రంగయ్య - మంగయ్య!

పూర్వం యాలాపురం అనే చిన్న పల్లెటూరు ఒకటి ఉండేది. ఆ ఊరిలో రంగయ్య, మంగయ్య అనే ఇద్దరు చిరువ్యాపారులు ఉండేవారు. ఆ ఇద్దరూ పోటీలు పడి వ్యాపారాన్ని దెబ్బ తీసుకోవడం కంటే.. స్నేహంగా ఉంటూ బాగా సంపాదించాలని అనుకున్నారు. ఊరితోపాటు చుట్టుపక్కల పల్లెలను సమానంగా పంచుకున్నారు. ఒకరి పరిధిలోని ఊరికి

Published : 03 Jun 2022 01:06 IST

పూర్వం యాలాపురం అనే చిన్న పల్లెటూరు ఒకటి ఉండేది. ఆ ఊరిలో రంగయ్య, మంగయ్య అనే ఇద్దరు చిరువ్యాపారులు ఉండేవారు. ఆ ఇద్దరూ పోటీలు పడి వ్యాపారాన్ని దెబ్బ తీసుకోవడం కంటే.. స్నేహంగా ఉంటూ బాగా సంపాదించాలని అనుకున్నారు. ఊరితోపాటు చుట్టుపక్కల పల్లెలను సమానంగా పంచుకున్నారు. ఒకరి పరిధిలోని ఊరికి మరొకరు వెళ్లి సామగ్రి విక్రయించొద్దని నిబంధన కూడా విధించుకున్నారు. వారానికోసారి సమీపంలోని పట్టణంలో జరిగే సంతకు వెళ్లి.. సరకులు తెచ్చుకునేవారు. వారి వారి ఊళ్లలో ఆ వారమంతా ఆ సామగ్రిని అమ్మి మంచి లాభాలు గడించేవారు. రోజురోజుకు వారి లాభాలు పెరగసాగాయి. దాంతో డబ్బు మీద ఆశ కూడా అధికమైంది. వచ్చిన లాభాలని బంగారం కింద మార్చి బిందెల్లో ఉంచి, రోజూ చూసుకుంటూ ఆనందపడేవారు. 

ఊరిలో ఈ మధ్య దొంగల బెడద ఎక్కువైంది. ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. నిత్యం ఏదో ఒక వీధిలో చోరీ జరిగేది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, దొంగతనాలకు అడ్డుకట్ట పడలేదు. ఈ వరస చోరీలు రంగయ్య, మంగయ్యలో ఆందోళనను పెంచాయి. ‘వ్యాపారంలో బాగా లాభాలు గడిస్తున్నామనీ, మన దగ్గర డబ్బు చాలా ఉంటుందని గ్రామంలో అందరికీ తెలుసు. ఈ విషయం ఇప్పటికే దొంగల చెవిలో కూడా పడి ఉంటుంది. ఇప్పుడేం చెయ్యాలి.. దొంగల బారినుంచి ధనాన్ని ఎలా కాపాడుకోవాలి?’ అన్న ఆలోచనలతో వ్యాపారులిద్దరికీ నిద్ర పట్టడం లేదు.

ఒకరోజు ఇద్దరూ కలిసి సంతకు బయలుదేరారు. ఊరిలో దొంగతనాల విషయమై దారిపొడవునా చర్చించారు. ‘నేనొక పని చేస్తాను. ఇంటి గోడకు రంధ్రం చేసి, నా దగ్గరున్న బంగారు బిందెల్ని అందులో దాచిపెడతా. ఎవరికీ అనుమానం రాకుండా ఆ రంధ్రాన్ని మూసి వేస్తాను. దొంగలు ఎంత ఆలోచించినా ధనం అక్కడ ఉంటుందని అస్సలు ఊహించలేరు’ అని అన్నాడు రంగయ్య. ‘నీ ఉపాయం చాలా బాగుంది’ అంటూ తన మనసులోని ఆలోచనను వివరించాడు మంగయ్య. ‘బంగారం ఉన్న బిందెల్ని మా ఇంటి పెరట్లోని బావిలో వేసేస్తాను. అక్కడ దాచిన సంగతి ఎవరూ కనిపెట్టలేరు. దొంగల సమస్య తీరాక, ఆ బిందెల్ని పైకి తీయవచ్చు’ అన్నాడు.

ఇద్దరు వ్యాపారులూ వారు అనుకున్నట్లే బంగారం ఉన్న బిందెల్ని దాచిపెట్టారు. దొంగల భయం లేకుండా.. నిశ్చింతగా కాలం గడపసాగారు. ఊరిలోని యువకులు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళ గస్తీ తిరగడం, ప్రతి ఒక్కరూ విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోవడంతో కొద్దిరోజుల్లోనే దొంగతనాలు తగ్గాయి. దాంతో గ్రామ ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఏ భయమూ లేదనుకొని.. ఇంటి గోడను తవ్వి చూశాడు రంగయ్య. బంగారం వున్న బిందెలు కనిపించలేదు. మంగయ్య కూడా పెరట్లోని బావిలోకి దిగి బిందెల కోసం వెతికాడు. అవి కనిపించక పోయేసరికి కంగుతిన్నాడు.

రంగయ్య, మంగయ్యలు లబోదిబోమంటూ గ్రామాధికారి దగ్గరకు పరుగులు పెట్టారు. ఆయనకు జరిగిన విషయమంతా చెప్పారు. గ్రామాధికారి బాగా ఆలోచించి ‘మీరు గోడలో, బావిలో బంగారం ఉన్న బిందెలు దాచినట్లు మరెవరికైనా తెలుసా?’ అని అడిగాడు. ‘లేదు.. ఎవరికీ తెలియదు’ అని జవాబిచ్చారిద్దరూ. గ్రామాధికారికి విషయం అర్థమైంది. ‘అయితే దొంగలు ఎవరో కాదు.. మీరే! దురాశతో ఒకరి సొత్తు మరొకరు చోరీ చేశారు. మీరేదో వ్యాపారంలో అవసరం కోసమే మిత్రులుగా మారారు కానీ మీ మధ్య నిజమైన స్నేహం లేదు. సమయం దొరకగానే మీలోని దుర్బుద్ధి బయటపడింది. నిజం చెప్పండి.. లేకపోతే ఈ విషయం రాజు గారి దగ్గరకు తీసుకెళ్తా. అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి’ అని వాస్తవాన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేశాడాయన.

మహారాజు పేరు వినగానే రంగయ్యకు, మంగయ్యకు చెమటలు పట్టాయి. ఎందుకంటే, ఆ దేశ రాజు చండశాసనుడు. విషయాన్ని అక్కడి దాకా తీసుకెళ్లొద్దని.. ఇద్దరూ తాము చేసిన తప్పును ఒప్పుకొన్నారు. ‘రంగయ్య కుటుంబం పక్క ఊరిలో బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు గోడను తొలిచి అతని బంగారాన్ని నేనే కాజేశాను’ అని మంగయ్య.. ‘మంగయ్య కుటుంబం జాతరకు వెళ్లిందని తెలుసుకొని, అదే అదనుగా బావిలోకి దిగి దాచిన బిందెల్ని ఎత్తుకెళ్లాను’ అని రంగయ్య వారి నేరాలను అంగీకరించారు. ‘మీరు స్నేహితులు కాదు. మిత్ర ద్రోహులు’ అంటూ వారికి పెద్దమొత్తాన్ని జరిమానాగా విధించాడు గ్రామాధికారి. తమ తప్పు తెలుసుకున్న వ్యాపారులు.. ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకొని, అప్పటి నుంచి నిజాయతీగా బతకసాగారు.

- గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని