ఎవరి గొప్పతనం వారిదే!

ఒక కాకి.. కొలనులో వయ్యారంగా ఈదుతున్న రాజహంసను చూసి తానూ అలాగే ఈదాలని అనుకుంది. కానీ అది నీటిలోకి దిగగానే మునిగిపోసాగింది. అప్పుడు అది చూసిన రాజహంస.. కాకి ప్రాణాల్ని కాపాడింది. కాకి తన మనసులోని కోరికను హంసతో చెప్పింది.

Published : 01 Jun 2022 01:10 IST

క కాకి.. కొలనులో వయ్యారంగా ఈదుతున్న రాజహంసను చూసి తానూ అలాగే ఈదాలని అనుకుంది. కానీ అది నీటిలోకి దిగగానే మునిగిపోసాగింది. అప్పుడు అది చూసిన రాజహంస.. కాకి ప్రాణాల్ని కాపాడింది. కాకి తన మనసులోని కోరికను హంసతో చెప్పింది. ఆ మాటలు విని హంస... ‘నువ్వు నన్ను అనుకరించడం పెద్ద తప్పు. నీ స్వభావం, నా స్వభావం వేరువేరుగా ఉంటాయి. దేవుడు అందరికీ అన్ని శక్తులనూ ఇవ్వడు. ఎవరి గొప్పతనం వారిదే. నేను నీటిని, పాలను వేరు చేయగలను. నువ్వు ఆ పని చేయగలవా?’ అని ప్రశ్నించింది.

అప్పుడు కాకి చేయలేనని చెప్పింది. ‘నువ్వు చేసే పని పదిమందికి ఉపయోగపడేటట్లు ఉండాలి. అందులోనే ఆనందం ఉంటుంది’ అని అంది రాజహంస. ‘సరే’ అని కాకి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక తుమ్మెద వచ్చి ఒక పువ్వు పైన వాలి మకరందం పీల్చసాగింది. అది గమనించిన కాకి తాను కూడా అలా పువ్వు పైన వాలి మకరందాన్ని తాగాలని అనుకుంది. తుమ్మెద వెళ్లిన తర్వాత ఆ మొక్కపై వాలింది. ఆ పువ్వు మకరందాన్ని ఎంత పీల్చాలని కాకి ప్రయత్నించినా దానికి సాధ్యం కాలేదు. దాని ముక్కు ధాటికి ఆ పువ్వు రెక్కలు ఊడి వచ్చాయి తప్ప, దానికి మకరందం మాత్రం దొరకలేదు.

అది గమనించిన మరొక పువ్వు... ‘ఓ కాకమ్మా! తుమ్మెద మా మకరందాన్ని సుతిమెత్తగా తాగుతుంది. అందరికీ ఆ విద్య రాదు కదా! నువ్వు నీ పదునైన ముక్కుతో పీల్చడం వల్ల మా రెక్కలన్నీ రాలిపోతున్నాయి. ఎవరి పనిని వారు చేస్తేనే మంచిది’ అంది.

మరికొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కాకి, ఒక నెమలి నృత్యం చేయడం గమనించింది. దానిలా తాను కూడా నృత్యం చేయాలని భావించింది. అది చేస్తున్న నృత్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించింది. కానీ దానికి ఉన్న పింఛం తనకు లేనందుకు అది బాధ పడింది. అయినా సరే నృత్యం చేయాలన్న తన కోరికను మాత్రం అదుపులో పెట్టుకోలేకపోయింది. అక్కడే అది అతి వేగంగా గెంతడం వల్ల పట్టు తప్పి, కిందపడటంతో దాని కాలుకు గాయమైంది.

అది చూసిన నెమలి ‘నాలా నాట్యం చేయాలనుకుంటున్నావా... కాకమ్మా! ఒకరికి వచ్చిన విద్య ఇంకొకరికి రావాలంటే ఎంతో సాధన చేసి కష్టపడి నేర్చుకోవాలి. అలా కేవలం చూసినంత మాత్రాన నా విద్య సంపూర్ణంగా నీకు రాదు. నీ విద్య నాకు రాదు. అది గమనించి మసులుకో!’ అని హితోపదేశం చేసింది. కాకి ఆ దిగులుతో బాధపడుతూ నిదానంగా ఇంటికి చేరుకుంది.

దాని నడకను గమనించిన చిలుక.. విషయం తెలుసుకొని కాకికి నచ్చజెప్పింది. అయినా దాని బుద్ధి మారలేదు. ఒకసారి అది కోకిలలా పాడాలని అనుకుంది. అది ‘కుహూ... కుహూ..’ అని కోకిల పాడుతుంటే విని.. ‘ఇది నా గూటిలో పెరిగిన పక్షి. దీనిలాగా నేను ఎందుకు పాడలేను?’ అని అనుకొని.. ‘కుహూ.. కుహూ’ అనడానికి బదులుగా అది ‘కావ్‌ఁ.. కావ్‌ఁ..’ అని అరవసాగింది. దాని అరుపులు విని మిగతా కాకులన్నీ అక్కడికి వచ్చి చేరాయి. అక్కడ వాటికి ఆహారం ఏమీ లేకపోవడం గమనించి.. దాన్ని తమ ముక్కులతో పొడిచి హింసించసాగాయి.

కాకి వాటితో తాను పాటలు పాడుతున్నానని, వాటిని పిలవలేదని ఎంతచెప్పినా అవి వినిపించుకోలేదు. అప్పుడు ఆ గుంపులోని ఒక ముసలి కాకి వాటిని వారించింది. ‘కోకిల చేసే పని నువ్వు చేయాలని అనుకోవడం అవివేకమే అవుతుంది. అది నీ గూట్లో పెరిగినప్పటికీ దాని పాట తియ్యగా, హాయిగా ఉంటుంది. దానికి, మనకు చాలా తేడా ఉంది. నువ్వు మళ్లీ పాడితే మన కాకులు ఇంకా గుంపులు గుంపులుగా వచ్చి నిన్ను హింసిస్తాయి. ఇతరులను చూసి  నువ్వు వారిలా చేయాలని చూడకు. ఎవరి గొప్పతనం వారిదే. అందరికీ అన్ని విద్యలు రావు. నీ సహజ స్వభావాన్ని మార్చుకోకు. మన కాకులు గుంపులు గుంపులుగా చేరి ఆహారాన్ని తింటాయి. కలిసిమెలిసి జీవిస్తూ ఐకమత్యానికి చిహ్నంగా ఉంటాయి. అంతేకానీ హంసలాగా నడవడం, మకరందాన్ని తుమ్మెదలా తాగడం, నెమలిలా నాట్యం చేయడం, కోకిలలా పాడడం మనకు తగని పని. అది నువ్వు తెలుసుకో’ అని హెచ్చరించింది. ఆ మాటలకు బుద్ధి తెచ్చుకుంది కాకి.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని