Updated : 05 Sep 2021 00:33 IST

సామాన్యుడి సమస్య

ప్రహ్లాదపురంలో చిన్నడు ఎకరా భూమి ఉన్న రైతు. ఉన్న భూమినే నాలుగు భాగాలుగా చేసుకుని, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, వరి పండించుకునేవాడు చిన్నడు. చిన్నడి పొలంలో కాసిన ఆనప, గుమ్మడి కాయల్ని రాత్రిపూట ఎవరో పట్టుకుపోతున్నారు. గ్రామపెద్దకు దొంగతనం విషయం చెప్పాడు. చిన్నడిని చులకనగా చూసి ‘తప్పు నీదే, ఎకరా పొలాన్ని కూడా సరిగా చూసుకోలేవా? యాభై ఎకరాల భూమిని నేను చూసుకోవట్లేదా? ఇలా చిన్న చిన్న విషయాలు చెప్పి సమయం వృథా చెయ్యకు.. పో..పో..’ అని కసిరేశాడు గ్రామపెద్ద. చుట్టూ ఉన్న జనం నవ్వారు.

ఎలాగైనా తన పంట తానే కాపాడుకోవాలని రాత్రయ్యేసరికి పొలంగట్టు మీద మకాం వేశాడు. పక్కనే కర్ర, కారంపొడి సిద్ధంగా పెట్టుకున్నాడు. ఒక రోజు అర్ధరాత్రి పొలంలో చప్పుడైతే చిన్నడు మేలుకుని చూశాడు. ఇద్దరు దొంగలు గుమ్మడికాయలు కోసేస్తున్నారు. చిన్నడు ఒక పిడికిలిలో కారం, మరో చేత్తో దుడ్డుకర్ర పట్టుకుని చప్పుడు చెయ్యకుండా వాళ్ల దగ్గరకు వెళ్లాడు. వెనక నుంచి నడ్డిమీద కొట్టాడు. ఉలిక్కిపడిన దొంగలు తన వైపు తిరిగేసరికి వాళ్ల కంట్లో కారం కొట్టాడు. దొంగలు బయటకు పరిగెత్తారు. వాళ్లను ఎలాగైనా పట్టుకోవాలని వెంటబడ్డాడు చిన్నడు. కళ్లు మండుతున్నా అరిస్తే దొరికిపోతామని జాగ్రత్త పడ్డారు దొంగలు. నెమ్మదిగా గొడ్ల చావిడిలో దూరారు. అది గ్రామపెద్దదే. పశువుల కుడితి తొట్లో ఉన్న నీటితో మొహం కడుక్కుని బయటకు చూశారు దొంగలు. తమకోసం వెదుకుతున్న చిన్నడు కనిపించాడు వాళ్లకు.

ఇద్దరూ గేదెలు, ఆవుల తాళ్లు విప్పేసి తోకలు మెలిపెట్టి చిన్నడి వైపు తరిమారు. వాటి నుంచి పక్కకు తప్పుకుని పాకలోకి వెళ్లాడు చిన్నడు. అప్పటికే అక్కడి నుంచి తప్పించుకుని ఊళ్లోకి పరిగెత్తారు దొంగలు. పట్టు వదలక వాళ్లను వెంబడించాడు చిన్నడు. ఈ సారి దొంగలు ఒక ధాన్యం గిడ్డంగిలో దూరారు. అదీ గ్రామపెద్దదే. అక్కడికి చిన్నడు రావడం చూసిన దొంగలు వాడికి దొరక్కూడదనుకున్నారు. మళ్లీ పరుగు పెట్టబోయి, పక్కనున్న దీపపు బుడ్డిని అనుకోకుండా కాలితో తన్నారు. అది ఎగిరి పైకప్పునకు తగలడంతో గడ్డి అంటుకుని మంటలు లేచాయి. మంటల్ని చూసి చిన్నడు లోపలకు రాకుండా ఆగగానే ముసుగుల్ని తీసేసి మంటల్లోకి విసిరారు దొంగలు. మంటలార్పడానికి వచ్చిన వాళ్లలా నటిస్తూ గట్టిగా అరిచి అందర్నీ రమ్మన్నారు. మంటలు ఆర్పడానికి తెచ్చిన నీళ్లతో తమను శుభ్రం చేసుకున్నారు.

బిందెలతో నీళ్లను తెచ్చి మంటల్ని అదుపు చేశారు ఊరి ప్రజలు. అయినప్పటికీ గిడ్డంగి పై కప్పు కాలిపోయింది. ఊరంతా గోలపెడుతుంటే గ్రామపెద్ద నిద్రలేచి గిడ్డంగి దగ్గరకు వచ్చాడు. తెల్లారిన తర్వాత పొలం పనివాళ్లు వచ్చి ‘పశువుల పాకలో ఆవులు, దున్నపోతులు, గేదెలు పారిపోయాయి’ అని చెప్పారు. గ్రామపెద్ద భయపడుతూనే పొలానికి వెళ్లాడు. పశువులు లేవు. పైగా పంటల్ని ఇష్టం వచ్చినట్లు తొక్కి పాడుచేసి వెళ్లాయి. చిన్నడి మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఒక దొంగ గ్రామపెద్ద దగ్గరకు వెళ్లి ‘మంటల్ని మొదట చూసింది నేను. వాటిని ఆర్పడానికి వెళ్లేసరికి అక్కడ చిన్నడు కనిపించాడు. వాడే మంటపెట్టాడేమో’ అని అనుమానంగా అన్నాడు. చిన్నడిని పిలిపించాడు గ్రామపెద్ద.

ప్రజల ముందు నిలబెట్టి ‘ఏమి జరిగిందో చెప్పమని’ గట్టిగా అడిగాడు గ్రామపెద్ద. ‘నిన్న రాత్రి ఇద్దరు దొంగలు గుమ్మడి కాయలు కోస్తుంటే వెంటబడ్డాను. మీ పశువుల పాకలో దూరి పశువుల్ని విడిపించి నా మీదకు తోలారు. అటునుండటే వెళ్లి ధాన్యం గిడ్డంగిలో దూరారు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఇదంతా దొంగల పనే’ అన్నాడు చిన్నడు. గ్రామ పెద్ద చిన్నడి వైపు కొరకొరా చూసి ‘ఒక్కడివే దొంగల్ని పట్టేద్దామనే వెళ్లావా? మేమంతా లేమా?’ అన్నాడు కోపంగా. ‘మరేం చెయ్యమంటారు? ఇలాంటి చిన్న విషయాలు చెప్పొద్దని తమరే అన్నారుగా’ అనగానే గతుక్కుమన్నాడు గ్రామపెద్ద. అప్పుడు సానుకూలంగా స్పందించి ఉంటే ఇప్పుడు తనకు ఇంత నష్టం జరిగి ఉండేది కాదని అనుకుని మిన్నకుండిపోయాడు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని