Published : 03 May 2022 00:41 IST

వేసవా... మజాకా!

ది వేసవి.. ఎండలు మండుతున్నాయి. సూర్యోదయం అయిన కొద్ది సమయానికే.. ఎండకు భయపడిన సింహం, ఆశకు పోకుండా, దొరికిన చిన్న జంతువును వేటాడి కడుపు నింపుకొంది. తరువాత విశ్రమించడానికి గుహకు చేరుకుంది. సమయం గడుస్తున్న కొద్దీ భూమి వేడెక్కడం వల్ల గుహలో ఉన్న సింహానికి ఉక్కపోత ప్రారంభమైంది.

దీంతో చెట్టు నీడన చేరి సేద తీరాలనుకుంది. బయటకు వచ్చి చూసింది. నిప్పుల వాన కురుస్తున్నట్లు ఎండ తీవ్రంగా ఉంది. వేడెక్కిన భూమిపై అడుగులు వేయడానికి తన కాళ్లు ముందుకు కదలడం లేదు. రాలిన ఆకుల మీద అడుగులు వేసుకుంటూ... పెద్ద మామిడి చెట్టు నీడన చేరింది. సేద తీరేందుకు కూర్చుంది. చెట్టురెమ్మలు ఊగుతూ గాలిని అందిస్తున్నాయి. తన్మయత్వంతో సింహం మైమరచి పోయింది. కొంత సేపటికి నిద్రలోకి జారుకుంది.

ఇంతలో నక్క.. ఆహారం కోసం తిరుగుతూ అటు వైపు వచ్చింది. నిద్రపోతున్న సింహాన్ని చూసింది. దాన్ని ఎలాగైనా మెప్పించి ఆహారాన్ని సంపాదించాలనుకుంది. సింహాన్ని మేల్కొలిపే ధైర్యం లేక, అది ఎప్పుడు నిద్ర లేస్తుందా.. అని ఎదురు చూస్తూ కూర్చుంది. అదే సమయంలో వడ గాలులు ప్రారంభమయ్యాయి. చెట్టు పైన ఉన్న కాయలు  కనిపించాయి. ఒకటి సింహంపై రాలిపడితే బాగుండు అనుకుంది. అంతే కొన్ని కాయలు రాలాయి. అందులో ఒకటి సింహంపై పడింది. నిద్రాభంగమైన సింహం కోపంతో చుట్టూ చూసింది. నక్క కనిపించడంతో ఏమి జరిగిందంటూ గర్జించింది. ‘మృగరాజా! మీ నిద్రాభంగానికి కారణం చెట్టు పై నుంచి పడిన ఈ కాయే’ అని రుజువు చూపించింది నక్క. బంగారంలాంటి నిద్ర పాడైందని సింహం వాపోయింది.

ఇదే అదనుగా.. ‘కాలాలన్నింటిలోనూ వేసవంటే నాకు భలే చిరాకు. నివాసంలో ఉందామంటే ఉక్కపోత, బయట తిరుగుదామంటే ఎండదెబ్బ. పోనీ, చెట్టు నీడన విశ్రమిద్దామంటే ఇలాంటి కాయల దెబ్బలు’ అంటూ పెదవి విరిచింది నక్క. ‘రుతు ధర్మం గొప్పది. ఏ రుతువులో జరగాల్సింది, ఆ రుతువులో జరిగితేనే ప్రకృతి నిలుస్తుంది’ అంటూ నక్క మాటలను తోసిపుచ్చింది సింహం. కాస్త దూరంలో ఉన్న మర్రి చెట్టు నీడకు వెళ్లింది. నక్కకు ఒళ్లు మండినా, చేసేది లేక సింహం వెంట కదిలింది. ఎత్తు పారక పోవడంతో కొద్దిసేపు కబుర్లు చెప్పింది. తరువాత నక్క మళ్లీ తన తెలివితేటలకు పదును పెట్టింది. సింహం ఆలోచనా మార్గంలోనే మరో ఎత్తు వేసింది. ‘మీరు చెప్పినట్లు రుతుధర్మం గొప్పదే! ఇలా చెట్ల నీడన కాలక్షేపం చేసేకన్నా, వేసవి తాపం తీరడానికి ప్రకృతి ప్రసాదించిన మరో వరాన్ని మనం వినియోగించుకుంటే బాగుంటుంది’ అంది నక్క.

‘ఏమిటది?’ ఆసక్తిగా అడిగింది సింహం. వేసవి తాపం తీరాలంటే జలక్రీడలకు మించిన మార్గం ఇంకోటి లేదు. ఏటి ఒడ్డుకు పోతే హాయిగా ఉపశమనం పొందవచ్చు. అక్కడ నీటిలో సేద తీరే జంతువులను వేటాడి విందు చేసుకోవచ్చు. ఇక్కడే ఉండి కాయదెబ్బలు తినే కన్నా అదే మేలనిపిస్తుంది. వినోదం, కడుపు నింపుకోవడం ఒకేసారి జరిగిపోతాయి’  అంటూ సింహాన్ని ఉత్సాహపరిచింది నక్క.

సింహం కూడా... ఇక చెట్ల కింద ఉండడం శ్రేయస్కరం కాదనుకుని జూలు విదిలించి నిలబడింది. ఒక్కసారిగా మబ్బులు కమ్మాయి. ఎండ తీవ్రత తగ్గింది. నక్క చెప్పినదానికి సింహం కూడా సిద్ధపడింది. రెండూ ఏటి వైపు అడుగులు వేశాయి. ఒడ్డుకు చేరుకున్నాయి. వేసవి తీవ్రత వల్ల ఊటలు తగ్గి అక్కడక్కడ చిన్నచిన్న నీటి జాడలు కనిపించాయి. ఇసుకలో అడుగులు భారంగా పడుతున్నాయి. సింహం అలికిడి విని సేదతీరుతున్న జంతువులు ఆవలి ఒడ్డుకు పరుగులు తీశాయి.

ఒక్కసారిగా పెద్ద పెద్ద చినుకులు రాలాయి. తర్వాత వడగండ్ల వాన ప్రారంభమైంది. పాపం రెండింటికీ అది దెబ్బల వర్షమైంది. పరుగు పెడదామంటే ఇసుక దారి అనుకూలంగా లేకపోవడంతో అడుగులు తడబడ్డాయి. వడగండ్ల దెబ్బల నుంచి తప్పించుకోలేక పోయాయి.

‘వీటి కన్నా చెట్ల కాయల దెబ్బలే కాస్త నయం’ అంటూ ఆపసోపాలు పడింది సింహం. ఇక నక్కైతే కుయ్యో మొర్రో అంటూ బాధతో రాగాలందుకుంది. సింహానికి కోపం వచ్చింది. ‘నీ వల్లే ఇదంతా జరిగింది’ అంటూ నక్కపై చిందులు వేసింది. ‘తప్పైపోయింది మహాప్రభో!’ అంటూ అది లెంపలేసుకుంది. వేసవి మంచి తంటానే తెచ్చిందని మనసులో అనుకొని ఉసూరుమంటూ కదిలింది నక్క.

- బి.వి.పట్నాయక్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని