మారిన వేపచెట్టు!

కృష్ణానదీ తీరాన ఉన్న అడవిలో ఎన్నో రకాల వృక్షాలతోపాటు ఒక పెద్ద వేపచెట్టు ఉండేది. తనంత బలమైన చెట్టు ఆ పరిసరాల్లో లేకపోవడంతో అది మహాగర్వంగా బతికేది. ఒకరోజు ఆ చెట్టు దగ్గరకు ఒక కాకుల జంట వచ్చింది.

Published : 13 May 2022 01:57 IST

కృష్ణానదీ తీరాన ఉన్న అడవిలో ఎన్నో రకాల వృక్షాలతోపాటు ఒక పెద్ద వేపచెట్టు ఉండేది. తనంత బలమైన చెట్టు ఆ పరిసరాల్లో లేకపోవడంతో అది మహాగర్వంగా బతికేది. ఒకరోజు ఆ చెట్టు దగ్గరకు ఒక కాకుల జంట వచ్చింది.

‘అయ్యా..! వేపచెట్టు గారూ.. దయచేసి మీ పైన ఉన్న కొమ్మల్లో గూడు కట్టుకుని సుఖంగా జీవించేందుకు మాకు అవకాశం కలిగించండి’ అని అవి వేడుకున్నాయి.

‘అలాగే.. ఇప్పటికే నా కొమ్మల్లో వందలాది పక్షులు గూళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. అది సరే కానీ... ఈ అడవిలో ఎన్నో బలమైన వృక్షాలు ఉన్నాయి కదా! వాటన్నింటినీ వదిలి అందరూ నా దగ్గరకే వచ్చి ఎందుకు గూళ్లు కడుతున్నారు?’ అని అడిగింది వేపచెట్టు.

‘అయ్యా.. గూడు కట్టుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ పరిసరాల్లో తమరే బలమైన వారు. ఎంతటి గాలివానలనైనా తట్టుకుని మమ్మల్ని సురక్షితంగా ఉంచగలవారు మీరు. పైగా మీ దిగువ భాగాన కొమ్మల్లో కొన్ని గద్దలు గూడు కట్టుకుని ఉన్నాయి. మేం వాటిని మచ్చిక చేసుకున్నాం. వాటి వల్ల మాకు, మా పిల్లలకు పాముల నుంచి రక్షణ లభిస్తుంది. గద్దలు మాకు మాటిచ్చాయి కాబట్టి.. వాటి వల్ల మా పిల్లలకు ఎలాంటి అపాయమూ రాదు’ అంది మగ కాకి.

కాకి మాటలకు, తన బలానికి మరింత గర్వపడిందా వేపచెట్టు. మరుసటి రోజు కొన్ని తేనెటీగలు వేపచెట్టు దగ్గరకు వచ్చి.. ‘అయ్యా..! మీరు అనుమతి ఇస్తే మేం మీ బలమైన కొమ్మలకు తేనెతుట్టెలు కట్టుకుంటాం’ అన్నాయి.

‘ఈ అడవిలో ఇన్ని చెట్లు ఉండగా, నా కొమ్మలకే మీరు ఎందుకు తేనెతుట్టెలు కట్టాలి అనుకుంటున్నారు?’ అంది వేపచెట్టు. ‘అయ్యా... మనుషులు తేనెకోసం చెట్లు ఎక్కుతారు. ఈ చెట్టుపైన పలు రకాల పక్షులతోపాటు కాకులూ గూళ్లు కట్టుకుని నివసిస్తున్నాయి. మనుషులు తేనెకోసం చెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తే, తమ పిల్లలకు వారు ఏం చేటు చేస్తారో అన్న భయంతో అవి వాటి ముక్కులతో పొడిచి వారిని తరిమి కొడతాయి. ఆ ధైర్యంతోనే మేం ఇక్కడ నివసించాలి అనుకుంటున్నాం. మాకు అనుమతి ఇచ్చినందుకు ఏదో ఒక విధంగా మీ రుణం తీర్చుకుంటాం’ అన్నాయి తేనెటీగలు.

‘ఎన్నో భయంకరమైన గాలివానలను తట్టుకుని నిలబడిన బలశాలిని నేను, నా కొమ్మకు పూచిన చిగురాకు అంతలేని మీరు నాకు సాయం చేసి రుణం తీర్చుకుంటారా? చిన్న నోటితో పెద్ద మాటలు మాట్లాడుతున్నారే! ఏనుగు లాంటి నాకు చిట్టెలుకల్లాంటి మీరు ఎలా సహాయపడగలరు’ అని పకపకా నవ్వింది వేపచెట్టు. ‘వెళ్లండి.. వెళ్లి.. మీకు నచ్చిన కొమ్మకు తేనెతుట్టెలు కట్టుకోండి’ అంది. మరుసటి రోజు లక్షలాది తేనెటీగలు వచ్చి ఆ చెట్టుపై చేరాయి.

కొద్ది రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులు పదునైన గొడ్డళ్లతో ఆ వేపచెట్టు దగ్గరకు వచ్చి.. ‘ఒరేయ్‌ రంగయ్యా! ఈ పరిసరాల్లో ఇదే పెద్ద చెట్టు. కొద్దిగా కష్టమైనా దీన్ని పడగొట్టి కట్టెలుగా చేశామంటే.. ఈ ఏడు కూటికి దిగులు ఉండదు’ అన్నాడు సోమయ్య. ‘నిజమేరా, పదా తెచ్చుకున్న అన్నం తిని పని మొదలు పెడదాం’ అన్నాడు రంగయ్య.

వాళ్ల మాటలు వింటూనే ప్రాణభయంతో గజగజలాడుతూ.. ‘రక్షించండి.. కాపాడండి’ అని విలపించసాగింది వేపచెట్టు. విషయం అర్థం చేసుకున్న వందలాది పక్షులు, లక్షలాది తేనెటీగలు రంగయ్య, సోమయ్యపై ఒక్కసారిగా దాడి చేశాయి. వాళ్లిద్దరూ చేతిలోని గొడ్డళ్లను అక్కడే వదిలేసి దూరంగా పరుగులు తీశారు. చిన్నప్రాణులే తనను కాపాడినందుకు సిగ్గుపడింది వేపచెట్టు. వాటన్నింటికీ తన కృతజ్ఞతలు తెలియజేసింది. ఇంకెప్పుడూ ఎవ్వరితోనూ తన గర్వాన్ని ప్రదర్శించలేదు ఆ వేపచెట్టు.

- బెల్లంకొండ నాగేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని