Updated : 23 Mar 2022 00:25 IST

కవల పిల్లలు!

‘అత్తా!’ అనే పిలుపు వినిపించేసరికి వెనక్కి తిరిగి చూసింది సుశీల. అక్కడ ఇద్దరు బుజ్జి పాపలు ఆడుకుంటూ కనిపించారు. ఇద్దరూ ఒకే రకమైన దుస్తులు వేసుకున్నారు. ఒకేలాంటి అలంకరణ చేసినట్టున్నారు. కవల పిల్లలని ఇట్టే తెలిసిపోతుంది ఎవరికైనా. చూడడానికి ఎంతో ముద్దొస్తున్నారు.

పార్కులో ఎంతోమంది పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్లంతా ఎవరి ధ్యాసలో వారున్నారు. ఈ కవలల దగ్గర మాత్రం ఎవరూ లేరు. ఆ ఇద్దరినీ చూసి ముచ్చటపడిన సుశీల వారి దగ్గరకు వెళ్లింది. ‘మీరు నన్ను పిలిచారా పాపా?’ అని అడిగింది. ‘ఊఁ.. హుఁ..’ అంటూ ఇద్దరూ ఒకేసారి అడ్డంగా తలూపారు. ‘‘మీ ఇద్దరిలో ఎవరో ‘అత్తా!’ అని పిలిచారిప్పుడు’’ రెట్టించి అడిగింది సుశీల. ఆ మాటకు ఆ ఇద్దరిలో ఒక పాప ‘అట్ట’ అంది రెండో పాప వైపు వేలు చూపిస్తూ. 

‘అట్ట’ ఏమిటంటూ అర్థం కాక అడిగింది సుశీల. ‘అత్త..’ ఆ మాత్రం తెలియదా?.. అన్నట్టు ముఖం పెట్టి వివరణ ఇచ్చేదానిలా అంది రెండో పాప. అర్థం కాకపోయినా వారి మాటలు ముద్దొస్తుండటంతో కాసేపు మాట్లాడాలనిపించి.. ‘మీలో ఎవరు పెద్ద?’ అని అడిగిందామె. ‘అట్ట’ అని ఒక పాపను చూపింది మరో పాప. వెంటనే రెండో పాప.. మొదటి పాప వైపు వేలు చూపిస్తూ ‘అత్త’ అంది. ఏది అడిగినా ‘అత్త’, ‘అట్ట’ అని జవాబిస్తుండే సరికి వాళ్లు చెప్పేది అర్థం కాలేదు సుశీలకు.

అయినా, అడిగిన ప్రశ్నలకు టూకీగా వాళ్లు జవాబు ఇచ్చే తీరూ.. వారి కళ్లూ, నోరూ, చేతులూ తిప్పే విధానం చూసి ముచ్చటేసింది. ‘ఈ కవలలతో ఇంకాసేపు మాట్లాడితే జవాబు తెలుస్తుందేమో!’ అనిపించిందామెకు. అందుకే మాటలు పొడిగిస్తూ.. వారిలో ఒక పాపను ‘నీ పేరు ఏమిటి?’ అని అడిగింది. ‘అప్పన్న’ అని జవాబు ఇచ్చిందా పాప. రెండో పాపను కూడా అడిగితే.. ‘అప్పన్న’ అనే చెప్పింది.

‘కవల పిల్లలకు ఒకే రకమైన దుస్తులు వేయడం, ఒకే రకంగా అలంకరణ చేయడం, ఒకేలాంటి వస్తువులు కొనిపెట్టడం విన్నాను గానీ.. ఇలా ఒకే పేరు పెట్టడమూ, అందులోనూ ఆడ పిల్లలకు మగవారి పేరు ఏంటబ్బా?’ అని మనసులోనే అనుకుంది సుశీల. అందుకే, ఎందుకైనా మంచిదని మరోసారి రెట్టించి అడిగింది. వారిద్దరూ మళ్లీ అదే జవాబు ఇచ్చారు.

తల్లిదండ్రుల పేర్లను బట్టి పిల్లలవీ ఉంటాయనిపించి.. ఈసారి ‘మీ నాన్న గారి పేరు ఏమిటి?’ అని అడిగింది ఒక పాపను. సుశీల వేసిన ప్రశ్నకు ఆ పాప ‘అప్పన్న’ అని జవాబు ఇచ్చింది. ఈసారి మరింత ఆశ్చర్యపోయినా.. కుతూహలంతో ‘మీ అమ్మ పేరు ఏమిటి?’ అని అడిగింది. మొదటి పాప జవాబు ఇచ్చేలోగానే, ఇంకో పాప అందుకుని ‘అప్పన్న’ అని చెప్పింది. సుశీలకు మతిపోయినంత పని అయింది. ‘‘మాటలు రావేమో అనుకుంటే.. చక్కగా మాట్లాడుతున్నారు. కానీ, అందరి పేర్లూ ‘అప్పన్న’ అనే చెబుతున్నారు. ఇందులో ఏదో మతలబు ఉన్నట్టుంది’’ అని అనిపించిందామెకు.

ఆఖరి ప్రయత్నంగా ఈసారి ‘మీ అమ్మ ఎక్కడ ఉంది?’ అని అడిగింది సుశీల. వాళ్లిద్దరూ ఎదురుగా వస్తున్న ఓ మహిళ వైపు చూపించారు. ఆవిడ దగ్గరకు వస్తూనే పలకరింతగా నవ్వింది. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత తన ప్రశ్నలకు పిల్లలు ఇచ్చిన జవాబులూ.. అది విని తనకు వచ్చిన అనుమానాలనూ ఆవిడతో చెప్పింది.

సుశీల మాటలకు ఆ తల్లి నవ్వుతూ ‘‘వారు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నారండీ. అందుకే మీకా తికమక కలిగింది. వాళ్లిద్దరూ ఒకరినొకరు ‘అక్క’ అనే పిలుచుకుంటారు. కాకపోతే పలకడం సరిగా రాక ‘అత్త’ అని ఒకరూ.. ‘అట్ట’ అని మరొకరూ అంటుంటారు’ అని వివరించిందామె. వస్తున్న నవ్వును ఆపుకుంటూ ‘‘మరి ఈ ‘అప్పన్న’ మిస్టరీ ఏమిటి?’’ అని ఉత్సాహంగా అడిగింది సుశీల. వారిద్దరిలో ఒకరి పేరు ‘అపర్ణ’, మరొకరి పేరు ‘అర్పణ’. పలకడం సరిగా రాక అలా చెబుతుంటారని జవాబు ఇచ్చిందామె.

అది విన్న సుశీల ‘‘మరి మీది, మీవారి పేర్లు కూడా ‘అప్పన్న’ అనే చెబుతున్నారు. అందులో ఉన్న మతలబు ఏంటో కూడా చెప్పేయండి’’ అడిగింది నవ్వుతూ. ‘మా ఆయన పేరు అప్పల నరసింహం. నాపేరు అర్చన. పనిలో పనిగా మా పేర్లు కూడా అలాగే చెప్పేస్తుంటారు వీళ్లు’ అని పిల్లలను దగ్గరకు తీసుకుంటూ బదులిచ్చిందామె. పొట్ట చెక్కలయ్యేలా నవ్వడం సుశీల వంతయింది. 

- ఆదిత్య కార్తికేయ


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని