అందరి బంధువయ.. గాంధీ తాతయ్య..

‘భారతీ.. ఈరోజు మా తాతయ్య జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. మా ఇంటికి వస్తావా?’ అడిగింది స్వరాజ్యం. ‘నేనే నిన్ను మా ఇంటికి పిలుద్దాం అని అనుకుంటున్నా. ఎందుకంటే మా తాతయ్య జయంతి కూడా ఈరోజే..’ సమాధానమిచ్చింది భారతి.  ‘విచిత్రంగా ఉంది కదూ.. మనిద్దరం స్నేహితులం..

Updated : 02 Oct 2020 02:24 IST

‘భారతీ.. ఈరోజు మా తాతయ్య జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. మా ఇంటికి వస్తావా?’ అడిగింది స్వరాజ్యం. ‘నేనే నిన్ను మా ఇంటికి పిలుద్దాం అని అనుకుంటున్నా. ఎందుకంటే మా తాతయ్య జయంతి కూడా ఈరోజే..’ సమాధానమిచ్చింది భారతి.  ‘విచిత్రంగా ఉంది కదూ.. మనిద్దరం స్నేహితులం.. చిన్పప్పటి నుంచి రెండు కుటుంబాలకు మధ్య అనుబంధం ఉంది.. మన తాతయ్యల జయంతి కూడా ఒకే రోజు కావడం గమ్మత్తుగా ఉంది కదా’ అంది స్వరాజ్యం. 

‘మా తాతయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. అందుకే జయంతి సందర్భంగా పాఠశాలల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారంట’ అంది స్వరాజ్యం. ‘అదేంటి మా తాతయ్య ఫొటోకి కదా.. ఈరోజు బడిలో దండ వేసేది?’ అని ప్రశ్నించింది భారతి. ‘కాదు. ఈ రోజు మా తాతయ్యను పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు పూజిస్తారు’ బదులిచ్చింది స్వరాజ్యం. ‘అవునా! ఇదేం విచిత్రం.. మన తాతయ్యలు పుట్టింది ఒకే రోజున. వారి జయంతిని అందరూ పండగలా జరుపుకొంటున్నారంటే వారు ఎంత గొప్పవాళ్లో కదా’ అంది భారతి.

‘సరే. మీ తాతయ్య ఫొటో ఒకసారి చూపించు’ అడిగింది స్వరాజ్యం. ఇదిగో.. ఇతనే మా తాతయ్య అని పుస్తకంలోంచి ఓ ఫొటో తీసి చూపించింది భారతి. ‘అదేంటి? మీ తాత ఫొటో అంటే మా తాతది చూపిస్తున్నావు’ అయోమయంగా అడిగింది స్వరాజ్యం. ‘ఈయనే మా తాతయ్య. మీ తాతయ్య ఫొటో చూపించు?’ అడిగింది భారతి. ఇదిగో అంటూ బ్యాగు నుంచి ఒక ఫొటో చూపింది స్వరాజ్యం. ‘అరె.. నేను అడిగింది మా తాతది కాదు మీ తాతయ్యది’ అంది భారతి. ‘ఈ ఫొటో మా తాతయ్యదే’ స్పష్టం చేసింది స్వరాజ్యం. ‘మన తాతయ్యల ఫొటోలు ఒకేలా ఉన్నాయి.’ అనుకున్నారు ఇద్దరు. 

‘అయితే ఈ విషయం గురించి నేను మా పొందూరు బాబాయ్‌ని అడుగుతా’ అంది భారతి. ‘నేను మా ఖద్దరు మావయ్యను అడిగి తెలుసుకుంటా’ చెప్పింది స్వరాజ్యం. ఇంతలోనే పొందూరు బాబాయ్‌, ఖద్దరు మావయ్య అక్కడికి వచ్చారు. ‘అవును. ఆయన మీ ఇద్దరికే కాదు.. దేశంలోని వారందరికీ తాతయ్యే. పేరు మహాత్మా గాంధీ గుజరాత్‌లోని పోరుబందర్‌లో గాంధీ తాత జన్మించారు. శాంతి, అహింస ఆయుధాలుగా బ్రిటిష్‌ పాలకుల నుంచి భారతీయులకు స్వేచ్ఛా వాయువులు అందించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అందుకే ఆయన్ను జాతిపిత అంటారు’ అని బాబాయ్‌, మావయ్య చెప్పారు.

ఇంతలో స్వరాజ్యం, భారతి మిత్రులు అక్కడికి వచ్చారు. ‘దేశ ప్రజలను ఏకం చేసేందుకు మహాత్మా గాంధీ ఊరూరా తిరిగారు. వివిధ సందర్భాల్లో ఆయన బస చేసిన ప్రాంతాలకు అక్కడి ప్రజలు గాంధీ అని వచ్చేలా ఊరి పేర్లు మార్చుకున్నారు. ఆయా గ్రామాల్లోని మనుషుల పేర్లు కూడా ఖద్దరు స్వామి, పొందూరు దేవర, అహింసా రావు, సబర్మతి శర్మ, మహాత్మా గుప్తా, గాంధీ ఖాన్‌, సత్యాగ్రహం నాయుడు అనే ఉంటాయి. అంతెందుకు మన స్వరాజ్యం, భారతి పేర్లూ అలాగే వచ్చాయి’ అని అన్నారు. ‘గాంధీ తాత అందరి బంధువు ఎలా అయ్యారో తెలుసుకున్నారు కదా. మనమంతా ఆయన ఆశయాల సాధనకు కృషి చేద్దాం. అదే నిజమైన నివాళి’ అని బాబాయ్‌, మావయ్య ముగించారు. 

- మీగడ వీరభద్రస్వామి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని