పిట్ట కొంచెం..వంట ఘనం!

ఇంట్లో అమ్మ వండిపెడితే.. మనం ఎంచక్కా తినిపెడతాం.. అవును మరి.. మనం బుజ్జాయిలం కదా! అంతకు మించి ఇంకేం చేస్తాం.. బొజ్జ నిండా తినడం.. బుజ్జి బుజ్జి మాటలతో ఆడుకోవడం తప్ప! కానీ తొమ్మిదేళ్ల హయన్‌ మాత్రం వంటల్లో అదరగొడుతున్నాడు.. రికార్డులు కొల్లగొడుతున్నాడు.. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా!

Published : 28 Feb 2021 01:36 IST

ఇంట్లో అమ్మ వండిపెడితే.. మనం ఎంచక్కా తినిపెడతాం.. అవును మరి.. మనం బుజ్జాయిలం కదా! అంతకు మించి ఇంకేం చేస్తాం.. బొజ్జ నిండా తినడం.. బుజ్జి బుజ్జి మాటలతో ఆడుకోవడం తప్ప! కానీ తొమ్మిదేళ్ల హయన్‌ మాత్రం వంటల్లో అదరగొడుతున్నాడు.. రికార్డులు కొల్లగొడుతున్నాడు.. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా!
కేరళ రాష్ట్రం కోజికోడ్‌కు చెందిన హయన్‌ అబ్దుల్లాకు తొమ్మిది సంవత్సరాలు. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఒక గంటలో 172 రకాల వంటలు చేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. అవీ అల్లాటప్పా వంటలు కాదు.. బిర్యానీ మొదలు.. పాన్‌కేక్‌, దోశలు, సలాడ్లు, మిల్క్‌షేక్స్‌, చాక్‌లెట్స్‌, ఇంకా పలు రకాల జ్యూస్‌లు సిద్ధం చేశాడు.

వారసత్వంగా ‘వంట’బట్టింది!
బొమ్మలతో ఆడుకోవాల్సిన నాలుగేళ్ల వయసు నుంచే హయన్‌ గరిటెలు, చెంచాలతో చెట్టాపట్టాలేసుకున్నాడు. ‘నా బంగారు కన్న.. అంతచిన్న వయసులోనే వంట చేయడానికి ఆసక్తి చూపేవాడు. తన చిట్టి చిట్టి చేతులతో నాకు వంటగదిలో సాయం చేసేవాడు’ అని చెబుతూ వాళ్ల అమ్మ మురిసిపోతోంది. హయన్‌ వాళ్ల కుటుంబానికి కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. ఇలా ఓ రకంగా వంట వారసత్వంగా ఒంటబట్టినట్లైంది.
కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ..  
ప్రస్తుతం కొవిడ్‌ నిబంధనలు అమలులో ఉండటంతో హయన్‌ వాటిని పాటిస్తూ ఆన్‌లైన్‌లో ఈ వంటలపోటీలో పాల్గొన్నాడు. కేవలం వంట చేయడమే కాదు ఇంగ్లిష్‌, మలయాళం, తమిళ్‌లో వీటి గురించి వివరిస్తాడు. అన్నట్లు తనకు ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది తెలుసా..! తనకు వంటలంటే ఇష్టమైనప్పటికీ పెద్దయ్యాక మాత్రం ఫైలట్‌ అవుతానంటున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని