వెన్నెల చూపిన దారి

విపులపురి రాజ్యాన్ని దేవసేనుడు పాలిస్తుండేవాడు. అతనికి ప్రియవదని అనే అందమైన కూతురుండేది. ఆ యువరాణికి సాహసాలు చేయడమంటే మహా ఇష్టం. ఉత్తరభారత సందర్శనకు వెళ్లాలనే కోరిక కూడా ఉండేది. కానీ శత్రువుల బెడదని దృష్టిలో పెట్టుకొని రాజ్యాన్ని వదిలి వెళ్లనిచ్చేవాడు కాదు. పైగా పక్కనే ఉన్న చతురనగరితో సరిహద్దు గొడవలు జరుగుతుండేవి.

Published : 23 Sep 2020 01:47 IST

విపులపురి రాజ్యాన్ని దేవసేనుడు పాలిస్తుండేవాడు. అతనికి ప్రియవదని అనే అందమైన కూతురుండేది. ఆ యువరాణికి సాహసాలు చేయడమంటే మహా ఇష్టం. ఉత్తరభారత సందర్శనకు వెళ్లాలనే కోరిక కూడా ఉండేది. కానీ శత్రువుల బెడదని దృష్టిలో పెట్టుకొని రాజ్యాన్ని వదిలి వెళ్లనిచ్చేవాడు కాదు. పైగా పక్కనే ఉన్న చతురనగరితో సరిహద్దు గొడవలు జరుగుతుండేవి. దీంతో యువరాణి రాజ్యంలోనే తోటలు, పుణ్యక్షేత్రాలకు చెలికత్తెలతో వెళ్లి వస్తుండేది.

అలా ఒక పున్నమినాటి సాయంత్రం సరిహద్దులోని తోటలోకి విహారానికి వెళ్లింది. చాలాసేపు ఆడీపాడీ అలసిపోయిన ప్రియవదని ఒక చెట్టు కింద సేదతీరేందుకని కూర్చుంది. అప్పుడే కళ్లకు జిగేల్‌మని మెరుపొకటి తగిలింది. ఏంటా? అని చూస్తే అడవిలోంచి ధగధగ మెరుస్తూ ఒక కాంతి రేఖ కనిపించింది. అంత రాత్రివేళ చిట్టడివిలోంచి మెరుపులు రావడం యువరాణిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆ మెరుపు రహస్యం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం ఏర్పడింది. గుర్రాన్ని అడవిలోకి పరుగు తీయించింది. అప్పుడే యువరాణికి ఒక అద్భుతం కనిపించింది. దూరం నుంచి గాల్లో దీపపు చుక్కలు గుంపులు గుంపులుగా రాణి వైపునకు వస్తున్నాయి. సమీపంలోకి రాగానే అవి మిణుగురు పురుగుల గుంపని అర్థమైంది.

కానీ మరికాస్త దూరంలో అడవిలో ఆ రహస్య మెరుపు ఇంకా అలా వస్తూనే ఉంది. రెట్టించిన ఉత్సాహంతో మరోసారి గుర్రాన్ని పరుగులు పెట్టించింది. గాలి చల్లగా వీస్తుండగా, అడవిలో వింత శబ్దాలు చెవుల్లో మోగుతుండగా.. అదొక దివ్యమైన అనుభూతితో ధైర్యంగా సాగిపోయింది. కాసేపు ప్రయాణం చేశాక మెరుపు వస్తున్న చోటుకు చేరుకుంది.

సరస్సు ఒడ్డున ఉన్న ఒక ఉచ్చులోంచి ఆ మెరుపు వస్తోందని గమనించింది. ఎవరో చిక్కుకున్నట్లు గుర్తించింది. గుర్రం దిగి ఆ వ్యక్తిని సమీపించాక ప్రమాదంలో ఉంది పొరుగు దేశపు మహారాజు చంద్రశేఖరుడని తెలిసింది. ఆ మెరుపు అతడి కిరీటంలో పొదిగిన వజ్రంలోంచి వస్తోందని తెలుసుకుంది. వెంటనే ఉచ్చులోంచి బయటకు లాగి మహారాజును రక్షించింది. తన ప్రాణాలు కాపాడినందుకుగానూ చతురనగరి రాజు కిరీటంలోని అరుదైన వజ్రాన్ని తీసి ఇచ్చాడు. దీన్ని అరేబియన్‌ సముద్రదొంగల నుంచి స్వాధీనం చేసుకున్నానని చెప్పాడు. కేవలం పున్నమి చంద్రుడి వెలుగుల్లో మాత్రమే మెరిసే అరుదైన వెన్నెల వజ్రమని దాని విశిష్టతను వివరించాడు.

అంతే కాకుండా తన ఆధీనంలో ఉన్న ఆ సరిహద్దు ప్రాంతాన్ని కూడా విపులనగరికి ఇచ్చేశాడు. యువరాణి సాయానికి, సాహసానికి తండ్రి అబ్బురపడ్డాడు. చంద్రశేఖరుడి కోరిక మేరకు తన కూతురిని అతనికి ఇచ్చి వివాహం చేశాడు. యువరాణి చిరకాల కాంక్షైన ఉత్తర భారత విహారాన్ని తర్వాత తన భర్త సమేతంగా చేసింది. మొత్తానికి వెన్నెల వజ్రం వల్ల తాను అనుకున్నది సాధించానని ప్రియవదని సంతోషపడింది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని