మాకు వస్తాయ్... ఆస్కార్ అవార్డులు!

ఆఫ్రికాలోని ఎల్లో షార్క్‌ అనే సొరచేప చచ్చిపోయినట్లు నటించి దాని దగ్గరకొచ్చిన వాటిని స్వాహా అనిపించేస్తుంది. నీటి అడుగు భాగంలోకి వెళ్లి సెకన్లలో దాని రంగుని మార్చేసుకుంటుంది. అలా గంటలు గంటలైనా చచ్చినట్లు పడి ఉంటుంది. రంగు మారిపోయిన దీని శరీరం చూడ్డానికి నిర్జీవంగా కనిపిస్తుంటుంది. దాంతో చూసిన వారు

Updated : 29 Jan 2020 01:31 IST

కొన్ని జీవులున్నాయ్‌... బతకడానికే చస్తాయ్‌... వినడానికే విచిత్రంగా ఉందా?ఇంతకీ ఆ సంగతులేంటో చదివేయండి!


రంగు మార్ఛి.. ఏమారుస్తుంది!

ఆఫ్రికాలోని ఎల్లో షార్క్‌ అనే సొరచేప చచ్చిపోయినట్లు నటించి దాని దగ్గరకొచ్చిన వాటిని స్వాహా అనిపించేస్తుంది. నీటి అడుగు భాగంలోకి వెళ్లి సెకన్లలో దాని రంగుని మార్చేసుకుంటుంది. అలా గంటలు గంటలైనా చచ్చినట్లు పడి ఉంటుంది. రంగు మారిపోయిన దీని శరీరం చూడ్డానికి నిర్జీవంగా కనిపిస్తుంటుంది. దాంతో చూసిన వారు చచ్చిపోయిందనే అనుకుంటారు. దీని తీరు చూసి చుట్టూ చేరిన జీవులన్నింటిని ఇది తినేస్తుంది.


మాయ చేస్తుంది!

నటనలో జంతువులకూ అవార్డులు ఇస్తే అమెరికాలోని ఒపోసమ్‌ అనే జీవికి ఇచ్చేయొచ్ఛు పెద్ద ఎలుకలా ఉండే ఇది పిల్లి జాతికి చెందిన జీవి. దాని ఆహారం కోసం చచ్చినట్లు నటిస్తుందిది. శరీరాన్ని చుట్టేసుకుని, నోటిలో పళ్లన్నీ కనపడేలా పెద్దగా నోరు తెరిచి పడుకుంటుంది. అంతేకాదు... దాని శరీరంలోని ప్రత్యేక గ్రంథుల ద్వారా దుర్వాసననీ విడుదల చేస్తుంది.


బోల్తా కొట్టిస్తుంది!

బ్రెజిల్‌లోని లీఫ్‌ లిట్టర్‌ కప్పలు, ఆసియా, ఐరోపాలోని ఫైర్‌ బెల్లీడ్‌ టోడ్స్‌ అనే కప్పలు భలేగా నటించేస్తాయి. ఎలాగో తెలుసా? శరీరం మొత్తాన్ని తిప్పేసి, కళ్లు మూసుకుని, వాటి నాలుగు కాళ్లని చాచి అచ్చంగా చచ్చినట్లు పడుంటాయి. ఇంకా కాళ్లు, పొట్టపైన పసుపు, నారింజ రంగులో చారలు చారలుగా ఉండేలా చేస్తాయి. ఇలా రెండు నిమిషాల పాటు నటిస్తూ శత్రు జీవుల్ని బోల్తాకొట్టిస్తాయి.


నటించమంటే జీవించేస్తుంది!

ఈ ఫొటో చూస్తే ‘పాము చనిపోయినట్టు ఉందే’ అనుకుంటే పొరపాటే. ఇది చనిపోలేదు. దీని పేరు హాగ్‌నోస్‌. పొట్టనింపుకోవడానికి ఇది వేసే వేషాలు అన్నీఇన్నీ కావు. ఇదిగో ఇక్కడున్నట్లు శరీరం మొత్తాన్ని తిప్పి, తలపైకి పెట్టి, కళ్లు, నోరు తెరుస్తుంది. నిజంగా పాము చనిపోయి ఉందే అనిపించేలా చేస్తుంది. అంతేనా? కొన్నిసార్లు వాసన్నూ, రక్తపు చుక్కల్నీ వెదజల్లుతుంది. ఇంకేముంది... ఎలుకల్లాంటివి దీని జిత్తులు తెలియక దగ్గరకు వచ్చేస్తాయి. పాముకు ఆహారమైపోతాయి. శరీరాన్ని తిప్పడం సరే... మరి దుర్వాసన, రక్తపు చుక్కలు ఎలా వచ్చాయంటారా? ఈ పాముల నోట్లో ఉన్న ప్రత్యేక గ్రంథులే అందుకు కారణం. ఈ జాతి పాములతో పాటు వెస్ట్‌ ఇండియన్‌ వుడ్‌ పాములూ ఇలానే చేస్తుంటాయట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని