పిసినారి నేర్పిన లోకజ్ఞానం!

గోపయ్య పిసినారిగా ఆ ఊళ్లో పేరు.  గోపయ్య కొడుకు గోవిందుడికి పదేళ్ల వయసు వచ్చింది. అయినా గోవిందుణ్ని పాఠశాలకు పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచేశాడు. గోపయ్య భార్య సుమతి మాత్రం గోవిందుడిది చదువుకొనే వయసు, లోకజ్ఞానంతో పాటు బతుకుదెరువు కోసమైనా పాఠశాలకు పంపించడం శ్రేయస్కరం అంటూ నెత్తీ నోరు కొట్టుకుంటూ గోపయ్యకు చెబుతుండేది.

Published : 21 Sep 2021 00:40 IST

గోపయ్య పిసినారిగా ఆ ఊళ్లో పేరు.  గోపయ్య కొడుకు గోవిందుడికి పదేళ్ల వయసు వచ్చింది. అయినా గోవిందుణ్ని పాఠశాలకు పంపించకుండా ఇంటి దగ్గరే ఉంచేశాడు. గోపయ్య భార్య సుమతి మాత్రం గోవిందుడిది చదువుకొనే వయసు, లోకజ్ఞానంతో పాటు బతుకుదెరువు కోసమైనా పాఠశాలకు పంపించడం శ్రేయస్కరం అంటూ నెత్తీ నోరు కొట్టుకుంటూ గోపయ్యకు చెబుతుండేది.

‘పాఠశాలకు పంపితే గోవిందుడికి స్నేహితులు పెరుగుతారు. వారి సావాసంతో జల్సాలు నేర్చుకొని ఖర్చులకు అలవాటు పడతాడు. చదువు చెప్పించి ఉన్నది కరగదీసుకుంటామా? లోకజ్ఞానం ఎలా నేర్పాలో, బతుకుదెరువుకు దారి ఎలా చూపించాలో నాకు తెలుసు’ అంటూ భార్య నోరు మూయించేవాడు గోపయ్య. చేసేది లేక సుమతి మౌనంగా ఉండిపోయేది. తనతో పాటు గోవిందుణ్ని తిప్పుతూ పీనాసి సలహాలను, ఖర్చుకాని పనులను నేర్పుతూ లోకజ్ఞానానికి దారులు వేస్తున్నట్టు సంతృప్తి పడుతుండేవాడు గోపయ్య.

రోజులు గడుస్తున్నాయి. వర్షాకాలం పూర్తవ్వడంతో తన దగ్గరున్న రెయిన్‌ కోటును గోవిందుడికి చూపిస్తూ  ‘సాయంత్రం అయ్యేసరికి శుభ్రం చేసి మడత వేసి ఉంచు. వచ్చే సంవత్సరానికి ఇది పనికి వస్తుంది’ అని చెప్పి పొలం పనికి వెళ్లిపోయాడు గోపయ్య. సాయంత్రమైంది. గోపయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో నుంచి మాడు వాసన రావడం గమనించాడు. లోపలికి వెళ్లి చూసేసరికి గోవిందుడు రెయిన్‌ కోటును ఇస్త్రీ చేస్తూ కనిపించాడు. తుళ్లిపడ్డాడు గోపయ్య. గోవిందుణ్ని అడ్డుకొని రెయిన్‌ కోటును చూశాడు. అప్పటికే సగం కాలి ఎందుకూ పనికి రాకుండా పోయింది. గోవిందుణ్ని మందలిస్తూ చిందులేశాడు గోపయ్య. ‘నువ్వు చెప్పిన పనే చేశాను. చేతి మడత కన్నా ఇస్త్రీ బాగుంటుందని అనుకున్నాను’ అంటూ తండ్రి నోటికి తాళం వేశాడు.

కొద్ది రోజులు పోయాక.. గోపయ్య దగ్గరున్న ఓ ఐదువందల నోటు కొంతమేర చిరిగిపోయింది. దానిని చెల్లేట్లు చేసే పనిలో పడ్డ గోపయ్య, కొడుకును పిలిచి ఈ నోటు చిరుగు కనిపించకుండా అంటించుకురా అని, పని అప్పగించాడు. గోవిందుడు ఆ నోటు తీసుకొని గడప నుంచి లోపలికి వెళ్లాడు. కొద్దిసేపటికి కాలిన నోటుతో తండ్రి ముందు ప్రత్యక్షమయ్యాడు. దాన్ని చూసి గోపయ్య శివాలెత్తి గోవిందుడికి చీవాట్లు పెట్టాడు. గోవిందుడుకి కోపం వచ్చింది. ‘మీరన్నట్లు నోటు చిరుగు కనిపించకుండా అంటించుకొచ్చాను’ అంటూ తప్పు నాదికాదన్నట్లు మాట్లాడాడు. కొడుకు మాటలకు గోపయ్య కంగుతిన్నాడు. అప్పటి నుంచి కొడుకును ఒక కంట కనిపెడుతూ సూచనలు చేయడం ప్రారంభించాడు.

ఒకరోజు గోపయ్య విపరీతమైన జ్వరంతో బాధ పడుతున్నాడు. సుమతి సపర్యలు చేస్తూ గోపయ్యకు టీ అందించింది. అది బాగా వేడిగా ఉండడం వల్ల తాగలేక చల్లార్చమని అడిగాడు గోపయ్య. సుమతి పాత్రతో చల్లటినీరు తెమ్మని గోవిందునికి చెప్పింది. కొడుకు తెచ్చిన చల్లటి నీటిలో వేడి టీ గ్లాసును పూర్తిగా మునగకుండా ఉంచింది. కొద్దిసేపటికి టీ వేడి తగ్గడంతో గోపయ్యకిచ్చింది. గోపయ్య టీ తాగేలోపు గోవిందుడు పెద్ద తాడు పట్టుకొచ్చి ‘అమ్మా.. నాన్న ఒంట్లో వేడి తగ్గడానికి మెడకు తాడు కట్టి నూతిలో దించుదామా’ అని అడిగాడు. గోపయ్య గతుక్కుమన్నాడు. ‘సుమతీ! గోవిందుడి మాటలు విన్నావా!’ బిక్కచచ్చిపోతూ అడిగాడు. ‘విన్నాను. మీరు నేర్పిన లోకజ్ఞానమే కదా!’ అని దెప్పిపొడిచింది సుమతి.

పిసినారితనం పేరుతో తను నేర్పిన లోకజ్ఞానం ఎందుకూ పనికిరాలేదని అర్థమైంది గోపయ్యకు. కొడుకు ప్రవర్తనలో మార్పురాకపోతే మూర్ఖుడిగా మారే ప్రమాదముందని గుర్తించాడు. చివరకు పాఠశాలకు పంపి గోవిందుణ్ని మార్చాలన్న నిర్ణయానికి వచ్చాడు.

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని