దొంగ దొరికేశాడోచ్‌!

రామవరం అనే ఊరిలో రాజు వాళ్లది ధనవంతుల కుటుంబం. రాజు చాలా చురుకైనవాడు. జాలి, దయ ఉన్న మంచి బాలుడు. ఒకరోజు వాళ్ల అమ్మ, నాన్న బంధువుల ఇంటికి వెళ్లారు. ఇది గమనించిన దొంగ ఆ రోజు రాజు వాళ్లింట్లో దొంగతనం చేయాలని...

Published : 23 Apr 2021 00:35 IST

రామవరం అనే ఊరిలో రాజు వాళ్లది ధనవంతుల కుటుంబం. రాజు చాలా చురుకైనవాడు. జాలి, దయ ఉన్న మంచి బాలుడు. ఒకరోజు వాళ్ల అమ్మ, నాన్న బంధువుల ఇంటికి వెళ్లారు. ఇది గమనించిన దొంగ ఆ రోజు రాజు వాళ్లింట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒంట్లో బాలేదని రాజు వెళ్లలేదు. ఆ రోజు రాత్రి కాగానే దొంగ మెల్లగా రాజు వాళ్ల ఇంట్లోకి ప్రవేశించాడు.
రాజుకు దాహం వేసి అప్పుడే మెలకువ వచ్చింది. దొంగ రావడాన్ని గమనించి గొళ్లెం పెట్టాడు. అప్పుడు దొంగ ఇది గమనించి, తెలివిగా రాజుతో ‘బాబూ నేను దొంగను కాదు. నా బిడ్డకు జ్వరంగా ఉంది. మందులు కొనడానికి డబ్బులు లేక ఇలా దొంగతనానికి రావాల్సి వచ్చింది. నన్ను క్షమించు’ అని జాలి కలిగేలా మాట్లాడాడు. అలా అనగానే దయగల రాజు.. ‘ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దు. ఏదైనా పని చేసుకుని బతుకు. నీ బిడ్డకు మందులు కొనుక్కో’ అని కొంత డబ్బు ఇచ్చాడు. తన చేతికి డబ్బు దొరకడంతో రాజును ఏమీ చేయకుండానే దొంగ వెళ్లిపోయాడు.
వారం రోజుల తర్వాత వాళ్ల ఇంట్లో కరెంటు పోవడం వల్ల నిద్ర పట్టక రాజు చల్లగాలి కోసం బయట కూర్చున్నాడు. అప్పుడే ఆ దొంగ మళ్లీ రాజు వాళ్ల ఎదురుగా ఉన్న రాము వాళ్లింట్లోకి దొంగతనానికి వచ్చాడు. అది చూసి రాజు ఆ దొంగకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. తన స్నేహితుడైన రాము వాళ్ల నాన్నకు ఫోన్‌తో మెసేజ్‌ చేశాడు. రాము వాళ్ల అమ్మానాన్న రాజుకు ఫోన్‌ చేసి నెమ్మదిగా మాట్లాడారు.
‘నేను చెప్పినట్లు చేశారంటే దొంగను వెంటనే పట్టుకోవచ్చు’ అని రాజు వాళ్లతో చెప్పాడు. వాళ్లు సరే! అన్నారు. ‘మీరు వెంటనే కారం, కర్ర, తాడు సిద్ధం చేసుకోండి’ అని రాజు చెప్పాడు. వాళ్లు అలాగే చేశారు. ‘తర్వాత మీ ఇంట్లో ఉన్న బీరువా వెనక రామును కారం పట్టుకుని ఉండమనండి. మీరు అక్కడే కర్ర పట్టుకుని దాక్కోండి. దొంగ గదిలోకి రాగానే రాము దొంగ కళ్లలో కారాన్ని కొడతాడు. తర్వాత మీరు కర్రతో కొట్టి, వెంటనే తాడుతో కట్టేయండి’ అని ఉపాయం చెప్పాడు.
‘ఒకవేళ దొంగ తన బిడ్డకు జ్వరంగా ఉందని చెబితే నమ్మొద్దు, అవన్నీ కట్టుకథలు. ఇంతకు ముందు నాకూ అలాగే చెప్పి మోసం చేశాడు’ అని రాజు వాళ్లతో చెప్పాడు. ఈ లోపు పోలీసులకు ఫోన్‌ చేసి విషయం అంతా వివరించాడు.
దొంగ బీరువా దగ్గరకు రాగానే రాము, వాళ్ల అమ్మానాన్న రాజు చెప్పినట్లే చేశారు. ఈలోగా పోలీసులు రానే వచ్చారు. రాము, అతని అమ్మానాన్న, పోలీసులు అందరూ రాజును మెచ్చుకున్నారు. తెల్లారి పత్రికల్లో ‘దొంగ ఆట కట్టించిన రాజు’ అని వార్త కూడా వచ్చింది. చుట్టుపక్కల వారంతా రాజును ఎంతో మెచ్చుకున్నారు.

- పి.తనూజ్‌, ఏడో తరగతి, విజయనగరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు