కోతికి తెలిసొచ్చింది!
దండకారణ్యంలో ఉన్న ఏనుగు ఒకటి ఆహారం దొరక్క ఆకలితో నానా అవస్థలు పడసాగింది. ఇంతలో చెట్టు కొమ్మల మీద నుంచి గెంతుతూ వచ్చిన కోతిని చూసి ‘కోతి బావా.. నాకు బాగా ఆకలిగా ఉంది. తిని రెండు రోజులైంది. ఎక్కడైనా ఏమైనా పండ్లు కనిపిస్తే చెప్పవా?’ అని అడిగింది. ‘ఇప్పుడే చెరువు గట్టు దగ్గర కొన్ని పండ్లు చూశాను. ఉండు తీసుకొస్తా’నంటూ వెళ్లింది. కొంత సమయానికి బాగా పండిన ఈత కాయల గెలను ఒకదాన్ని తీసుకొచ్చింది కోతి. ఆ గెలలోని ఈతకాయలను తినలేక అవస్థలు పడి వదిలేసింది. ‘అయినా, నిన్ను అడగటం నా బుద్ధి తక్కువ. నువ్వు ఎవరికీ ఏనాడూ సరిగ్గా సహాయం చేసింది లేదు’ అంటూ నీరసంగా మళ్లీ ఆహారాన్వేషణలో పడింది ఏనుగు.
కొంతదూరంలో ఓ అరటి చెట్టుకున్న గెల దానికి కనిపించింది. ఓపిక చేసుకొని అక్కడికి వెళ్లేసరికే.. అటుగా వచ్చిన కోతి, ఆ గెలను ఎత్తుకెళ్లిపోయింది. చేతికి వచ్చిన ఆహారాన్ని ఎగరేసుకుపోయేసరికి ఏనుగుకి కోతిపైన విపరీతమైన కోపం వచ్చింది. దాన్నేమీ చేయలేక నిస్సహాయంగా ముందుకు కదిలింది. ఇంతలో దానికి ఓ కుందేలు ఎదురై, ‘ఏమైంది మిత్రమా.. అలా నీరసంగా ఉన్నావు?’ అని అడిగింది. జరిగిన విషయాన్ని చెప్పింది ఏనుగు. జాలిపడిన కుందేలు.. చెరువు గట్టునున్న ఆహారాన్ని చూపించింది. కడుపు నిండా తిన్న ఏనుగు.. కుందేలుకు కృతజ్ఞతలు తెలిపింది. ‘కృతజ్ఞతలు తెలిపి నన్ను దూరం చేయకు మిత్రమా.. అయినా, ఇందులో నేను చేసింది ఏముంది.. అవసరంలో ఉన్నవారికీ, ఆపదలో ఉన్న వారికీ సహాయం చేయడం కనీస ధర్మం.. అదే నేను చేశాను’ అంది.
కాస్త ఓపిక రావడంతో కుందేలును తన వీపు మీద ఎక్కించుకుంది ఏనుగు. రెండూ కలిసి వెళ్తుండగా.. ఏనుగును ఆటపట్టించిన కోతి ఎదురైంది. ‘ఏంటి నువ్వు ఏనుగుకు ఆహారం అందించినంత మాత్రాన గొప్పదాన్ని అనుకుంటున్నావా? అది అంత భారీగా ఉండి కూడా.. తన ఆహారాన్ని తాను సంపాదించుకోలేదా ఏంటీ?’ అంటూ కుందేలునుద్దేశించి చులకనగా మాట్లాడింది. ‘లేదు మిత్రమా.. ఆహార సంపాదనకు శరీరంతో సంబంధం లేదు. పరిస్థితులు ఒక్కోసారి మనకు అనుకూలంగా లేకపోతే ఏమీ చేయలేం..’ అంటూ కుందేలు చెప్పేది పూర్తిగా వినకుండా వెళ్లిపోయింది కోతి. ‘వద్దు మిత్రమా.. కోతితో వాదించడం అనవసరం. దానికి కనీసం వినే ఆలోచన కూడా లేదు’ అంది ఏనుగు. కుందేలు స్థావరం రావడంతో దాన్ని దింపేసి, ఇంటికెళ్లిపోయింది ఏనుగు.
కొన్ని రోజులు గడిచాయి. వేసవికాలం కావడంతో అడవిలో ఒకచోట మంటలు అంటుకున్నాయి. గాలులకు అవి క్రమక్రమంగా వ్యాపించసాగాయి. మంటలను గమనించిన కొన్ని జంతువులు మృగరాజు దగ్గరికి వెళ్లి, విషయం చెప్పాయి. వెంటనే ఏనుగులను, ఇతర జంతువులను అప్రమత్తం చేసి ‘ఎక్కడైతే మంటలున్నాయో.. అక్కడికి వెళ్లి వాటిని ఆర్పేయండి’ అని ఆదేశించింది సింహం. ఏనుగులు వాటి తొండం సహాయంతో సమీపంలో ఉన్న చెరువులో నీళ్లు తీసుకొని మంటలను ఆర్పడం ప్రారంభించాయి. కుందేలూ, ఇతర జంతువులు కూడా మంటల్లో చిక్కుకున్న వాటిని రక్షించడంలో నిమగ్నమయ్యాయి. అల్లరి కోతి నివాసానికీ మంటలు వ్యాపించాయి. అది గమనించిన కుందేలు, ఏనుగు అక్కడికి వెళ్లి చూడగా.. మంటల్లో చిక్కుకున్న కోతి పిల్ల కనిపించింది. వెంటనే ఏనుగు దాన్ని బయటకు తీసుకొచ్చింది. ఆ కోతి పిల్లకు కుందేలు సపర్యలు చేసి, ఎలుగుబంటికి అప్పగించింది. ఏనుగు తన తొండంతో నీటిని చల్లి, ఇల్లు మొత్తం కాలిపోకుండా కాపాడింది.
ఇంతలో వాటికి కోతి ఎదురైంది. ‘ఏంటి మళ్లీ ఎవరికో ఏదో సహాయం చేసి వస్తున్నట్టు ఉన్నారు. మీ పిచ్చికి హద్దుల్లేవా?’ అంటూ ఏనుగు, కుందేలును హేళన చేస్తూ ఇంటిదారి పట్టింది. అవి ఆ మాటలను పట్టించుకోకుండా మంటలు ఆర్పే ప్రయత్నంలో ముందుకు సాగాయి. ఇంటికి చేరిన కోతి.. సగం కాలిపోయిన ఇంటినీ, గాయపడిన తన పిల్లను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యింది. తల్లిని చూడగానే ఏడుస్తూ, దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లింది పిల్ల కోతి. ‘ఏమైంది, ఏమైంది?’ అంటూ కంగారు పడుతున్న కోతిని చూసి.. అక్కడే ఉన్న ఎలుగుబంటి ‘అడవిలో కార్చిచ్చు నీ ఇంటికి అంటుకుంది. సమయానికి ఏనుగు, కుందేలు వచ్చి మంటలను ఆర్పి.. నీ పిల్లను రక్షించాయి’ అంది. ‘అయ్యో.. అవి రక్షించింది నా ఇంటినీ, నా బిడ్డనే అని తెలుసుకోకుండా.. చాలా మాటలు అన్నాను’ అంటూ పరిగెత్తింది. ఏనుగు, కుందేలు దగ్గరికి వెళ్లి.. ‘నన్ను క్షమించండి. మిమ్మల్ని చాలా చులకనగా మాట్లాడాను. అయినా సరే.. మీరు నా ఇంటిని, నా బిడ్డను కాపాడారు’ అంటూ ఏడ్చింది. కోతిలో వచ్చిన మార్పును చూసి అవి రెండూ సంతోషించాయి.
- కళ్లేపల్లి ఏడుకొండలు
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
North Korea: విదేశీ వస్తువులను తాకడం వల్లే.. మా దేశంలో కరోనా..!
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్తో పోరులో భారత ఐదో బౌలర్ ఎవరు?
-
General News
Rath Yatra: అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు
-
Movies News
Manchu Lakshmi: నటన.. నా కలలో కూడా ఊహించలేదు: మంచులక్ష్మి
-
Sports News
Virat Kohli : కోహ్లీ 30 రన్స్ కొడితే సెంచరీ పక్కా: మైఖేల్ వాన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..
- Andhra News: ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!