Updated : 25 Jan 2022 05:26 IST

తొలగిన గర్వం

నగనగా ఒక అడవిలో అందమైన నెమలి ఉండేది. తాను అందగత్తెనని, చక్కగా నాట్యం చేయగలనని గర్వంతో ఉండేది. చెట్టు పైన ఉన్న కోకిల రాగయుక్తంగా పాట పాడితే నెమలి చక్కగా నాట్యం చేసేది. అడవిలోని జంతువులు, పక్షులు ఆ నాట్యం చూసి ఆనందపడేవి. నెమలిని పొగడ్తలతో ముంచెత్తేవి. నెమలి ఉబ్బితబ్బిబ్బు అయిపోయేది.

కోకిల పాటకు నాట్యం చేసే నెమలి, కోకిలను మాత్రం.. ‘నీ రూపం నలుపు’ అంటూ ఎద్దేవా చేసేది. నెమలి, కోకిలను హేళన చేయడం అక్కడే చెట్టుపై ఉన్న కోతి గమనించి.. నెమలితో ‘కోకిల పాట వల్లే నీ నాట్యానికి అందం వచ్చింది, కానీ నువ్వు కోకిలను నల్ల రంగు పేరుతో హేళన చేయడం బాగో లేదు. కోకిల స్వరం తీయనైనది. కాబట్టి కోకిలను గౌరవించడం నేర్చుకో’ అంటూ హితబోధ చేసేది. అయినా నెమలి, కోతి మాటలు పెడచెవిన పెట్టి, అలానే ప్రవర్తిస్తూ కోకిలను అవమానపరిచేది.

నెమలి నాట్యం గురించి మృగరాజు సింహానికి తెలిసింది. నెమలికి కబురు పెట్టి, తన సమక్షంలో నాట్యం చేయాలని కోరింది. నెమలి ఆనందానికి హద్దే లేదు. తన నాట్యంతో మృగరాజును మెప్పించి, కానుకలు పొందాలనుకుంది.

నెమలి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. చక్కగా ముస్తాబై బయలుదేరింది. పాట పాడటానికి నలుపు రంగులో ఉండే కోకిలను కాకుండా, అందంగా ఉండే రామచిలుకను రమ్మంది. అప్పుడు రామచిలుక ‘నెమలి మిత్రమా! నేను కోకిల వలె చక్కగా రాగయుక్తంగా పాడలేను’ అంది. అందుకు నెమలి ‘నీ పాట ఎవరు వింటారు.. నా నాట్యమే కదా చూస్తారు. నువ్వు అటువంటి బెంగ ఏమీ పెట్టుకోకుండా నాతో రా.. నీకు కూడా కానుకలు ఇస్తారు’ అంటూ చిలుకను ఒప్పించింది.

మృగరాజు, నెమలి నాట్య ప్రదర్శనను ఏర్పాటు చేసింది. అడవిలోని జంతువులు, పక్షులూ అన్నీ అక్కడకు చేరుకున్నాయి. మృగరాజు నాట్యం ప్రారంభించమంది. నెమలి నాట్యానికి సిద్ధమైంది. రామచిలుకను పాట పాడమంది. వెంటనే రామచిలుక పాట అందుకుంది. కానీ నెమలి నాట్యం వేయడానికి తడబడింది. చిలుక పాటకు నెమలికి నాట్యం వేయడం కుదరడం లేదు. అది చూసిన మృగరాజు, మిగతా జంతువులు, పక్షులు కూడా ఆశ్చర్యపోయాయి. నెమలి కూడా అందరి ముందు తాను తడబడడంతో సిగ్గు పడింది. వెంటనే మృగరాజు నెమలితో ‘నీ నాట్యం బాగుంటుందని అందరూ చెప్పగా విన్నాను. అందుకే నిన్ను ఆహ్వానించాను. కానీ నువ్వు నాట్యం సరిగా చేయలేకపోతున్నావు. కారణం ఏంటి?’ అని అడిగింది.

అప్పుడు అక్కడే ఉన్న కోతి ‘మృగరాజా! నెమలి చాలా చక్కగా నాట్యం చేయగలదు. అయితే అందుకు కోకిల పాట పాడాలి. కోకిల పాడే రాగయుక్తమైన పాట వింటే చాలు.. నెమలి అలవోకగా నాట్యం చేసేస్తుంది. అదిగో ఆ కోకిల కూడా ఇక్కడే ఉంది’ అని చెప్పింది. అంతేకాకుండా కోకిల దగ్గరకు వెళ్లి ‘కోకిలమ్మ! నీ రాగంతో పాట పాడు.. నెమలి నాట్యం అందరికీ చూపించు’ అంది. వెంటనే కోకిల చక్కని స్వరంతో పాటందుకుంది.

కోకిలమ్మ పాట వినగానే పాటకు అనుగుణంగా, లయబద్ధంగా నెమలి నాట్యం చేయడం ప్రారంభించింది. కోకిల పాటకు నెమలి నాట్యం చేయడం అక్కడ అందరినీ అలరించింది. మృగరాజు, నెమలి నాట్యాన్ని మెచ్చుకుంది. అంతేకాదు కోకిల గానానికి మురిసిపోయింది. ఇద్దరినీ పిలిచి చక్కని కానుకలు ఇచ్చింది మృగరాజు. నెమలి, కోకిలను చూసి సిగ్గుతో తలదించుకుంది. తాను ఇన్నాళ్లుగా హేళన చేసిన కోకిలకు, నెమలి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పింది. కోకిల పాడితేనే తన నాట్యానికి అందం వచ్చిందని తెలుసుకుంది. ఇక ఆరోజు నుంచీ ఇంకెన్నడూ కోకిలను హేళన చేయలేదు నెమలి. అన్ని జీవులతో స్నేహంగా ఉంటూ.. ఆనందంగా జీవించసాగింది. నెమలి ప్రవర్తనలో కలిగిన మార్పును చూసి కోతి చాలా ఆనందపడింది.

- మొర్రి గోపి


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని