మారిన గంగులు!

రంగాపురంలో నివసించే గంగులు గజదొంగ. సాయంత్రం సమయాల్లో, జన సంచారం లేని వేళల్లో దారి కాచి బాటసారులను దోచుకునేవాడు. అలా అపహరించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు. దొంగతనం చేయడం మంచిది కాదనీ, ఎప్పటికైనా చేసిన తప్పులకు శిక్ష తప్పదని అతని భార్య లక్ష్మి ఎన్నోసార్లు చెప్పేది. అయినా భార్య మాటను గంగులు వినిపించుకునేవాడు కాదు. ‘దొంగతనం చేయడానికి ధైర్యం కావాలి...

Published : 17 Aug 2022 01:05 IST

రంగాపురంలో నివసించే గంగులు గజదొంగ. సాయంత్రం సమయాల్లో, జన సంచారం లేని వేళల్లో దారి కాచి బాటసారులను దోచుకునేవాడు. అలా అపహరించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు. దొంగతనం చేయడం మంచిది కాదనీ, ఎప్పటికైనా చేసిన తప్పులకు శిక్ష తప్పదని అతని భార్య లక్ష్మి ఎన్నోసార్లు చెప్పేది. అయినా భార్య మాటను గంగులు వినిపించుకునేవాడు కాదు. ‘దొంగతనం చేయడానికి ధైర్యం కావాలి. నాకు ధైర్యం ఉంది. ఇదే నా వృత్తి’ అని గొప్పగా సమాధానమిచ్చేవాడు.

అలవాటులో భాగంగా, ఓ సాయంత్రం.. జనసంచారం లేని సమయం చూసి దారి కాచాడు గంగులు. కాసేపటికి ఒక వ్యక్తి అటు వైపు రావడం గమనించాడు. ఆలస్యం చేయకుండా ముసుగు వేసుకుని అమాంతం అతడిని అడ్డుకున్నాడు. చేతిలో ఉన్న పదునైన కత్తిని అతడికి చూపి.. ‘నీ దగ్గర ఉన్న డబ్బంతా ఇవ్వకపోతే చస్తావు’ అని హెచ్చరించాడు. ‘బాబూ.. నా స్నేహితుని దగ్గర తీసుకున్న అయిదు వేల రూపాయలను తిరిగి ఇచ్చేందుకు బయలు దేరాను. దయచేసి నన్ను ఏమీ చేయకు. నా దగ్గరున్న డబ్బు దోచుకోకు’ అంటూ ఆ బాటసారి దీనంగా వేడుకున్నా గంగులు వినలేదు. అతడి దగ్గర ఉన్న మొత్తం డబ్బు లాక్కొని.. ‘ఎవరికైనా చెబితే నీ ప్రాణాలు కూడా పోతాయి.. జాగ్రత్త’ అంటూ బెదిరించాడు. రెప్పపాటులో అక్కడి నుంచి పరారయ్యాడు.

మరుసటి రోజు ఉదయం గంగులుకు అతని చొక్కా జేబులో పెట్టిన ఆ అయిదు వేల రూపాయలు కనిపించలేదు. ‘లక్ష్మీ.. నా జేబులో డబ్బులు కనిపించడం లేదు. నువ్వు తీశావా?’ అని అడిగాడు. ‘తీయలేదు’ అని జవాబిచ్చిందామె. ‘మరైతే ఎవరు తీసి ఉంటారు?’ అంటూ ఇంటి బయటనున్న అరుగు వైపు చూశాడు. అయిదో తరగతి చదువుతున్న కొడుకు రాజు దాని మీద కూర్చొని కనిపించాడు. ‘రాజూ.. నా జేబులో నుంచి డబ్బులు తీశావా?’ అడిగాడు. ‘నేను తీయలేదు నాన్నా.. నాకు తెలియదు’ అన్నాడు రాజు. ‘లేదు.. నిన్ను చూస్తుంటే అనుమానం కలుగుతోంది. నిజం చెప్పు! డబ్బు ఎందుకు తీశావ్‌?’ అని కన్నెర్రజేశాడు తండ్రి. ‘లేదు నాన్నా.. నేను తీయలేదు!’ అని లేని ధైర్యాన్ని కూడదీసుకొని మరీ సమాధానం చెప్పాడు రాజు.

‘నిన్ను ఇలా అడిగితే చెప్పవురా!’ అంటూ బెల్టు తీశాడు గంగులు. ఇంతలో లక్ష్మి వచ్చి ‘పసి పిల్లాడు. వాడికేం తెలుస్తుంది. కొట్టకండీ..’ అంటూ గంగులుకు అడ్డుగా నిలబడింది. ‘తప్పుకో లక్ష్మీ.. ఇంత చిన్న వయసులో అబద్ధాలు ఆడతాడా.. దొంగతనం చేస్తాడా.. తప్పు కదా?’ అని గట్టిగా అరిచాడు. ఆ మాటలకు రాజు బిగ్గరగా నవ్వాడు. ‘తప్పు చేసింది కాక నవ్వుతావా’ అంటూ ముందుకెళ్లాడు గంగులు. బెల్టును చాకచక్యంగా పట్టుకున్న రాజు.. ‘దారి దోపిడీలు చేసే మీరు దొంగతనం తప్పని చెబుతుంటే.. నవ్వు కాక మరేమొస్తుంది నాన్నా?’ అన్నాడు. రాజు మాటలకు ఆశ్చర్యపోయిన గంగులు బెల్టును పక్కన పడేస్తూ.. ‘నేను దొంగతనాలు చేస్తానని నీకెవరు చెప్పారు?’ అని అడిగాడు.

అప్పుడు రాజు ఇలా అన్నాడు. ‘నిన్న సాయంత్రం నా స్నేహితుడు తన పుట్టినరోజుకు పిలిస్తే.. బడి పూర్తయ్యాక వాళ్లింటికి వెళ్లా. తిరిగొస్తుంటే దారిలో నువ్వు ఒక వ్యక్తిని దోచుకోవడం చెట్టు చాటున నిల్చొని చూశాను. నువ్వు ముసుగులో ఉన్నా.. నేను నిన్ను గుర్తుపట్టాను. అది చూసి, మా నాన్న దొంగా?’ అని చాలా బాధ పడ్డాను. ‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు సర్దిచెప్పాలి. అటువంటిది తండ్రే తప్పు చేస్తే ఆ పిల్లలు ఎంత బాధపడతారో ఎప్పుడైనా ఆలోచించావా నాన్నా?’ అన్న రాజు మాటలకు గంగులులో మార్పు మొదలైంది. ‘రాజూ..’ అంటూ వాడిని దగ్గరకు తీసుకున్నాడు.

అప్పుడే తల్లి తీసి ఇచ్చిన, తన జేబులో దాచిన ఆ అయిదు వేలను గంగులు చేతిలో పెడుతూ.. ‘ఒకరు మన డబ్బు దొంగిలిస్తే, ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలనే అమ్మ మీ జేబులో నుంచి డబ్బు తీసింది. ఆ బాటసారి ఎవరో కాదు నాన్నా.. మా బడిలో తెలుగు మాస్టారే.. దొంగతనం చేయరాదని మాకు నీతి పాఠం చెప్పిన మాస్టారి డబ్బును నువ్వు దొంగిలించావు. అది చూసిన నాకు చాలా బాధ కలిగింది. నీ దృష్టిలో దొంగతనం తప్పు కాకపోతే.. నాకూ దొంగతనం నేర్పించు నాన్నా. బడికి వెళ్లకుండా, నేనూ నీతోపాటే వస్తాను’ అన్నాడు రాజు.

కొడుకు మాటలు తండ్రిని ఆలోచనలో పడేశాయి. ‘రాజూ.. నీ ద్వారా నాకు జ్ఞానోదయం అయింది. దొంగతనం చేయడానికి ఎంతో ధైర్యం కావాలని గొప్పగా అనుకున్నాను. కానీ కష్టపడి సంపాదిస్తేనే సమాజంలో గౌరవం, మర్యాద లభిస్తాయని అర్థమైంది. పద రాజూ.. నీ బడికి వెళ్దాం. మీ మాస్టారి డబ్బు తిరిగి ఆయనకు ఇచ్చేద్దాం’ అంటూ బయటకు నడిచారిద్దరూ. కొడుకు ద్వారా భర్తలో వచ్చిన మార్పునకు లక్ష్మి ఎంతగానో సంతోషించింది.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని