తాతయ్య నేర్పిన పాఠం!
పూర్వం షెట్టిపల్లి గ్రామంలో కొండయ్య అనే భూస్వామి ఉండేవాడు. బాగా ధనవంతుడు. గ్రామంతోపాటు చుట్టుపక్కల పల్లెల పరిధిలో ఆయనకు వందలాది ఎకరాలు ఉండేవి. కూలీలు, వ్యవసాయ పనులతో ఆ పొలాలెప్పుడూ కళకళలాడేవి. నీటి వసతి కూడా బాగుండటంతో మూడు పంటలు పండించేవారు. కొండయ్య మనసు కూడా మంచిది కావడంతో.. ఆపదలో ఉన్నవాళ్లంతా ఆ ఇంటి గడపే తొక్కుతుండేవారు. అడిగిన వారికి సాయం చేస్తూ.. ధనంతోపాటు దానంలోనూ ఉన్నతుడిగా పేరు తెచ్చుకున్నాడు. కొండయ్య గొప్పగుణానికి గ్రామస్థులంతా సంబరపడేవారు.
ఒకసారి వర్షాకాలంలో భారీగా వానలు కురవసాగాయి. ఏమాత్రం తెరిపినివ్వకపోవడంతో ఏ పనీ సాగలేదు. దీంతో గ్రామస్థులంతా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఊరిలో అధిక శాతం కూలీ పనులకే వెళ్తుంటారు. కష్టం చేస్తేనే పొట్టనింపుకొనే కుటుంబాలు కావడంతో.. పని లేక తిండి గింజలకూ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఊరి ప్రజల స్థితిగతులు తెలిసున్న కొండయ్య.. పరిస్థితులు చక్కబడేవరకు తన గోదాముల్లో రాశులకొద్దీ ఉన్న ధాన్యం నుంచి కొంత పంపిణీ చేయాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని పనివాళ్లకు చెప్పడంతో.. వారు ఊరిలో చాటింపు వేయించారు.
తాత అలా ఉచితంగా ప్రజలకు ధాన్యం పంచడం.. మనవడు విజయ్‌కి నచ్చలేదు. రెండో రోజు పంపిణీ పూర్తయ్యాక.. బంగళా ఆవరణలోని ఊయలపైన కూర్చున్నాడు కొండయ్య. అప్పుడే బయటకు వచ్చిన విజయ్ నెమ్మదిగా తాత దగ్గరకు వెళ్లాడు. ‘తాతగారూ.. తాతగారూ.. మీరిలా ఉచితంగా ధాన్యం పంచిపెడితే.. మనకేంటి లాభం? మన గోదాములే ఖాళీ అవుతాయి కదా..’ అని అమాయకంగా ప్రశ్నించాడు. ‘ఏం.. ఎందుకలా?’ అని మనవడి వంక చూస్తూ అడిగాడు తాత. ‘కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని మా పాఠంలో ఉంది. మొన్ననే టీచర్ కూడా చెప్పారు. మీరు ఇలా దాచుకున్న ధాన్యాన్నంతా పంచేస్తే.. మనం ఏం తింటాం మరి?’ అని మళ్లీ అడిగాడు విజయ్.
అప్పుడు కొండయ్య ముసిముసిగా నవ్వుతూ.. మనవడిని దగ్గరకు తీసుకొని ఒడిలో కూర్చొబెట్టుకొన్నాడు. ‘గ్రామంలోని ప్రజలు ఎక్కువమంది మన పొలాల్లోని వ్యవసాయ పనులకే వస్తుంటారు. ఎలాంటి పరిస్థితి అయినా.. వారు పడే శ్రమతోనే మనకు ఏటా దిగుబడి ఎక్కువగా వస్తుంది. వానల వల్ల ఇప్పుడు కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. అందుకే, మన గోదాముల్లోని కొంత ధాన్యాన్ని బయటకు తీసి పంపిణీ చేస్తున్నా’ అని వివరించాడు తాతయ్య.
తాత అంత చెప్పినా.. విజయ్ సంతృప్తి చెందలేదు. ముఖం ముడుచుకొని పక్కకెళ్లి కూర్చున్నాడు. మనవడికి మరింత అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు కొండయ్య. అదేరోజు సాయంత్రం మనవడిని పొలం పక్కనే ఉన్న చెరువుకు తీసుకెళ్లాడు. దాని ఒడ్డున ఇసుకలో చెలమ మాదిరి చిన్న గుంత తవ్వాడు తాత. కొద్దిసేపట్లోనే అందులోకి నీరు ఊరింది. మనవడిని దగ్గరికి పిలిచి.. దోసిలితో ఆ చెలమలోని నీరు తాగించాడు. తరవాత తానూ తాగాడు. వారిద్దరూ ఎన్ని నీళ్లు తాగారో.. అంతకు సమానమైన నీళ్లు మళ్లీ ఊరడం చూసి ఆశ్చర్యపోయాడు విజయ్. అలా ఎన్నిసార్లు తీసినా.. మళ్లీ నీళ్లు ఊరి గుంత నిండసాగింది.
అప్పుడు మనవడిని దగ్గరకు తీసుకొని ‘చూశావా విజయ్.. ఎన్ని నీళ్లు తగ్గితే చెలమలో అన్ని నీళ్లు వచ్చి గుంతలో ఎలా చేరాయో.. మనవద్ద ఉన్న సంపద కానీ ధాన్యం కానీ ఆపదలో ఉన్న వారికి సాయంగా ఇస్తే, తిరిగి మనకు అంతకంత సమకూరుతుంది. ఈ ప్రపంచంలో పరోపకారానికి మించినది మరోటి లేదు’ అని వివరించాడు కొండయ్య. తాత ప్రత్యక్షంగా చూపిన చెలమ ఉదాహరణతో మనవడి ముఖం చిరునవ్వుతో వెలిగిపోయింది. విషయాన్ని అర్థం చేసుకున్న విజయ్‌ని సంతోషంగా గుండెలకు హత్తుకున్నాడు కొండయ్య. చీకటి పడుతుండటంతో తాతామనవళ్లిద్దరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకొంటూ బంగళా దారి పట్టారు. మరుసటి రోజు మనవడి చేతుల మీదుగానే ఊరి ప్రజలకు ధాన్యం పంపిణీ చేయించాడు కొండయ్య.
- ఉండ్రాళ్ళ రాజేశం
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: లారీని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవదహనం
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-06-2022)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- కూనపై అలవోకగా..
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- చెరువు చేనైంది
- లీజుకు క్వార్టర్లు!
- Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?
- తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట