జింక పిల్లకు మాటలొచ్చాయి!

అడవిలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆ పెళ్లికి కుందేలు, జిరాఫీ, ఏనుగు, ఒంటె, జింక మొదలైనవన్నీ గబగబా బయలుదేరాయి. జింక తన బిడ్డను వెంట తీసుకొని వచ్చింది. ఇంతలో వాటికి నక్క ఒకటి ఎదురైంది. నక్కను చూసిన పిల్ల జింక ‘అదిగో.. కుక్క వచ్చింది’ అని అంది. అప్పుడు తల్లి జింక.. ‘చిన్నోడా.. అది కుక్క కాదురా..

Published : 17 Sep 2022 00:19 IST

డవిలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఆ పెళ్లికి కుందేలు, జిరాఫీ, ఏనుగు, ఒంటె, జింక మొదలైనవన్నీ గబగబా బయలుదేరాయి. జింక తన బిడ్డను వెంట తీసుకొని వచ్చింది. ఇంతలో వాటికి నక్క ఒకటి ఎదురైంది. నక్కను చూసిన పిల్ల జింక ‘అదిగో.. కుక్క వచ్చింది’ అని అంది. అప్పుడు తల్లి జింక.. ‘చిన్నోడా.. అది కుక్క కాదురా.. నక్క’ అని దాని మాటలను సవరించింది. పిల్ల జింక మాటలతో నక్కకు కోపం వచ్చి... ‘దీన్ని ఎందుకు వెంట తీసుకొస్తున్నావు?’ అని తల్లి జింకను ప్రశ్నించింది. అప్పుడు తల్లి జింక... ‘ఏదో వీడు పెళ్లికి వస్తానని ఒకటే ముచ్చట పడుతున్నాడు. అందుకే తీసుకొని వస్తున్నాను’ అని సమాధానం ఇచ్చింది.

ఇంతలో వాటికి తోడేలు ఒకటి ఎదురైంది. ‘అదిగో తోడేలు సచ్చింది’ అని అంది పిల్ల జింక. ఆ మాటలకు అక్కడున్న జీవులన్నీ నవ్వాయి. తోడేలు కోపంతో... ‘దీనికి ఇంత వయసు వచ్చినా సరిగా మాట్లాడడమే రాదు’ అని విసుక్కుంది. సరేనంటూ అవి మళ్లీ తమ ప్రయాణం మొదలుపెట్టాయి. వాటిని గమనించిన అడవి దున్న.. ‘మీరంతా ఎక్కడికి వెళుతున్నారు.. కోతిబావ పెళ్లికేనా!’ అని అడిగింది. ‘అవును... మోతి బావ పెళ్లికే’ అని అంది పిల్ల జింక. అది విన్న తల్లి జింక.. ‘ఒరేయ్‌! నువ్వు ఏమీ మాట్లాడకురా! అందరూ నీ మాటలకు కోపగించుకుంటున్నారు’ అని బాధగా చెప్పింది. వెంటనే పిల్ల జింక... ‘సరేనమ్మా!’ అని అనబోయి.. ‘అరే అమ్మా’ అని అంది. అప్పుడు తల్లి జింక.. ‘వీడు సరేనమ్మా అనబోయి, నన్ను.. అరే అమ్మా అని అంటున్నాడు.. మీరు వాడి మాటలు పట్టించుకోకండి. చిన్న వయసు కదా.. కాస్త మీరే సర్దుకుపోవాలి’ అని అంది.

వెంటనే అడవి దున్న.. ‘కోతి బావ పెళ్లికి శాకాహారులే కాకుండా ఈ మాంసాహారులు కూడా వస్తున్నట్లు ఉన్నాయే!’ అని తోడేలు, నక్కల వైపు చూస్తూ అంది. వెంటనే నక్క, తోడేలు.. ‘మమ్మల్ని పిలవకపోతే, మేము ఎందుకు వస్తాం?’ అని కాస్త నొచ్చుకున్నట్లుగా సమాధానం ఇచ్చాయవి. ‘ఎవరు తినేది వాళ్లు తింటారు.. అయినా, పెళ్లి ముఖ్యం కానీ భోజనం కాదుగా..’ అని బదులిచ్చింది కుందేలు. ‘అవును.. మోతి బావ చిందు బాగుంటుంది’ అని అంది పిల్ల జింక. ‘అవును.. అది చిందులు వేసినా, చాలా బాగుంటుంది’ అని అంది కుందేలు. వెంటనే తల్లి జింక.. ‘అది చెప్పేది.. చిందులు కాదమ్మా! విందు అనబోయి చిందు అని అంది’ అని సవరించింది.

కొంతసేపటికి అవన్నీ కోతి బావ ఇంటికి చేరుకున్నాయి. అప్పటికే అక్కడ దున్నపోతు ‘డుం.. డుం.. డుం..’ అని డోలు వాయిస్తుంటే... ‘పీ.. పీ.. పీ..’ అని కొండచిలువ సన్నాయికి పనిచెప్పింది. ఆ వాయిద్యానికి తగినట్లు నాగుపాము నాట్యం చేయసాగింది. ‘ఈ పెళ్లికి పక్షులను కూడా పిలిస్తే బాగుండేది’ అని అంది కుందేలు. ‘అవును.. సాక్షులను కూడా పిలిస్తే బాగుండేది’ అని అంది పిల్ల జింక. ‘నువ్వు ఊరుకోరా’ అని కసురుకుంది కుందేలు. కోతి బావ వచ్చి అందరినీ పలకరించింది. అందరికీ పండ్లు, దుంపలను పంచి పెట్టింది. నక్క, తోడేలుతోపాటు వచ్చిన పెద్దపులి, చిరుత పులులకు అది నవ్వుతూ.. ‘మీకు మాంసాహార విందు భోజనం రేపు ఏర్పాటు చేయిస్తాను’ అని అంది.

ఆ మాటలకు పులి, చిరుత, నక్క, తోడేలు సంతోషించాయి. ఇంతలో అక్కడికి తప్పెట్లు వాయిస్తూ చింపాంజీలు రాగా, మృగరాజు సింహం ఠీవిగా రాణి ఆడ సింహంతో పాటు అక్కడకు వచ్చింది. కోతి బావ వచ్చి వాటికి స్వాగతం పలికింది. ‘అదిగో సింహం గాజు, సింహం బాణి వచ్చారు’ అని అంది పిల్ల జింక. అప్పుడు తల్లి జింక ‘ఒరేయ్‌ సింహం రాజు, సింహం రాణి అని అనాలి’ అని సర్దిచెప్పింది. వెంటనే మృగరాజు సింహం దాని వైపు గుర్రుగా చూసింది. అప్పుడు తల్లి జింక ‘మృగరాజా! మమ్మల్ని క్షమించండి. నా బిడ్డకు మాటలు ఇంకా సరిగా రావు’ అని సింహాన్ని ప్రాధేయపడింది.

వెంటనే అక్కడికి వచ్చిన ఎలుగుబంటి ‘అయ్యో.. జింక తల్లీ! ఇన్ని రోజులూ నాకు నీ బిడ్డ సంగతి చెప్పలేదు! దీనికి మంచిగా మాటలు వచ్చే మందు నాకు తెలుసులే!’ అని అడవిలోకి వెళ్లింది. గంట తరవాత తిరిగొచ్చిన ఎలుగుబంటి.. తన వెంట తీసుకొచ్చిన పచ్చని ఆకులను పసరుగా చేసి.. పిల్ల జింక నోట్లో పోసింది. వెంటనే పిల్ల జింక ‘చాలు, చాలు’ అని అంది. కొద్దిసేపటికే అది.. ‘ఈ రోజు మా కోతిబావ పెళ్లికి వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ విందు భోజనాన్ని నేనే స్వయంగా వడ్డిస్తా’ అని స్పష్టంగా అంది. ఆ మాటలకు ఎలుగుబంటి... ‘చూశారా! ఇది ఎంత చక్కగా మాట్లాడుతుందో!’ అని అంది. వెంటనే ఎలుగుబంటికి కృతజ్ఞతలు తెలిపింది తల్లి జింక.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని