బంగారయ్య.. సింగారయ్య!

యాదగిరిపల్లిలో బంగారయ్య, సింగారయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో రెండు కుటుంబాల్లోని సభ్యుల మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది. వారిద్దరూ సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో

Published : 26 Sep 2022 00:58 IST

యాదగిరిపల్లిలో బంగారయ్య, సింగారయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండటంతో రెండు కుటుంబాల్లోని సభ్యుల మధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది. వారిద్దరూ సాగు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఏదైనా ఒక మంచి ఉద్యోగం దొరికితే బాగుండునని అనుకునేవారు. అదే వీధిలో ఉంటున్న ఓ వ్యక్తి.. ‘రాజు గారి కొలువులో కొన్ని ఖాళీలు ఉన్నాయి’ అని చెప్పడంతో.. బంగారయ్య, సింగారయ్య దరఖాస్తు చేసుకున్నారు. ఏ విషయమూ కొన్ని రోజుల్లో కబురు పంపిస్తామని రాజు ఆస్థానంలోని ఉన్నత ఉద్యోగులు తెలియజేశారు. ఆరోజు నుంచి వారిద్దరూ ఆ కబురు కోసం ఆశగా ఎదురుచూడసాగారు.

ఈ క్రమంలో ఒకరోజు అరుగు మీద కూర్చున్న సింగారయ్య దగ్గరకు బంగారయ్య వచ్చాడు. ‘సింగారయ్యా.. ఈరోజు పక్క ఊర్లో ఉంటున్న మన స్నేహితుడు సుగుణయ్య కొడుకు పెళ్లి ఉంది కదా.. మర్చిపోయావా?’ అని అడిగాడు. ‘అవును నిజమే.. అసలా విషయమే మరచిపోయా. వెంటనే బయలుదేరితే పెళ్లి సమయానికి అందుకుంటాం. కానీ, ఆ ఊరు వెళ్లాలంటే అడవి దాటాల్సిందే’ అన్నాడు సింగారయ్య. ‘మరేం ఫర్వాలేదు.. నేను ఉన్నాను కదా.. త్వరగా వెళ్దాం పద’ అంటూ సింగారయ్యను తొందరపెట్టాడు బంగారయ్య. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ కలిసి పెళ్లికి బయలుదేరారు.

మార్గమధ్యలో అడవిని దాటుతుండగా ఏదో అలికిడి కావడంతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు పరుగెత్తుకుంటూ రావడం చూసి కంగారుపడ్డారు. ఆ నలుగురు.. బంగారయ్య, సింగారయ్య దగ్గరికి వచ్చి.. ‘మేము రాజు గారి ఖజానా నుంచి కొన్ని వజ్రాలను దొంగతనం చేసి పారిపోతుండగా భటులు మమ్మల్ని వెంబడిస్తున్నారు. ఈ సంచిలో 100 వజ్రాలు ఉన్నాయి. మేము భటులకు దొరక్కుండా ఉంటే ఏదో ఒక రోజు తిరిగి మిమ్మల్ని కలుస్తాం. వజ్రాల్లో 20 మీకిచ్చి.. మిగతావి మేం తీసుకుంటాం’ అంటూ వజ్రాల మూటను వారి చేతిలో పెట్టి పరిగెత్తారు.

అనుకోని సంఘటనతో బంగారయ్య, సింగారయ్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాసేపు చెట్టు కింద సేద తీరి స్థిమితపడ్డాక.. పెళ్లికి హాజరవడం కంటే ఇంటికి వెళ్లడమే మంచిదనుకొని తిరిగి పయనమయ్యారు. దారిలో ‘బంగారయ్యా... ఇది మనకు మంచి అవకాశం. ఆ దొంగలు ఎలాగూ తిరిగిరాలేరు. ఇక ఈ వంద వజ్రాలు మనకే. చెరో 50 చొప్పున పంచుకుంటే.. ఇక మన కష్టాలు గట్టెక్కినట్లే’ అని అన్నాడు సింగారయ్య. అందుకు బంగారయ్య ‘మిత్రమా.. నువ్వు చేసిన ఆలోచన సరైనది కాదు. ఇది రాజు గారి సొమ్ము. అంటే ప్రజల సొమ్ము. మనం ఈ వజ్రాలను రాజు గారి ఖజానాకు అందించడమే సరైంది’ అన్నాడు. అందుకు సింగారయ్య ‘మిత్రమా.. అయితే అలాగే చేద్దాం. నా వాటా 50 వజ్రాలను నాకివ్వు. నీ భాగాన్ని రాజు గారికి ఇవ్వు’ అని చెప్పాడు.

స్నేహితుడి వక్రబుద్ధికి బాధపడ్డాడు బంగారయ్య. అతడికి 50 వజ్రాలను ఇచ్చి, మిగతా వాటిని రాజు గారి ఖజానాకు అందించాడు. ‘ఈ వజ్రాలు ఎక్కడివి?’ అని రాజు ప్రశ్నించడంతో.. జరిగిన విషయం చెప్పాడు బంగారయ్య. ‘మరి ఆ దొంగలు వంద వజ్రాలిస్తే సగమే ఇచ్చావేం? మిగతావి ఎక్కడ?’ అని ప్రశ్నించాడు రాజు. మౌనంగా ఉన్న బంగారయ్యను చూసి రాజు నవ్వి.. ‘బంగారయ్యా.. మిగతా 50 వజ్రాలు సింగారయ్య దగ్గర ఉన్నాయని నాకు తెలుసు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న మీ ఇద్దరికీ మేము పెట్టిన పరీక్ష ఇది. మీకు వజ్రాలు ఇచ్చింది దొంగలు కాదు రాజభటులే. ఈ పరీక్షలో నువ్వు నెగ్గావు కాబట్టి నీకు ఉద్యోగం ఖరారు చేశాం. సింగారయ్యకు శిక్ష విధిస్తున్నాం’ అన్నాడాయన. జరిగినదంతా నిజం కాదనీ, రాజు గారు పెట్టిన పరీక్ష అని తెలుసుకున్న బంగారయ్య ఆశ్చర్యపోయాడు. తన మిత్రుడు సింగారయ్యను క్షమించాలని కోరినా.. ససేమిరా అన్నాడు రాజు. సింగారయ్య దగ్గరున్న 50 వజ్రాలను స్వాధీనం చేసుకుని కారాగారంలో వేశారు.  నిజాయతీగా వ్యవహరించిన బంగారయ్యకు రాజు ఆస్థానంలో కొలువు దక్కగా.. చెడుబుద్ధితో శిక్షకు గురయ్యాడు సింగారయ్య.  

    - వడ్డేపల్లి వెంకటేష్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని