Published : 03 Oct 2022 00:18 IST

ఎవరిది ఆలస్యం?

అడవిలో సమావేశం అప్పుడే మొదలైంది. రాజైన సింహం దర్జాగా సింహాసనం మీద కూర్చొంది. మంత్రి కుందేలు సమావేశాన్ని ప్రారంభించింది. అంతలోనే చిట్టి అనే చిలుక సమావేశానికి రాబోతుండగా.. ‘చిట్టీ! నిన్ను మృగరాజు రావొద్దని చెప్పారు. ఈరోజు నుంచి అడవిలోని మిగతా జీవులతో నువ్వు మాట్లాడకూడదు. నీ దారి నీది’ అంటూ వెళ్లిపొమ్మంది. కుందేలు మాటలు విన్న చిట్టి ఆశ్చర్యపోతూ.. ‘నేను చేసిన నేరం ఏంటి?’ అని అడిగింది. ‘నిన్ను బహిష్కరించాం. ఇక కారణాలతో పనిలేదు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపో!’ అని మృగరాజు అనగానే చిట్టి ఒక్కసారిగా భయపడింది.

వెళ్లిపోతూ.. తిరిగి తన స్నేహితుడైన కర్ణిక అనే కాకి వైపు దీనంగా చూసింది. ‘భయపడకు చిట్టీ. నీకు నేనున్నాను’ అంటూ దూరంగా ఉన్న ఆ జామ చెట్టు మీదకు వెళ్లమంటూ దానికి సైగ చేసింది. చిట్టి అలాగే వెళ్లి చెట్టుపైన వాలింది. మృగరాజుకు కనబడకుండా కొమ్మల మధ్య కూర్చొని నక్కినక్కి చూస్తోంది. ‘కర్ణికా.. బహిష్కరణకు గురైన వారితో మాట్లాడితే.. నీకు కూడా అదే శిక్ష పడుతుంది’ అని హెచ్చరించింది కుందేలు. ‘సమస్య ఏదైనా ఉంటే వేదిక ముందు అందరికీ వినబడేలా, కనబడేలా చెప్పు. అంతేకానీ చిట్టితో నువ్వు అలా సైగలు చేస్తూ మాట్లాడటం సరికాదు’ అంది.

అందరి ముందూ కుందేలు తనను రెండుసార్లు హెచ్చరించడంతో కర్ణికకు కోపం వచ్చింది. మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకొన్నట్లు అవుతుందని అనుకుంది. ‘సమస్య వస్తే రాజుకు చెప్పుకొంటారు. కానీ, ఇక్కడ రాజే సమస్య అయినప్పుడు ఎవరికి చెప్పను? ఎలా చెప్పను?’ అని ధైర్యం తెచ్చుకుని అంది కర్ణిక. దాని మాటలకు మృగరాజు ఎలా స్పందిస్తుందోనని ఏనుగు, జింక, నక్క, తోడేలు భయంభయంగా చూడసాగాయి. మృగరాజు సింహాసనం మీద నుంచి లేచింది. ‘శభాష్‌ కర్ణికా.. అణిచివేత తిరుగుబాటుకు ప్రధాన కారణం అవుతుందని నిరూపించావు. నీ స్నేహితుడిని బహిష్కరించడంతో ఆవేశంగా మాట్లాడుతున్నావు’ అని అంది.

‘ఆవేశం కాదు  మృగరాజా! నా చిట్టిని ఎందుకు వెలి వేశారో చెప్పండి చాలు’ బాధగా అడిగింది కర్ణిక. అప్పుడు కుందేలు ‘మొన్న జరిగిన సమావేశానికి.. చిట్టి పావుగంట ఆలస్యంగా వచ్చింది. సమయపాలన పాటించని వారిని బహిష్కరించమని మృగరాజు నాకు చెప్పారు. నేను అలాగే చేశా’ అంటూ కారణం చెప్పింది. దూరం నుంచి చిట్టి అంతా గమనిస్తోంది. ఇప్పుడు కర్ణిక ఏ విధంగా చిట్టిని సమర్ధిస్తుందోనని మిగతా జీవులన్నీ ఆసక్తిగా ఎదురు చూడసాగాయి. ‘అయితే మొన్న జరిగిన సమావేశానికి మన రాజు కూడా అరగంట ఆలస్యంగా వచ్చారు కదా.. అంటే సమయపాలన మాకే తప్ప రాజుగారికి వర్తించదా? ఇదెక్కడి న్యాయం?’ అంటూ కర్ణిక కొంచెం గట్టిగానే అడిగింది.

‘భలే అడిగావు మిత్రమా.. నిజమైన స్నేహితుడివి అనిపించుకున్నావు’ అని మనసులోనే అనుకుంది చిట్టి. కర్ణిక మాటలకు సింహం ఏం చెబుతుందోనని మిగతా జీవులన్నీ ఆసక్తిగా గమనించసాగాయి. ‘నీ ధైర్యం నాకు నచ్చింది. చిట్టి ఆ రోజు ఎందుకు ఆలస్యంగా వచ్చిందో కనుక్కో! అప్పుడు ఎందుకు బహిష్కరించానో చెబుతాను’ అని సింహం అనడంతో కర్ణిక చెట్టుపైనున్న చిట్టిని పిలిచింది. అది భయంభయంగా మృగరాజు ముందుకు వచ్చి వాలింది. ‘బద్ధకంగా అనిపించి ఆరోజు కాస్త ఆలస్యంగా నిద్ర లేచాను. ఒక్క రోజు ఆలస్యంగా రావడం అంత పెద్ద నేరమా?’ అని గట్టిగానే అడిగింది చిట్టి.

‘నేరమే.. చిన్న కత్తి పోటు పెద్ద జంతువును కూడా చంపగలదు. నీ దృష్టిలో ఆలస్యం అమృతం కావచ్చు కానీ, నాకు విషం. నీ ఆలస్యం కారణంగా ఆ రోజు ఏమైందో నీకు తెలుసా?’ అని మృగరాజు గట్టిగా ప్రశ్నించింది. మిగతా జీవులన్నీ మృగరాజు వైపు ఆశ్చర్యంగా చూశాయి. ‘ఆ రోజు సమావేశం మొదలయ్యే ముందుగా కుందేలు నా గుహ వద్దకు వచ్చింది. అందరూ వచ్చారా అని కుందేలును అడిగాను. చిట్టి ఇంకా రాలేదని చెప్పింది. నేను వెంటనే అప్రమత్తమై అది ఉండే చోటుకు వెళ్లాను. అప్పుడు చిట్టి నిద్రలో ఉంది. అప్పటికే వేటగాళ్లు చిట్టి ఒంటరిగా ఉందని గమనించి వల వేయబోతుండగా.. నా అలికిడి విని పారిపోయారు. చిట్టి మేల్కొన్నాకే.. నేను సమావేశానికి వచ్చాను. గుంపుగా ఉంటే వేటగాళ్లు మనల్ని ఏమీ చేయలేరు. అందుకే ఒక అంచనాతో సమావేశం పేరుతో అందరినీ ఒక దగ్గర చేరుస్తున్నాను. మంత్రి కుందేలు నాకు సహకరిస్తోంది. ఇప్పుడు చెప్పండి.. సమావేశానికి ఆలస్యంగా చిట్టి వచ్చిందా.. నేనా?’ అంటూ అందరివైపు చూస్తూ అడిగింది మృగరాజు.

కారణం తెలిసి కర్ణిక మౌనంగా ఉండిపోయింది. ‘నన్ను మన్నించండి రాజా’ అని చిట్టి సిగ్గుతో తలదించుకుంది. ‘బద్ధకం పనికిరాదనే విషయం మరోసారి తెలియజేయాలనే కుందేలుతో కలిసి బహిష్కరణ నాటకం ఆడా. మీ క్షేమమే నాకు ముఖ్యం’ అని సింహం అనగానే, జీవులన్నీ మృగరాజుకు జై కొట్టాయి.

- కె.వి.లక్ష్మణరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts