Published : 20 May 2022 01:02 IST

రాజుగారి ఉంగరం!

వంతీపుర రాజ్యంలో నివసించే సుధాముడు చిరు వ్యాపారి. కొద్దిపాటి సంపాదనతోనే భార్యాపిల్లలను పోషించుకుంటూ జీవనం సాగించేవాడు. ఒకరోజు బంధువుల ఇంట్లో పెళ్లి నిమిత్తం పొరుగూరికి బయలుదేరాడు. ఆ ఊరికి చేరుకోవాలంటే ఓ అడవిని దాటాల్సి ఉంటుంది. తెలిసిన దారే కావడంతో సుధాముడు ఒంటరిగానే పయనమయ్యాడు. అలా అడవిలో చాలా దూరం నడిచాక.. బాగా దాహం వేయడంతో చుట్టూ వెతికాడు. కనుచూపు మేరలో ఓ సెలయేరు కనిపించింది. ‘ఆహా.. స్వచ్ఛమైన నీరు దొరికింది’ అని సుధాముడు సంబరపడుతూ దోసిళ్లతో తాగుతుండగా.. నీళ్లలో ఓ ప్రకాశవంతమైన వస్తువు ఏదో కనిపించింది.

వెంటనే, దాన్ని చేతిలోకి తీసుకున్న సుధాముడి ముఖం వెలిగిపోయింది. ఎందుకంటే అది ఓ బంగారు ఉంగరం. ‘ఈరోజు నా అదృష్టం చాలా బాగుంది. నవరత్నాలు పొదిగి ఉన్న ఈ ఉంగరం మహారాజుది కాబోలు. దీంతో నా కష్టాలన్నీ తీరిపోతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ విషయాన్ని మరొకరికి చెప్పకూడదు’ అని మనసులో అనుకుంటూ.. ప్రయాణాన్ని రద్దు చేసుకుని, వెనక్కి వెళ్లిపోయాడు. హడావిడిగా ఇంటికి వచ్చిన భర్తను చూసి సుధాముడి భార్య ఆశ్చర్యపోయింది. ఉంగరం విషయాన్ని ఆమెకు చెప్పడంతో ‘అయ్యో.. దొంగతనం చేయడం నేరం. మనకు డబ్బులు లేకపోయినా ఫర్వాలేదు. ఉన్నదాంట్లోనే సుఖంగా బతుకుతున్నాం కదా! నా మాట విని రాజు గారికి ఆ ఉంగరాన్ని తిరిగి ఇచ్చేయండి’ అంది. అందుకు సుధాముడు.. ‘నేనేమీ దొంగతనం చేయలేదు. మన పేదరికాన్ని చూసి దేవుడే ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. నీకేం తెలియదు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు’ అంటూ కోప్పడ్డాడు.

మరుసటి రోజు వీధుల్లో చాటింపు వినిపించడంతో సుధాముడు బయటకు వెళ్లి చూశాడు. ‘వేట కోసం అడవికి వెళ్లిన మన రాజు గారి ఉంగరం ఎక్కడో పడిపోయింది. ఎవరికైనా దొరికితే తీసుకొచ్చి ఇవ్వగలరు. ఇచ్చిన వారికి మంచి బహుమానం ఉంటుందహో....’ అనేది దాని సారాంశం. ఆ చాటింపు విన్న సుధాముడి భార్య... ‘ఏమయ్యో.. ఇకనైనా ఆ ఉంగరాన్ని రాజు గారికి ఇచ్చేద్దాం. మంచి బహుమానం కూడా ఇస్తారట కదా’ అంది. ‘నీకేం తెలియదు. ఉంగరం ధరలో పదో వంతు కూడా ఉండదు బహుమానం విలువ. ఈ ఉంగరం మన దగ్గర ఉంటేనే మనకు లాభం’ అన్నాడు సుధాముడు.

ఉంగరాన్ని వెతకడం కోసం రాజ్యంలోని కొందరు యువకులు అడవికి వెళ్లారు. వాళ్ల ప్రయత్నాన్ని చూసి నవ్వుకున్నాడు సుధాముడు. వారం రోజుల తర్వాత రాజ్యంలో ఓ వార్త విపరీతంగా వినిపించింది. అదేంటంటే.. ఎవరో అపరిచితుడు ఉంగరం వెతికి తీసుకు వచ్చాడనీ, మహారాజు అతనికి ఆస్థానంలో కొలువు ఇవ్వడంతో పాటు తరతరాలకు సరిపడా ధనమూ ఇచ్చాడనీ! అందరి నోళ్లలో నానుతున్న ఈ విషయం సుధాముడు చెవినా పడటంతో, అయోమయానికి గురయ్యాడు. నకిలీ ఉంగరంతో ఎవరో రాజును మోసం చేసి.. తనకి దక్కాల్సిన కానుకలు తీసుకువెళ్లారని బాధ పడ్డాడు. తన దగ్గరున్న అసలైన ఉంగరాన్ని రాజుకు ఇచ్చి ఆ బహుమతులన్నీ తానే పొందాలనుకున్నాడు. వెంటనే ఉంగరాన్ని తీసుకొని కోటకు బయలుదేరాడు.

‘మహారాజా.. నాకు అడవిలో ఉన్న సెలయేరులో నీళ్లు తాగుతుంటే, మీ ఉంగరం దొరికింది. ఎవరో మీకు నకిలీది అంటగట్టి.. మోసగించారు. కావాలంటే దీన్ని పరిశీలించండి’ అంటూ తన దగ్గరున్న ఉంగరాన్ని రాజుకు అందించాడు సుధాముడు. రాజు ఆ ఉంగరాన్ని పరిశీలించి.. తనదేనని నిర్ధారించుకున్నాక, మంత్రి మహేంద్రనాథుని వైపు చూసి చిన్నగా నవ్వాడు. ‘మంత్రీ.. మీరు చెప్పిన విధంగా చేయడంతోనే ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన ఉంగరం దొరికింది. మీ సమయస్ఫూర్తికి, తెలివితేటలకు నా వందనాలు’ అంటూ కొనియాడాడు. రాజుకు ధన్యవాదాలు చెప్పిన మంత్రి.. సుధాముడి వైపునకు అడుగులు వేసాడు.

అసలు ఏం జరుగుతుందో సుధాముడికి ఏమీ అర్థం కాలేదు. ‘సుధామా.. కొద్దిరోజుల క్రితం మహారాజు వేటకు వెళ్లినప్పుడు తనకెంతో ఇష్టమైన ఉంగరం పోగొట్టుకున్నారు. దానికోసం తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఎవరికో దొరికే ఉంటుంది కానీ ఇవ్వడానికి సంకోచిస్తున్నారని నాకు అనిపించింది. అందుకే ఉంగరం ఇచ్చిన వారికి బోలెడు కానుకలు అందించినట్లు వదంతి సృష్టించాను. అది విని.. ఈరోజు ఇక్కడికి వచ్చావు. నువ్వేమీ భయపడకు. నీకు ఎటువంటి శిక్ష పడకుండా చూసే బాధ్యత నాది. ఆ మేరకు రాజును కోరతా’ అని అసలు విషయాన్ని వివరించాడు మంత్రి. మొదటి తప్పిదంగా పరిగణించిన రాజు.. సుధాముడికి ఎటువంటి శిక్ష విధించలేదు. కొన్ని విలువైన కానుకలు కూడా అందించాడు. వాటిని తీసుకొని బతుకుజీవుడా అనుకుంటూ ఇంటిదారి పట్టాడు సుధాముడు.

- వడ్డేపల్లి వెంకటేష్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని