Published : 20 Nov 2019 01:40 IST

దాహమా!? ఏమిటది..?

మనం నీళ్లు తాగకుండా ఒక్కరోజైనా ఉండలేం... కానీ కొన్ని జీవులున్నాయి... ‘ఆ తెలుసు... ఒంటె గురించేగా’ అనుకుంటున్నారా?అదే కాకుండా ఇంకా ఉన్నాయ్‌... వారాలకు వారాలు నీళ్లు తాగవు... ఒకటైతే జీవితాంతం మంచినీళ్లు ముట్టుకోదు... ఇంతకీ అవేంటీ? ఎలా బతికేస్తాయి? చెప్పేయడానికి అవే వచ్చేశాయ్‌!

బుల్లి.. ఎడారి పిల్లి!

నేను బుల్లి పిల్లిని. ఎడారుల్లో ఉంటాను. 16 నుంచి 18 అంగుళాల పొడవుంటాను. నా తోక తొమ్మిది నుంచి 12 అంగుళాల పొడవు ఉంటుంది. ఇంచుమించు రెండు వారాల వరకు నీరు లేకుండా ఎంచక్కా బతికేస్తుంటా. నేను వేటాడి తినే జంతువుల రక్తం, మాంసంలో ఉన్న నీటితోనే హాయిగా ఉంటాను. మరి ఆహారం దొరకకపోతే? వేటాడకపోతే? ఎలాగబ్బా? అన్న అనుమానం మీకు వచ్చే ఉంటుంది. మరేమో నాకు చాలా ముందు చూపు అందుకే దొరికిన ఆహారంలో కాస్త ఇసుక కింద దాచి   పెట్టుకుంటా. దప్పిక, ఆకలేసినప్పుడు తవ్వితీసి తింటా. మిగతా పిల్లుల్లా చెట్లు ఎక్కడం, గెంతడం నాకు అంతగా చేతకాదు. కానీ ఇసుకని తవ్వడంలో మాత్రం నాకు నేనేసాటి.

తోక ఎలుక!

మీరు నా గురించి తెలియగానే ఎంతో ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక్క విషయంలో నేను చాలా భిన్నంగా ఉంటా. నా జీవిత కాలంలో అసలు నీరు తాగకుండానే బతికేస్తా. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. నన్ను అంతా కంగారూ ఎలుక అని పిలిచేస్తారు. ఉత్తర అమెరికాలో కనిపిస్తుంటా. నా ముందరి కాళ్లు చిన్నగా, వెనక కాళ్లు పెద్దగా ఉండటం వల్లే నా పేరు ముందు కంగారూ వచ్చి చేరింది. మాలో చాలా రకాలుంటాయి. నా కన్నా నా తోకే పొడవు. నా శరీరం మూడున్నర అంగుళాల నుంచి ఐదున్నర అంగుళాల పొడవుంటే నా తోక మాత్రం ఆరు అంగుళాల పొడవుంటుంది. నా కిడ్నీలు మీ మూత్రపిండాలతో పోల్చుకుంటే చాలా శక్తిమంతం. చాలా తక్కువ నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. నేను తిన్న ఆహారం నుంచే నీటినీ తీసుకుంటూ జీవించేస్తుంటా.

దప్పిక తెలియని దుప్పి!

నేను మామూలు దుప్పిని కాదండోయ్‌. ఇసుక దుప్పిని. మీకో గమ్మత్తయిన విషయం చెప్పనా? నీరు లేకుండా కొన్ని వారాలపాటు హాయిగా బతికేస్తా. అరేబియన్‌ ఎడారుల్లో జీవిస్తుంటా. అలా ఎలా అంటారా? నా జీవక్రియల వేగాన్ని తగ్గించుకుంటూ ఒంటి నుంచి వృథా అయ్యే నీటిని తగ్గించుకుంటానన్నమాట. అవసరమైతే.. నా కాలేయం, గుండె పరిమాణాన్ని, నీళ్లు దొరకనప్పుడు నా శ్వాసక్రియనూ తగ్గించుకుంటాను. ఇలా నీటిని చాలా పొదుపుగా ఖర్చు చేసుకుంటాను. మమ్మల్ని ఎక్కువగా వేటాడుతుండటం వల్ల ప్రస్తుతం మా సంఖ్య రోజు రోజుకూ తగ్గిపోతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు