Updated : 12 May 2022 00:15 IST

ఠప్‌.. ఠప్‌.. ఢాం.. ఢాం..!

మిరియాలపురంలో నివసించే ఆనందయ్య బూరలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఓ రోజు పక్క ఊరు కలువలపురంలో బూరలు అమ్మడానికి పొద్దున్నే సైకిల్‌పై బయలుదేరాడు ఆనందయ్య. కలువలపురానికి వెళ్లాలంటే మధ్యలో ఓ అడవిని దాటాలి.

ఆ అడవి గుండా వెళ్లడం ఆనందయ్యకు అలవాటే. ప్రయాణం మధ్యలో ఉండగా అకస్మాత్తుగా పెద్దగా గాలివాన మొదలైంది. అనుకోని అవాంతరానికి కంగారుపడి తన సైకిల్‌ను ఓ మర్రి చెట్టు కిందకు తీసుకువెళ్లాడు.

జోరుగా వర్షం పడుతోంది. పెనుగాలికి చెట్లన్నీ అలజడి చేస్తూ ఊగుతున్నాయి. తన సైకిల్‌కు కట్టిన బూరలన్నీ ఎగిరిపోయాయి. అడవిలోని నలుదిక్కులకూ చేరిపోయాయి. ‘అయ్యో.. దేవుడా! ఏమిటయ్యా ఇలా చేశావ్‌? నా వ్యాపారం ఈ రోజు నాశనం అయిపోయింది. అమ్మాల్సిన బూరలన్నీ ఎగిరిపోయాయి...’ అనుకుంటూ మనసులో బాధపడ్డాడు ఆనందయ్య. వాన తగ్గిన తర్వాత నిరాశగా ఇంటికి వెళ్లిపోయాడు ఆనందయ్య.

గాలికి ఎగిరిపోయిన బూరలు చెట్లల్లో చిక్కి పెద్ద పెద్ద శబ్దాలతో పగిలిపోతున్నాయి. జంతువులన్నీ ఆ చప్పుళ్లు విని భయపడుతున్నాయి. అలా వారం రోజులుగా ఆ శబ్దాలు వస్తుండటంతో జంతువులన్నీ తమ రాజైన సింహం దగ్గరకు వెళ్లాయి. అడవిలో వస్తున్న వింత శబ్దాల గురించి దానికి చెప్పాయి.

‘అవును.. మిత్రులారా! ఆ శబ్దాలను నేనూ విన్నాను. ఆ చప్పుళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో, నాకూ అర్థం కావడం లేదు. మనం ఏం చేయాలో మీలో ఎవరైనా మంచి సలహా ఇవ్వండి’ అంది.

అందుకు ఏనుగు... ‘మహారాజా..! కచ్చితంగా ఇది మనుషుల పనే అనిపిస్తుంది. ఈ అడవిని ఆక్రమించుకోవడానికి మనల్ని ఈ విధంగా భయపెడుతున్నారేమో అని నా అనుమానం. మనం ఈ శబ్దాలకు భయపడి అడవిని మాత్రం వదిలి వెళ్లకూడదు’ అని ఆవేశంగా అంది.

‘లేదు..లేదు.. ఇదేదో దెయ్యం పని అయి ఉంటుంది’ అంది కాకి. ‘ఏదో భయంకరమైన కొత్త జంతువు వచ్చి ఉంటుంది. అవి దాని అరుపులే అని నా అనుమానం’ అన్నది నక్క.

‘లేదు మహారాజా..! నేను వారం నుంచి పరిశీలనగా వింటున్నా. ఆ శబ్దాలన్నీ చెట్ల పైనుంచే వస్తున్నాయి. కచ్చితంగా ఆ శబ్దం కొత్తరకం పక్షిదే అయి ఉంటుంది’ అంది ఓ ఎలుగుబంటి. ఇలా అన్ని జంతువులూ తలో అభిప్రాయం చెబుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ‘ఠప్‌...’ అనే పెద్ద శబ్దం వినిపించింది.

జంతువులన్నీ ఒక్కసారిగా భయపడి చెల్లాచెదురుగా పారిపోయాయి. కాసేపటికి తేరుకున్న జంతువులన్నీ వెనక్కి తిరిగి చూశాయి. ఆ శబ్దం ఓ కోతిపిల్ల పట్టుకున్న బూర నుంచి వచ్చిందని తెలుసుకుని నవ్వుకున్నాయి. సింహం కూడా భయంతో గుహలోకి పరిగెత్తిన విషయాన్ని గమనించిన జంతువులన్నీ నెమ్మదిగా నవ్వుకున్నాయి. ఆ శబ్దం ఓ బూర పగలగా వచ్చిందన్న విషయం తెలుసుకుని సింహం గుహ నుంచి బయటకు వచ్చింది. జంతువులన్నీ మళ్లీ సమావేశం అయ్యాయి. ‘ఓ కోతీ.. నీ చేతుల్లోని బూర ఎక్కడిది? నీకెక్కడ దొరికింది?’ అని కోతిపిల్లను సింహం  ప్రశ్నించింది. ‘రాజా...ఈ బూరలన్నీ అడవి అంతటా ఉన్నాయి. మేము సరదాగా వీటితో అడుకుంటున్నాం. ఇవి పగిలినప్పుడు వచ్చే శబ్దం భలే గమ్మత్తుగా ఉంది. అయితే ఈ బూరలన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయో మాకు తెలియదు’ అంది కోతిపిల్ల.

సింహానికి విషయం అర్థమైంది. ఎవరో మనిషి పొరపాటున బూరలను అడవిలోకి పంపి ఉంటాడు అనుకుంది. ‘శబ్దం వెనకున్న రహస్యం బట్ట బయలు అయ్యింది కదా..! ఇక మీరందరూ ధైర్యంగా మీ స్థావరాలకు వెళ్లండి. మీ వెనకాల కొండంత అండగా నేనున్నాను. మీకు ఏ కష్టమొచ్చినా నేను తీరుస్తాను. వెళ్లండి....’ అంది జంతువులతో సింహం. ‘సరే మహారాజా!’ అంటూ జంతువులన్నీ ముసిముసిగా నవ్వుకుంటూ ఇంటి దారి పట్టాయి.

- వడ్డేపల్లి వెంకటేష్


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts