చిట్టి... ఓ మంచి కాకి!

ఒక చిన్న అడవిలో చిట్టి అనే కాకి ఉండేది. ఒకరోజు దానికి అడవి బాట పక్కన పిచ్చిమొక్కల మధ్య బంగారుహారం  ఒకటి కనిపించింది. దాన్ని ముక్కుతో పట్టుకుని ఎగిరి చెట్టుమీద కూర్చుంది. ‘హారం.. తళతళ మెరిసిపోతూ ఎంత బాగుందో!’ అనుకుంది. అక్కడే ఉన్న మరో కాకి సాయంతో మెడలో వేసుకుంది.

Published : 18 Sep 2021 00:36 IST

క చిన్న అడవిలో చిట్టి అనే కాకి ఉండేది. ఒకరోజు దానికి అడవి బాట పక్కన పిచ్చిమొక్కల మధ్య బంగారుహారం  ఒకటి కనిపించింది. దాన్ని ముక్కుతో పట్టుకుని ఎగిరి చెట్టుమీద కూర్చుంది. ‘హారం.. తళతళ మెరిసిపోతూ ఎంత బాగుందో!’ అనుకుంది. అక్కడే ఉన్న మరో కాకి సాయంతో మెడలో వేసుకుంది.

‘హారం మెడలో ఉంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. అచ్చం పెళ్లికూతురిలా ఉన్నావు’ అంది ఓ కాకి. హారంతో ఉన్న చిట్టిని అన్ని కాకులకూ చూపాలని ఆ కాకి ‘కావ్‌.. కావ్‌..’ అని అరవసాగింది. కాకులన్నీ వచ్చి చుట్టూ చేరి.. చిట్టి, హారంలో మెరిసిపోతోందని ప్రశంసించాయి.

‘మీరన్నది నిజమే కావొచ్చు. కానీ ఈ హారం నాది కాదు కదా! పోగొట్టుకున్న వాళ్లు ఎంత బాధపడుతుంటారో? వారికి తిరిగి ఇవ్వాలి. కానీ ఈ హారం ఎవరిదో ఎలా తెలుస్తుంది?’ అంది చిట్టి. ‘పక్కపల్లెలో వాళ్లు పనుల మీద పట్నానికి ఈ దారి గుండా నడిచి వెళ్తుంటారు కదా! వారిలో ఎవరో పోగొట్టుకుని ఉంటారు. ఈ బాట వెంట ఎవరైనా హారాన్ని వెదుకుతున్నారేమో చూద్దాం’ అంది మరో కాకి. వెంటనే కాకులు ఎగురుతూ వెళ్లి దారి పొడవునా చూశాయి. ఎవరూ కనిపించలేదు.

‘ఈ హారాన్ని పోగొట్టుకున్నవారికి ఇవ్వడం ఎలా?’ దిగులుగా అంది చిట్టి. ‘నువ్వు ఇక్కడే ఉండు. అందరం ఆ పల్లెకెళ్లి ప్రతి ఇంటి దగ్గరా తిరిగి ఎవరు హారం గురించి మాట్లాకుంటూ దిగులుగా ఉంటారో గమనించి వస్తాం’ అంది పెద్ద కాకి. ‘ఆలోచన భలేగా ఉంది’ అనుకుంటూ కాకులన్నీ పల్లెకు బయలుదేరాయి. కొద్దిసేపటి తర్వాత ఒక కాకి పరుగున వచ్చి చిట్టితో ‘‘ఒక ఇంటిలో నందయ్య అనే అతను భార్యతో ‘హారం ఎక్కడ పడిపోయిందో తెలియడం లేదు. అడవిదారిలో అంతా వెదికాను. ఎక్కడా కనిపించలేదు’ అంటూ ఉంటే నేను విన్నాను. హారం పోగొట్టుకుంది కచ్చితంగా అతడే’ అని చెప్పింది.

వెంటనే చిట్టి, ఆ కాకి వెంట నందయ్య ఇంటికి వెళ్లింది. హారాన్ని అతడికి ఇచ్చింది. నందయ్య ఆనందంగా భార్యతో ‘దొరికిన సొమ్ము నిలవదంటారు. కానీ ఈ హారం మనది కాకున్నా.. నాకు దొరికిందైనా.. ఈ కాకి పుణ్యమా అని తిరిగి వచ్చింది చూడు’ అన్నాడు. ఇంతలో మరోకాకి చిట్టి అక్కడ ఉందని తెలిసి వచ్చింది. ‘‘ఒక ఇంటిలో మల్లన్న అనే అతను భార్యతో ‘‘ఇదంతా మన తలరాత. పిల్ల మెడలోని హారం ఎక్కడపడిపోయిందో! ఎంత వెదికినా కనిపించలేదు’ అంటూ ఉంటే నేను విన్నాను. వాళ్లపాప పుట్టిన రోజని మల్లన్న ఈ హారం ఆ పాప మెడలో వేశాడంట’ అంది.

చిట్టికి ఏం జరిగి ఉంటుందో అర్థమైంది. మల్లన్న కూతురు మెడలోని హారం ఎక్కడో పడిపోయింది. అది నందయ్యకు దొరికింది. హారాన్ని అమ్మడానికి పట్నానికి తీసుకెళుతూ అడవిదారిలో పోగొట్టుకున్నాడు. అది తనకు దొరికిందని చిట్టికి అర్థమైంది.

నందయ్య భార్య నందయ్యతో ‘నీ స్నేహితుడు మల్లన్న తన కూతురు హారం ఎక్కడో పడిపోయిందని, ఎవరికైనా దొరికిందా? అని ఊరందరినీ అడిగాడు. అది నీకు దొరికిందని చెప్పకుండా వెంటనే అమ్ముకునే ప్రయత్నం చేశావు. దొరికిన సొత్తు పోతేనే ఎంతో బాధపడిపోయావు. అడవి దారి వెంట వెదికావు. కష్టపడి సంపాదించుకున్న హారం కనపడకుంటే మల్లన్న ఎంత బాధపడతాడో అని నువ్వు ఏ మాత్రం ఆలోచించలేదు. కాకికి హారం దొరికితే ఎవరు పోగొట్టుకున్నారో తెలుసుకుని తీసుకొచ్చి నీకు ఇచ్చింది. ఆ కాకికున్న నిజాయతీ నీకు లేదాయె’ అంది.

కాకికి ఉన్న మంచితనం తనకు లేనందుకు నందయ్య సిగ్గుపడ్డాడు. వెంటనే నందయ్య హారాన్ని కాకికి ఇచ్చి నాలుగు ఇళ్ల ఆవల ఉన్న మల్లన్నకు ఇచ్చేయమని, ఈ విషయం అతనికి చెప్పొద్దని ప్రాధేయపడ్డాడు. చిట్టి సంతోషంగా హారంతో మల్లన్న ఇంటివైపు ఎగురుకుంటూ పోయింది.

- డి.కె.చదువుల బాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని