Published : 27 Jul 2022 00:17 IST

ఊరికి ఉపకారి!

కృష్ణపట్నంలో.. వల్లభుడు, పేరున్న వ్యాపారస్థుడు. సంపాదన తప్ప వేరే ధ్యాస లేనివాడు. ఆయన నివాసం ఉండే వీధి చివర ఉన్న ఇంట్లో కొత్తగా వ్యాపారం చేయడానికి శేఖరుడు అనే వ్యక్తి వచ్చి చేరాడు. ఆయన వ్యాపారంలో వల్లభుడంత గొప్పగా రాణించింది లేదు. కానీ ఊరి ప్రజల హృదయంలో అనతికాలంలోనే మంచిచోటు సంపాదించాడు. కేవలం వ్యాపారం మాత్రమే కాక, జనం తలలో నాలుకలా ఉంటూ.. వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచిస్తూ పేరు సంపాదించాడు.

ఇదంతా వల్లభుడికి నచ్చలేదు. ‘నిన్నగాక మొన్న వచ్చినవాడికి ఇంత విలువేంటి? సమస్యలకు సమాధానాలు ఇవ్వడానికి ఆయనకున్న అర్హత ఏంటి? జనానికి వెర్రి కాకపోతే...’ అనుకుంటూ అసూయతో రగిలిపోసాగాడు. ఒకసారి మిత్రుడొకడు వల్లభుడితో మాట్లాడుతూ.. శేఖరుణ్ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్న తనకు తగిన సలహాలు ఇచ్చాడని, వాటిని పాటించడం ద్వారా తాను తేలిగ్గా వాటి నుంచి బయటపడ్డానని చెప్పాడు.

‘సలహాలు ఇవ్వడం కూడా గొప్పేనా? ఆమాత్రం సలహాలు మరెవరూ ఇవ్వలేరా?’ అనుకుని వల్లభుడు తాను కూడా సమస్యల్లో ఉన్న వారికి సలహాలు ఇచ్చి పేరు సంపాదించాలనుకున్నాడు. తన దగ్గరికి ఏదో పనిమీద వచ్చిన వారికి వారు అడగకపోయినా ఉచిత సలహాలు ఇవ్వసాగాడు. కానీ ఎవరూ పొగిడిన పాపాన పోలేదు. సలహాల కోసం జనం కూడా ఎవరూ రాలేదు. ‘నాలో ఉన్న లోపం ఏంటి? ఎందుకు నా సలహాలు జనానికి నచ్చడం లేదు. ఇంత అనుభవం ఉన్న వ్యాపారస్థుడు.. వీరికి ఎందుకు లెక్కలోకి రాకుండా పోయాడు?’ ఇలా ఆలోచించసాగాడు. ఒకరోజు శేఖరుడి ప్రత్యేకతను ప్రత్యక్షంగా గమనిద్దామని, ఉదయాన్నే అతడి ఇంటి వద్దకు వెళ్లాడు వల్లభుడు. అప్పటికే కొంతమంది శేఖరుడితో మాట్లాడుతున్నారు. వారి వారి సమస్యలు ఏకరువు పెడుతున్నారు. కొద్దిసేపు వేచిచూద్దామని వల్లభుడు వారిమాటలు వినడం ప్రారంభించాడు.

వచ్చిన వారిలో ఒకరు శేఖరుడితో, అయ్యా! నాకు ఒక్కగానొక్క కొడుకు. బాగా చదువుకున్నాడు. రాజుగారి కొలువులో ఉద్యోగం చేయాలని వాడి కోరిక. రాచకొలువులో ఉద్యోగం అంటే మాటలు కాదు కదా! ఈ విషయంలో మీ సలహా ఏమిటి?’ అన్నాడు. దానికి శేఖరుడు, మీ వాణ్ని మంత్రిగారి వద్దకు నేను తీసుకుపోగలను. ఆ పరపతి నాకుంది. అయితే ఆయన వేసే ప్రశ్నలకు మాత్రం మీవాడు సరైన సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. బాగా సిద్ధమై వస్తే నేను తీసుకెళ్లగలను’ అన్నాడు శేఖరుడు. కొడుకు తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉన్న అతను అలాగేనని ఆనందంగా వెళ్లాడు. తర్వాత మరొకరు... ‘అయ్యా! అమ్మాయికి పెళ్లి సంబంధం వచ్చింది. వాళ్లు బాగా ఉన్నవారు. ఘనంగా కట్నం అడుగుతున్నారు. ఇల్లు అమ్మయినా పెళ్లి చేద్దామంటోంది ఇల్లాలు’ అన్నాడు.

‘స్థాయికి మించిన సంబంధాలకు పోకూడదు. పెళ్లితో ఖర్చులు ఆగవు. ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఇల్లు అమ్మితే వృద్ధాప్యంలో ఎక్కడ ఉంటారు. మీకు తగిన సంబంధం చూసుకోండి. తీర్చగలిగినంత  రుణం మాత్రమే చేయండి. నేనూ నాకు చేతనైనంత సహాయం చేయగలను. మీ వీలును బట్టి రుణం తీర్చవచ్చు. మీ మీద నాకామాత్రం నమ్మకం ఉంది’ అన్నాడు శేఖరుడు. అతను కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించి వెళ్లిపోయాడు.

వల్లభుడు ఆలోచనలో పడ్డాడు. ‘తనైతే తన చేతికి మట్టి అంటకుండా సలహాలు మాత్రమే ఇచ్చేవాడు. అదే శేఖరుడు సలహాలు ఇవ్వడమే కాకుండా, తనకు చేతనైనంత సహాయం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు. అందుకే ఆయనకు అంత మంచిపేరు. ఉచిత సలహాలు ఇవ్వడానికి తనలాంటి వారు ఈ లోకంలో కోకొల్లలు. ఒట్టిమాటల వల్ల ప్రయోజనం ఏమీ  ఉండదు. ఏదైనా గట్టి మేలు చేయగలగాలి. అలాంటి వారిని లోకం నెత్తిన పెట్టుకుంటుంది’ అనుకున్నాడు. ఆ తర్వాత వల్లభుడిలో మార్పు వచ్చింది. తోటి వారికి మేలు చేయడానికి ముందుంటూ.. తనూ ఊరికి ఉపకారి అన్న పేరు తెచ్చుకున్నాడు.

- గంగిశెట్టి శివకుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని