన దురలవాట్లతోనే పుట్టుకొస్తుంటాయి. వీటిల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్య ‘సీవోపీడీ’ గురించే. దీనికి ముఖ్య కారణం పొగ తాగే అలవాటే. సిగరెట్లు, బీడీలు, చుట్టల్లోని పొగాకు నుంచి వెలువడే పొగ సున్నితమైన గాలిగదులను, గాలిగొట్టాలను కోలుకోలేనంతగా దెబ్బతీసి సమస్యాత్మకంగా పరిణమిస్తుంది. మన ఊపిరితిత్తుల్లో 30 కోట్ల గాలిగదులుంటాయి. నిజానికి మన రోజువారీ అవసరాలకు వీటిల్లో మూడో వంతే సరిపోతాయి. అంటే ప్రకృతి మనకు అవసరానికి మించి గాలిగదులను ఇచ్చిందన్నమాట. ఇదొక రకంగా వరమే అయినా మరోరకంగా శాపంగానూ మారుతోంది. గాలిగదుల సంఖ్య ఎక్కువగా ఉండటం మూలంగా ఊపిరితిత్తులు మూడింట ఒక వంతు వరకు చెడిపోయేంతవరకూ ఎలాంటి ఇబ్బందులూ కనిపించటం లేదు. సీవోపీడీ లక్షణాలు బయటపడేసరికే గాలిగదులు, గాలిగొట్టాలు కోలుకోలేని విధంగా దెబ్బతినిపోతుంటాయి. అప్పుడు లక్షణాలను అదుపులో ఉంచుకోవటం తప్పించి తిరిగి బాగు చేసుకోవటం అసాధ్యం. పరిస్థితి అంతవరకూ రాకుండా ముందు నుంచే జాగ్రత్త పడటం ఎంతైనా అవసరం.

ఒకటి కాదు.. రెండు!
సీవోపీడీలో రెండు రకాలున్నాయి. 1. క్రానిక్‌ బ్రాంకైటిస్‌ 2. ఎంఫెసీమా. మామూలు దుమ్ముధూళి, పొగ, కాలుష్యం వంటి వాటిని ఊపిరితిత్తులు బాగానే తట్టుకుంటాయి. పెద్దఎత్తున లోపలికి చొచ్చుకువచ్చే సిగరెట్ల పొగను అంతగా ఎదుర్కోలేవు. దీంతో సున్నితమైన లోపలి పొర దెబ్బతింటుంది. అలాగే మన రోగనిరోధక వ్యవస్థ పొగను శత్రువుగా భావించి దాడి చేస్తాయి. ఫలితంగా గాలిగొట్టాల్లో వాపుప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మొదలవుతుంది. దీంతో అవి  ఉబ్బిపోయి, లోపలి మార్గం కుంచించుకుపోతుంది. కళ్లె ఉత్పత్తీ పెరుగుతుంది. దీంతో శ్వాస కష్టమైపోతుంది. ఇదే క్రానిక్‌ బ్రాంకైటిస్‌. గాలిగొట్టాలతో పాటు గాలిగదులూ దెబ్బతినటం ఎంఫెసీమా ప్రత్యేకత. కొన్ని గదులు చిరిగిపోవచ్చు. రెండు మూడు గదులు కలిసిపోవచ్చు. దీంతో లోపలికి వెళ్లిన గాలి బయటకు రాలేక అక్కడే చిక్కుకుపోతుంది. ఫలితంగా ఆక్సిజన్‌, కార్బన్‌ డయాక్సైడ్‌ మార్పిడి ప్రక్రియ అస్తవ్యస్తమవుతుంది. కొందరికి ఎంఫెసీమా, కొందరికి క్రానిక్‌ బ్రాంకైటిస్‌ మాత్రమే ఉండొచ్చు గానీ చాలామందికి ఇవి రెండూ ఉంటాయి.

చిన్నదేమీ కాదు
సిగరెట్లు తాగేవారిలో చాలామంది సీవోపీడీ అరుదైన సమస్యని, మనవరకూ రాదనే భావిస్తుంటారు. ఇది చాలా తప్పు. ప్రపంచంలో అతి ఎక్కువగా మరణాలకు కారణమయ్యే జబ్బుల్లో సీవోపీడీ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. మనదేశంలో సుమారు 5% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. నిజానికి వీరి సంఖ్య ఇంకా ఎక్కువగానూ ఉండొచ్చు. సీవోపీడీ ఉన్నా దాని గురించి తెలియనివారు, ఆసుపత్రులకు వెళ్లనివారు ఎందరో. డాక్టర్‌కు చూపించుకున్నా సమస్యను సరిగా గుర్తించలేక పోవటమూ మనదగ్గర సమస్యే. దీని బారినపడ్డవారు మాటిమాటికీ ఆసుపత్రిలో చేరటం, పరీక్షలు, మందుల కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. విలువైన పనివేళలు వృథా అవుతాయి. ఇలా ఆర్థికంగా, శారీరకంగా తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది.

పొగ అలవాటే ప్రధాన కారణం
సీవోపీడీకి ముఖ్యమైన కారణం పొగ తాగే అలవాటు. దీని బారినపడ్డ వారిలో 95% మంది పొగతాగే వారే. ఎంత చిన్న వయసులో పొగ అలవాటు మొదలైతే అంత త్వరగా లక్షణాలు మొదలవుతాయి. మనలాంటి దేశాల్లో కట్టెల పొయ్యిలు, పిడకల పొయ్యిల వంటివీ దీనికి దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరుకిరుకు గదుల్లో కట్టెల పొయ్యిల మీద దీర్ఘకాలం వంట చేసే మహిళల్లో ఇలాంటి సమస్య తలెత్తుతోంది. చిన్నప్పుడు తరచూ శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల బారినపడ్డవారికీ దీని ముప్పు పొంచి ఉంటోంది.

లోలోపలే దాడి..
సీవోపీడీ మొదలైన చాలా ఏళ్ల తర్వాత గానీ దీని లక్షణాలు కనిపించవు. ముఖ్యంగా ఇంటిపట్టునే కూర్చొని పనులు చేసేవారికి, శారీరకశ్రమ అంతగా చేయనివారికి సమస్య తెలియకుండా లోలోపలే ఉండిపోతుంటుంది. అందుకే చాలామందిలో ఊపిరితిత్తులు చెడిపోయాక గానీ లక్షణాలు బయటపడవు. కొందరికి ఉన్నట్టుండి హఠాత్తుగా తీవ్రమైన దగ్గు, ఆయాసం, నిస్సత్తువ, నీరసం తలెత్తుతాయి (ఎక్సాసర్‌బేషన్‌ ఆఫ్‌ సీవోపీడీ). వీరిని వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి వస్తుంది.

ఆస్థమా కాదు
కొందరు సీవోపీడీని ఆస్థమాగా పొరపడుతుంటారు. ఇవి రెండూ వేర్వేరు సమస్యలు. ఆస్థమా లక్షణాలు చిన్నప్పుడే పొడసూపుతాయి. ఇది ఎవరికైనా రావొచ్చు. కాలాల వారీగా.. కొందరికి చలికాలంలో, కొందరికి వానా కాలంలో ఎక్కువవుతుంది. ఆస్థమాలో దగ్గు, ఆయాసంతో పాటు అలర్జీ లక్షణాలూ కనిపిస్తాయి. సీవోపీడీ సాధారణంగా 45 ఏళ్ల తర్వాతే బయటపడుతుంది. మగవారిలో ఎక్కువ. దీనికి కాలాలతో నిమిత్తం లేదు. ఒకసారి మొదలైతే నిరంతరం కొనసాగుతుంది. రోజురోజుకీ లక్షణాల తీవ్రత ఎక్కువవటమే గానీ తగ్గటమనేది ఉండదు.

ప్రొటీన్‌ తీసుకోవాలి
* సీవోపీడీ బాధితులకు పోషణ లోపం తలెత్తొచ్చు. అందువల్ల ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రొటీన్‌ ఎక్కువ తీసుకోవాలి. సోయా, వేరుశనగ, బాదం, పప్పులు, పాలు, గుడ్డు తినటం మంచిది.
* ఎప్పుడూ కూర్చొని ఉండటం తగదు. రోజుకు కనీసం 40 నిమిషాల సేపు నడవాలి. ఆయాసం వచ్చినప్పుడు కాసేపు కూర్చొని తిరిగి నడవాలి.

ప్రధాన లక్షణం దగ్గు
సీవోపీడీలో ముఖ్యమైన లక్షణం దగ్గు. కళ్లె కూడా పడుతుంది. ముఖ్యంగా ఉదయం పూట ఎక్కువ. క్రమేపీ ఆయాసం తలెత్తుతుంది. మొదట్లో కాస్త కష్టమైన పనులు (వేగంగా నడవటం వంటివి) చేసినప్పుడు ఆయాసం వస్తుంటుంది. ఆ తర్వాత అలవాటులేని పనులు (మెట్లు ఎక్కటం వంటివి) చేసినప్పుడు శ్వాస కష్టమైపోతుంటుంది. అనంతరం చిన్న చిన్న పనులు, రోజువారీ పనులు (స్నానం, తల దువ్వుకోవటం వంటివి) చేసుకోవాలన్నా ఆయాసం వేధిస్తుంది. చివరికి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడూ ఆయాసం రావొచ్చు.

నిర్ధారణ ఎలా?
సీవోపీడీని అనుమానించినప్పుడు కొన్ని ప్రశ్నలతో (మాడిఫైడ్‌ ఎంఎంసీ స్కోరింగ్‌ పద్ధతి) ఏ దశలో ఉందనేది అంచనా వేస్తారు. అనంతరం స్పైరోమెట్రీ ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష (లంగ్‌ ఫంక్షన్‌ టెస్ట్‌) చేస్తారు. ఇందులో శ్వాసను గట్టిగా తీసుకొని ఒక గొట్టంలాంటి పరికరంలోకి ఊదాల్సి ఉంటుంది. ఇది సీవోపీడీనా? ఆస్థమానా? అన్నది తెలుసుకోవటానికీ ఉపయోగపడుతుంది. సాధారణంగా పరికరంలోకి ఊదినప్పుడు తొలి క్షణంలోనే 90% గాలి బయటకు వస్తుంది. ఆస్థమాలో తొలి క్షణంలో గాలి బాగానే బయటకు వస్తుంది గానీ సీవోపీడీలో అంతగా రాదు. అవసరమైతే గాలిగొట్టాలను వెడల్పు చేసే మందు ఇచ్చి, 20 నిమిషాల తర్వాత మరోసారి స్పైరోమెట్రీ పరీక్ష చేస్తారు.

చికిత్స- కౌన్సెలింగ్‌, మందులు
మందుల కన్నా ముందు కౌన్సెలింగ్‌ చాలా అవసరం. ఎందుకంటే సీవోపీడీలో పొగ అలవాటు మానెయ్యటం ముఖ్యం. ఇందుకు కౌన్సెలింగ్‌ బాగా ఉపయోగపడుతుంది. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతున్నారు? ఆర్థిక స్థితులేంటి? అనే దాన్ని బట్టి కౌన్సెలింగ్‌ ఇస్తారు.
* సీవోపీడీ బాధితులకు గాలిగొట్టాలు విప్పారేలా చేసే బ్రాంకోడైలేటర్లు, కళ్లె ఉత్పత్తిని తగ్గించే మస్కరినిక్‌ ఏజెంట్స్‌ బాగా ఉపయోగపడతాయి. వీటిని ఇన్‌హేలర్ల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. రోజుకు ఒకసారి తీసుకునే మందులూ ఇప్పుడు వస్తున్నాయి.
* రక్తంలో ఆక్సిజన్‌ తగ్గినవారు ముక్కు ద్వారా ఆక్సిజన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇంట్లో వాడుకునే, తేలికగా వెంట తీసుకెళ్లగలిగే పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
* సీవోపీడీ గలవారికి కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక సమస్యల ముప్పూ ఎక్కువే. ఇలాంటివి గలవారు తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

సీవోపీడీ బాధితులకు న్యుమోనియా, ఫ్లూ ఇన్‌ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. తీవ్రతా ఎక్కువే. అందువల్ల న్యుమోనియా,  ఫ్లూ టీకాలు విధిగా తీసుకోవాలి. 
ప్రపంచంలో అతి ఎక్కువగా మరణాలకు దారితీస్తున్న జబ్బుల్లో సీవోపీడీది నాలుగో స్థానం. మనదేశంలో సుమారు 5% మంది దీంతో బాధపడుతున్నారని అంచనా. 

పొగ జోలికి వెళ్లకుంటే చాలు

సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటి వాటి జోలికి వెళ్లకపోతే సీవోపీడీ బారినపడకుండా కాపాడుకున్నట్టే. మొదట్నుంచే వీటికి దూరంగా ఉండటం, పొగ అలవాటుంటే మానెయ్యటం ఉత్తమం.  సిగరెట్లు కాల్చేవారికే కాదు, వాళ్లు వదిలిన పొగను పీల్చినవారికీ ముప్పు పెరుగుతుంది. సిగరెట్‌ను ముట్టించి పట్టుకున్నప్పుడు వెలువడే పొగ ఇంకా ప్రమాదకరం.

గుండెకూ చేటే

సమస్య తీవ్రమైతున్నకొద్దీ రక్తంలో ఆక్సిజన్‌ తగ్గుతుంది. దీంతో గుండె మరింత బలంగా పనిచేయాల్సి వస్తుంది. గుండె నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తులు అంతగా తీసుకోలేక ఇబ్బంది పడుతుంటాయి. ఫలితంగా గుండె మీద భారం పెరిగి, కుడి గదులు వెడల్పు కావొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని