ఎవరి గొప్ప వారిది!

అడవిలో మేకల మందకు తోడుగా వెళ్లింది ఓ కుక్క. మేకలన్నీ మేత మేస్తున్న సమయంలో, కుక్కకు అడవంతా చూడాలన్న కుతూహలం కలిగింది. కొంతదూరం పోయాక దారిలో నక్క ఎదురైంది. కుక్కను చూసిన నక్క.. ‘ఈ అడవిలో నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ నుంచి వస్తున్నావేంటి?’ అని అడిగింది.

Published : 28 Nov 2021 01:29 IST

అడవిలో మేకల మందకు తోడుగా వెళ్లింది ఓ కుక్క. మేకలన్నీ మేత మేస్తున్న సమయంలో, కుక్కకు అడవంతా చూడాలన్న కుతూహలం కలిగింది. కొంతదూరం పోయాక దారిలో నక్క ఎదురైంది. కుక్కను చూసిన నక్క.. ‘ఈ అడవిలో నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఎక్కడ నుంచి వస్తున్నావేంటి?’ అని అడిగింది.
‘ఈ పక్కనే ఉన్న గ్రామం మాది. మేకల మందకు కాపలాగా ఉంటూ, యజమాని అభిమానాన్ని సొంతం చేసుకున్న జంతువును నేను. అడవిని చూడాలన్న కోరికతో ఇదిగో ఇలా వచ్చాను. నన్ను గ్రామ సింహమనీ పిలుస్తారు’ అని గర్వంగా చెప్పుకొంది కుక్క.
నక్క కూడా ఏమీ తక్కువ తినలేదు. ‘తెలివితేటల్లో మేటి అని.. ఈ అడవి జంతువులన్నీ నన్ను పొగుడుతుంటాయి. మృగరాజు కూడా నా మంత్రాంగాన్ని మెచ్చుకుంటుంది’ అంటూ గొప్పతనాన్ని డప్పు కొట్టుకుంటూ చెప్పింది. అక్కడితో ఆగకుండా.. ‘నువ్వు గ్రామ సింహానివి, మా మృగరాజు అడవి సింహం.. మీ ఇద్దరూ ఒక్కటే. మీ మధ్య ఏదైనా చుట్టరికం ఉందంటావా?’ అని ఆశ్చర్యపోతూ అడిగింది నక్క.
‘ఏమో! చాలాకాలం కిందట మా వంశీయులు అడవిని విడిచి గ్రామాలకు వలస వచ్చారని మా పూర్వీకులు చెబుతుండేవారు’ అని గొప్పగా చెప్పుకుంది కుక్క. ‘జంతువులకు ప్రధాన శత్రువు మానవుడు. కానీ మీ విషయంలో మాత్రం ఇంత సానుకూలంగా ఉండటానికి కారణమేంటి?’ అనుమానంతో అడిగింది నక్క. ‘విశ్వాసం మా ఊపిరి. కాపు కాసే తీరులో మా ప్రాణాలను కూడా లెక్క చేయం. అందుకే మానవులు పెంపుడు జంతువులుగా మమ్మల్ని సాకుతుంటారు’ నిజాన్ని చెప్పింది కుక్క.
‘పెంపుడు జంతువులకు మానవులు రాజ లాంఛనాలు సమకూరుస్తారట నిజమేనా?’ మరో అనుమానాన్ని బయటపెట్టింది నక్క. ‘మానవుల పెంపకం తీరులో మా తిండికి కొదవుండదు. వాళ్ల విందుల్లో మాకు కూడా వాటా ఉంటుంది’ వివరంగా చెప్పింది కుక్క. ‘అదృష్టమంటే మీదేలా ఉంది. అదే మానవులు మమ్మల్ని చూస్తేనా.. విరుచుకుపడతారు’ కొంత అసహనంగా చెప్పింది నక్క. ‘సేవతో మనుషుల్ని మెప్పిస్తే ఆదరిస్తారు. బుద్ధి వంకరైతే బడితె పూజ చేస్తారు. అది వాళ్ల నైజం’ అని చెప్పింది కుక్క. నక్కకు ఒళ్లు మండింది. తనను ఉద్దేశించే కుక్క ఆ మాటలంటోంది అనుకుంది అది. కుక్క తిక్క కుదర్చాలనుకుంది. ‘గ్రామసింహమా! మా సింహాన్ని చూసి, ఆతిథ్యం స్వీకరించి వెళ్లు’ అంటూ కుక్కను ఉత్సాహపరిచే ప్రయత్నం చేసింది నక్క. నిజమే అనుకుని కుక్క ‘సరే’ అంది.
తర్వాత కుక్కను సింహం దగ్గరకు తీసుకువెళ్లింది. ‘మృగరాజా! మన అడవికి వచ్చిన అతిథి. గ్రామసింహంగా మనుషుల ఆదరాభిమానాలు పొందిన జంతువు. బలంలో మీకు పోటీ ఇవ్వగల శక్తిమంతురాలు. మీ నోటికి ఫలహారంగా తెచ్చాను. స్వీకరించండి’ నవ్వుకుంటూ చెప్పింది నక్క. మృగరాజు కోపంతో కుక్కవైపు చూసింది.
కుక్క ఒక్కసారిగా అవాక్కైంది. ‘మృగరాజా! ఎవరి బలం వాళ్లది. మిమ్మల్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’ అని చెబుతూ సింహం కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది కుక్క.
‘నాలా నీకు దృఢమైన శరీరం లేదు. ఎందులో నీ బలం గొప్పదో చెప్పు?’ ఘాటుగా ప్రశ్నించింది సింహం. కుక్క ఆలోచనలో పడింది. ‘మృగరాజా! నా తోక వంకరను సరి చేయగలిగితే.. నేను ఓటమిని అంగీకరిస్తాను. మనస్ఫూర్తిగా మీ నోటికి ఫలహారమైపోతాను’ అని అంది కుక్క.
‘ఆ పనికి మా మృగరాజు వరకూ ఎందుకు? నేను సరిపోతాను’ అంటూ కుక్క తోకను సరిచేయడం ప్రారంభించింది నక్క. కానీ ఎంత ప్రయత్నించినా సరి చేయలేక పోయింది.
కాసేపటికి సింహం ప్రయత్నించింది. కానీ వంకరపోలేదు. సింహం, కుక్క వైపు ఆశ్చర్యంగా చూసింది. నక్క కూడా నమ్మలేకపోయింది. ‘మృగరాజా! ఇదే నా బలం, బలహీనత! కుక్క తోక వంకర అన్నది వాస్తవం. మీ బలం ముందు నా బలం దిగదుడుపే! మీరు అనుమతి ఇస్తే నా దారిన నేను పోతాను. పైగా నేను మీ అతిథిని. అతిథికి హాని చేయడం రాజ లక్షణం కాదు’ అని అంది కుక్క. ‘ఆపద సమయంలో బలహీనతను బలంగా మార్చుకున్న నీ తెలివిని మెచ్చుకుంటున్నాను. ఎవరి గొప్పతనం వాళ్లదని నిరూపించావు. నిన్ను నా మిత్రుడిగా అంగీకరిస్తున్నాను’ అంటూ.. ఏ హానీ చేయకుండా కుక్కను విడిచిపెట్టింది సింహం.

- బి.వి. పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని