Published : 08 Oct 2021 00:23 IST

అమ్మ చూపిన దారి!

మార్జాల వనములో ఒక పిల్లికి మూడు పిల్లలున్నాయి. ఒకటి తెల్ల పిల్లి, రెండోది చారల పిల్లి, మూడోది నల్ల పిల్లి. తెల్ల పిల్లి, చారల పిల్లి ఎప్పుడూ నల్ల పిల్లి రంగుని ఎగతాళి చేస్తూ చిన్న చూపు చూసేవి. తల్లి పిల్లి రెండింటినీ మందలించేది. ‘అలా సోదరుని ఎగతాళి చేయకూడదు’ అని. అయినా తెల్ల పిల్లి, చారల పిల్లి వినిపించుకునేవి కావు.

తల్లి ఎంత చెప్పినా ఎగతాళి చేయడం మానేవి కావు. నల్ల పిల్లిని అవి ఎంత ఎగతాళి చేసినా అది మాత్రం వాటిని ఏమీ అనేది కాదు. కాస్త దిగులు పడేది అంతే!

తాను తెల్లగా ఉండి చాలా అందంగా ఉంటానని, తెల్ల పిల్లి గర్వంగా మిగతా పిల్లులతో చెప్పుకొనేది. చారల పిల్లి కూడా తన శరీరం మీద చారలు ఉండటంతో మరింత అందంగా కనిపిస్తానని చెప్పుకొనేది. నల్ల పిల్లి మాత్రం అందరితో చక్కగా కలిసిపోయి ఆడుకునేది.

ఒకరోజు తల్లి బంధువుల ఇంట్లో జరిగే వేడుకకు బయలుదేరుతూ తన ముగ్గురు పిల్లలను తయారవ్వమంది. అయితే తెల్ల పిల్లి, చారల పిల్లి.. ‘నల్ల పిల్లి వస్తే మేము రామని, మాకు నామోషీగా ఉంటుంద’ని తల్లితో వాదన చేశాయి. అప్పుడు తల్లి పిల్లి ‘అలా తప్పు.. అందరం కలిసి వెళ్దాం’ అంది. అయినా అవి వినలేదు.

‘మేము ఇద్దరం ముందుగా వెళ్తాం, తర్వాత మీరు రండి’ అంటూ చక్కగా ముస్తాబయి బయలుదేరి బంధువుల ఇంటికి వెళ్లాయి. అవి వెళ్లిన తర్వాత తల్లి పిల్లి, నల్ల పిల్లి బయలుదేరాయి. తెల్ల పిల్లి, చారల పిల్లి అందంగా తయారై బంధువుల ఇంటికి వెళ్లినప్పటికీ అక్కడ ఉన్న మిగతా పిల్లులు వీటిని కనీసం పలకరించలేదు. వాటి క్షేమ సమాచారాలు కూడా అడగలేదు. కొన్ని పిల్లులు మొహమాటానికి పలకరించినా తల్లి పిల్లి, నల్ల పిల్లి గురించే అడిగాయి.

‘వచ్చిన మన గురించి కాక, ఇంకా ఇక్కడికి రాని నల్ల పిల్లి గురించి అందరూ అడుగుతున్నారు’ అని అవి మనసులో ఉడికిపోయాయి. ఇంతలో తల్లి పిల్లి, నల్ల పిల్లి వేడుకకు వచ్చాయి. మిగతా పిల్లులు తల్లి పిల్లి, నల్ల పిల్లిని సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా పలకరించి క్షేమ సమాచారాలు కనుక్కున్నాయి. నల్ల పిల్లితో అందరూ చక్కగా కబుర్లు చెప్పడం, కాలక్షేపం చేయడం చూసి తెల్ల పిల్లి, చారల పిల్లికి ఏడుపు వచ్చేసింది.

తల్లి దగ్గరకు పోయి ‘మేము ఎంత చక్కగా ముస్తాబై వచ్చినా, మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ నల్ల పిల్లిని మాత్రం సాదరంగా ఆహ్వానించి, అన్ని పిల్లులు దాని చుట్టూ చేరి, కబుర్లు చెబుతున్నాయి’ అంటూ బాధపడ్డాయి.

అప్పుడు తల్లి పిల్లి, ఇద్దరినీ ఓదార్చుతూ ‘బిడ్డలారా! రంగులో అందం లేదు. ఇతరులతో మనం ప్రవర్తించే తీరే మనకు గౌరవ మర్యాదలు తెచ్చిపెడుతుంది. నల్ల పిల్లి అందరితో సఖ్యతగా ఉంటూ తన మంచి గుణముతో అందరి మనసులో స్థానం సంపాదించుకుంది. మీరు మాత్రం అందంగా ఉన్నామని గర్వంతో అందరినీ చిన్న చూపు చూస్తూ ఉంటే, వారంతా మీకు ఎలా దగ్గరవుతారు? తప్పు మీలో ఉంది. దాన్ని సరిదిద్దుకుంటే అందరితో ఆనందంగా గడపొచ్చు. రంగు చూసి మనతో ఎవరూ స్నేహం చేయరు. మన మంచి గుణం చూసి స్నేహం చేస్తారు’ అని హితబోధ చేసింది. తెల్ల పిల్లి, చారల పిల్లి తమ తప్పును తెలుసుకుని ‘అలాగే అమ్మా! ఇక మీదట అందరితో కలిసి మెలిసి ఉంటూ, మర్యాదగా ప్రవర్తిస్తాం’ అని తల్లికి మాట ఇచ్చి.. ఆ రోజు నుంచి నల్ల పిల్లితోనూ, మిగతా పిల్లులతో స్నేహంగా నడుచుకుంటూ, కలిసి చక్కగా ఆడుకుంటూ ఆనందంగా గడపసాగాయి. తమ పిల్లల్లో వచ్చిన మార్పును గమనించి తల్లి పిల్లి ఎంతో ఆనంద పడింది.

- మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని