మామిడి మిడిసిపాటు!

అనగనగా రామాపురం అనే ఊరు. ఆ గ్రామంలో ఓ ఇల్లు. ఆ ఇల్లు నందనవనంలా ఉంది. ఆ ఇంట్లో రకరకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. మామిడి, అరటి, జామ, ఉసిరి, మల్లె, గులాబి, వేప ఇలా... చాలా చెట్లు ఉన్నాయి. అందులో మామిడి చెట్టు, వేప చెట్టు చాలా పెద్దగా శాఖోపశాఖలుగా

Updated : 29 Aug 2022 06:33 IST

అనగనగా రామాపురం అనే ఊరు. ఆ గ్రామంలో ఓ ఇల్లు. ఆ ఇల్లు నందనవనంలా ఉంది. ఆ ఇంట్లో రకరకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. మామిడి, అరటి, జామ, ఉసిరి, మల్లె, గులాబి, వేప ఇలా... చాలా చెట్లు ఉన్నాయి. అందులో మామిడి చెట్టు, వేప చెట్టు చాలా పెద్దగా శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నాయి.

మామిడి చెట్టుకు తాను చెట్లలో రారాజునని గర్వంగా ఉండేది. అందుకే మిగతా చెట్లను చూస్తూ, ‘నాలో ఉన్న పండ్ల రకాలు ఏ చెట్లలో కూడా ఉండవు. హిమాయత్‌, బంగినపల్లి, తోతాపురి, రసాలు ఇలా రకరకాల రుచులు నా సొంతం. అంతేనా? మామిడి కాయ పచ్చడిలో కూడా ఆవకాయ, మాగాయ ఇలా రకాలుంటాయి. మామిడితో పులిహోర చేసి ఇష్టంగా తింటారు. దేవుడికీ నైవేద్యంగా పెడతారు. నా పత్రాలు మంగళకరమైన గృహప్రవేశాలకు, పెళ్లిళ్లకు, పండగలకు శుభప్రదమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. నన్ను మించిన చెట్టు ఈ భూ గ్రహం మీద లేదు. తెలుగు సంవత్సరాది ఉగాదికి కూడా నన్నే ఎక్కువగా వాడతారు. నేను ఇంటి ముందు కాయలతో అందంగా ఉంటాను. మీ అందరిలో ఎవరైనా నాతో సరి తూగగలరా? ఎవ్వరూ నాకు సాటి రారు’ అంటూ గర్వంతో మిడిసి పడింది.

పోనీ అక్కడితో ఊరుకుందా! అంటే అదీ లేదు.. మిగతా వాటినీ గేలి చేసింది. మల్లె, గులాబీ, బంతి, చామంతి ఇలా.. ఇతర పూల మొక్కలనూ కించపరిచింది. ‘మీరంతా కేవలం అందానికే పనికి వస్తారు. కడుపు నింపలేరు..’ అంది. మిగతా పండ్ల చెట్లనూ అవహేళన చేసింది. ‘నాలాగా అన్ని రకాలు మీలో ఉన్నాయా? మీరెవ్వరూ నాకు సాటి రారు. ఇక ఈ వేప చెట్టు అయితే కేవలం గాలికి తప్ప దేనికీ పనికి రాదు..’ అంటూ తక్కువ చేసి మాట్లాడింది.

మిగతావి ఒకసారి మామిడి చెట్టు వైపు చూసి మిన్నకున్నాయే కానీ ఏమీ అనలేదు. మౌనంగా ఉండిపోయాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఉన్నట్లుండి.. మామిడి చెట్టుకు పురుగు పట్టింది. చూస్తుండగానే చెట్టు ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. కొనఊపిరితో ఉన్న మామిడిని చూసి, ఆ ఇంటి యజమాని బయట నుంచి ఒక నిపుణుడిని తీసుకొచ్చాడు. అతడికి మామిడి చెట్టును చూపిస్తూ... ‘అది బతకాలంటే ఏం చేయాలి’ అని అడిగాడు. అతను.. ‘మీ ఇంట్లోనే వేప ఉంది కదా, వేపచెట్టులో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. మీ దంతాల సమస్యకు కూడా వేపపుల్లను ఉపయోగించవచ్చు. వేపకాయల పొడిని మామిడి చెట్టు మొదలులో పోస్తే పురుగు పోతుంది. అలాగే వేప రసాన్ని పిచికారి చేయండి’ అని వెళ్లిపోయాడు.

ఆ నిపుణుడు చెప్పినట్లు చేయగానే కొద్ది రోజుల్లోనే, పురుగంతా పోయి కొత్తగా చిగురించింది మామిడి. తనను బతికించిన వేపను చూస్తూ... ‘చనిపోతున్న నన్ను బతికించావు. నిన్ను హేళన చేశానని నువ్వు బాధపడ్డా.. బయటపడలేదు. తిరిగి నన్ను ఒక్కమాట కూడా అనలేదు. నన్ను బతికించానన్న గర్వం కూడా నీలో లేదు. నేను మిమ్మల్ని అందరినీ హేళన చేశాను. ఒకరి రుచి వేరొకరికి రాదు. ఎవరి సుగుణం వారిదే! అయినా గర్వంతో విర్రవీగాను. మీరంతా నన్ను భరించారు... కానీ ఒక్క మాట కూడా అనలేదు. మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నన్ను క్షమించండి’ అంది. అక్కడున్న చెట్లు, మొక్కలన్నీ... ‘మనమంతా ఒకటే...’ అంటూ... హాయిగా కొమ్మలూపుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి.

- నామని సుజనాదేవి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని